Red moon: సెప్టెంబర్ 7న ఎర్రటి చంద్రుడిని చూస్తారా?
Red moon: రాత్రిపూట ఆకాశంలో ఒక అరుదైన, ఆకర్షణీయమైన బ్లడ్ మూన్‌ను చూసే ఈ అవకాశం పర్యాటకులకు, ఖగోళ శాస్త్ర ప్రియులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

Red moon
చంద్రుడు ఎప్పుడూ ఒకేలా ఉండడు. కొన్నిసార్లు వెన్నెలలా మెరుస్తూ, మరికొన్నిసార్లు ఎర్రటి (Red moon)రంగులోకి మారిపోతాడు. ఈ రంగు మార్పు వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఏమిటి? సెప్టెంబర్ 7, 2025న కనిపించనున్న అరుదైన ‘బ్లడ్ మూన్’ (Blood Moon) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దృశ్యం కేవలం కంటికి ఇంపుగా ఉండటమే కాదు, ఖగోళ శాస్త్రంలోని ఒక అద్భుతానికి నిదర్శనం కూడా.
ఈ ఏడాదిలో ఇది రెండో సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. ఈ సమయంలో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా రావడం వల్ల మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని భారతదేశం, చైనా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని చాలా ప్రాంతాల ప్రజలు స్పష్టంగా చూడగలరు. మన దేశంలో ఈ గ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 గంటల వరకు ఉంటుంది.
అయితే చంద్రుడు ఎర్రటి ( red moon)రంగులోకి మారడానికి కారణం మన భూమి వాతావరణం. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో, భూమి చంద్రుడికి, సూర్యుడికి మధ్య వస్తుంది. సూర్యుడి కాంతి నేరుగా చంద్రుడిపై పడకుండా, భూమి వాతావరణం గుండా వెళుతుంది.
భూమి వాతావరణం ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. సూర్యకాంతిలోని నీలం, ఊదా రంగులు వాతావరణంలో చెల్లాచెదురుగా మారిపోతాయి. కానీ ఎరుపు, నారింజ రంగులు మాత్రం వంగి, చంద్రుడి ఉపరితలంపై పడతాయి. అందుకే చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. ఈ అసాధారణ దృశ్యం వల్లనే దీనిని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు.

బ్లడ్ మూన్ అనేది ఒక రకమైన సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse). చంద్రగ్రహణాలు సంవత్సరానికి కనీసం రెండు నుంచి నాలుగు సార్లు జరుగుతాయి. అయితే, ఇందులో అన్నింటినీ బ్లడ్ మూన్ అని పిలవలేము. బ్లడ్ మూన్(Red moon) సంభవించడానికి, అది సంపూర్ణ చంద్రగ్రహణం అయి ఉండాలి, అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. సగటున, ప్రతీ మూడు సంవత్సరాలకు రెండు సార్లు సంపూర్ణ చంద్రగ్రహణాలు సంభవిస్తాయి.
అన్ని గ్రహణాలు ఒకే చోటు నుంచి కనిపించవు. భూమిపై మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి, కొన్నిసార్లు ఒక సంవత్సరంలో రెండు గ్రహణాలు జరిగినా, మన ప్రాంతంలో ఒక్కటి కూడా కనిపించకపోవచ్చు.
ఈ అద్భుతమైన దృశ్యం ఒకేసారి హార్వెస్ట్ మూన్‌తో కలసి వస్తుండడం మరింత ప్రత్యేకతను ఇస్తోంది. రాత్రిపూట ఆకాశంలో ఒక అరుదైన, ఆకర్షణీయమైన బ్లడ్ మూన్‌ను చూసే ఈ అవకాశం పర్యాటకులకు, ఖగోళ శాస్త్ర ప్రియులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.