Forgiveness:క్షమా గుణం మనిషి బలహీనత కాదు.. అది ఒక ఆయుధం ఎందుకంటే..
Forgiveness: క్షమించే గుణాన్ని మనం ఎంచుకుంటే మన హృదయం ఆనందమయం అవుతుంది. మనసులోని భారమంతా తొలగిపోయి మనలోని తెలీకుండానే అంతులేని సంతోషం కలుగుతుంది.
Forgiveness
మనిషి మనస్సు అనేది ఒక నిరంతర యుద్ధక్షేత్రమే. అందుకే అక్కడ ఎప్పుడూ రెండు వైరుధ్య భావాల మధ్య యుద్దం జరుగుతూనే ఉంటుంది. ఒకటి ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు వారిని క్షమించేటపుడు, రెండోది వారు చేసిన తప్పుకు ప్రతీకారం లేదా పగ తీర్చుకునేటపుడు మనసులో పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది.
ఈ రెండింటిలో ఏది గెలిస్తే మన జీవితం ఆ దిశగానే సాగుతుంది. క్షమించే గుణాన్ని మనం ఎంచుకుంటే మన హృదయం ఆనందమయం అవుతుంది. మనసులోని భారమంతా తొలగిపోయి మనలోని తెలీకుండానే అంతులేని సంతోషం కలుగుతుంది. మనలో ఉండే అంతరాత్మ లేదా ప్రేమ ఎప్పుడూ క్షమించమని చెబుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రేమించడం వల్ల మనం ప్రేమను తిరిగి పొందుతాం అదే ద్వేషిస్తే.. ద్వేషాన్ని మాత్రమే సంపాదించుకుంటాం.
ఇతిహాసం ప్రకారం గుండెలో పగను దాచుకోవడమంటే అది పాము ఉన్న ఇంట్లో నివసించడంతో సమానం. పాము ఎప్పుడు కాటు వేస్తుందో తెలీని ఆందోళనలో ఎలాగైతే మనశ్శాంతి ఉండదో, పగను పెంచుకునే వారి జీవితం కూడా అలాగే ఉంటుందట. పగ వల్ల పగ ఎప్పటికీ చల్లారదు . అగ్నిని అగ్నితో ఆర్పలేనట్లే, కోపాన్ని కోపంతో జయించలేమన్న విషయాన్ని అంతా తెలుసుకోవాలి.
కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే ప్రతీకార సిద్ధాంతాన్ని లోకమంతా పాటిస్తే, ఈ ప్రపంచం అంతా గుడ్డివారితో, బోసి నోటి వారితోనే నిండిపోయి ఉంటుంది. అంటే ప్రతీకారం వల్ల ఇద్దరికీ నష్టమే తప్ప ఎవరికీ లాభం ఉండదు. ఈ విషవలయం నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం క్షమించడం(Forgiveness). క్షమించడం వల్ల రెండు గొప్ప లాభాలున్నాయి. ఒకటి క్షమించే వ్యక్తి సమాజంలో ఆదర్శవంతుడిగా, గొప్ప వ్యక్తిగా గౌరవించబడతాడు. రెండోది క్షమించబడిన వ్యక్తి తన తప్పును తెలుసుకుని జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం పొందుతాడు.

క్షమా గుణానికి(Forgiveness) శత్రువును కూడా మిత్రుడిగా మార్చే అద్భుత శక్తి ఉంటుంది. పొరపాటు చేయడం అనేది మనిషి సహజమైన బలహీనత అయితే, ఆ పొరపాటును క్షమించడం అనేది దైవత్వానికి సంబంధించిన విశిష్ట గుణంగా పెద్దలు చెబుతారు. అందుకే భూమాతను మనం క్షమకు నిలయంగా భావిస్తుంటాం. మనం భూమిని ఎంతగా తవ్వినా, ఎంత బాధ పెట్టినా సరే ఆమె మనపై పగ తీర్చుకోవాలని అనుకోదు, ఓర్పుతో భరిస్తుంది. అయితే క్షమించే గుణం ఉంది కదా అని మనం హద్దులు మీరి ప్రకృతిని హింసిస్తే మాత్రం, అది ప్రళయం రూపంలో మనల్ని హెచ్చరిస్తుందనేది వేరే సంగతి అనుకోండి.
మనిషి మీద పగ తీర్చుకోవడం వల్ల తాత్కాలికంగా ఏదో ప్రశాంతత దొరుకుతుందని అనుకోవడం కేవలం మన భ్రమ మాత్రమే. నిజానికి ప్రతీకారం తీర్చుకున్న తర్వాత మనిషిలో అభద్రతా భావం, పాప చింతన పెరిగి.. చివరకు అది జీవితాన్ని విషాదాంతం చేస్తుంది. అందుకే ఇతరులు మనకు చేసిన అపకారాలను ఇసుక మీద రాయాలి, అవి గాలికి తుడిచిపెట్టుకుపోతాయి. కానీ ఇతరులు మనకు చేసిన ఉపకారాలను మాత్రం చలువరాతి మీద చెక్కాలి, అవి మన గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండేలా చేసుకోవాలి అంటారు పెద్దలు. క్షమించడం అనేది ఒక వ్యక్తి బలహీనత కాదు, అది అత్యంత బలమైన ఆయుధం అని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.
Traffic:హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు



