Phone
ఆధునిక జీవనశైలిలో చాలా మంది పడుకునేటప్పుడు లేదా నిద్ర లేవగానే చేసే మొదటి పని ఫోన్ (Phone)చెక్ చేసుకోవడం. అయితే, ఉదయం కళ్లు తెరిచిన వెంటనే ఫోన్ చూడటం అనేది రోజు మొత్తం మీ మానసిక ఆరోగ్యం , ఉత్పాదకత (Productivity) పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీరు నిద్ర లేవగానే మీ మెదడు, రాత్రి విశ్రాంతి తర్వాత నెమ్మదిగా పనిని ప్రారంభిస్తుంది. ఆ సమయంలో సోషల్ మీడియా నోటిఫికేషన్లు, ఈమెయిల్‌లు లేదా వార్తలకు సంబంధించిన అధిక సమాచారాన్ని (Information Overload) మెదడులోకి పంపడం వల్ల అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది.
ఇది మెదడు యొక్క కార్టిసోల్ (Cortisol – ఒత్తిడి హార్మోన్) స్థాయిలను అమాంతం పెంచుతుంది. ఉదయం పూట ఈ హార్మోన్ పెరగడం వలన ఆ రోజు మొత్తం ఆందోళన (Anxiety) , ఒత్తిడితో కూడిన వాతావరణం ఏర్పడుతుంది.
అంతేకాకుండా, ఉదయం ఫోన్ చూడటం వల్ల మీరు ఇతరుల జీవితాలు, లేదా ప్రపంచ సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు. దీనివల్ల మీ రోజువారీ లక్ష్యాలు లేదా చేయవలసిన ముఖ్యమైన పనుల నుండి దృష్టి మళ్లింపు (Distraction) జరుగుతుంది. దీనికి బదులుగా, నిద్ర లేచిన మొదటి గంటను గోల్డెన్ అవర్ గా భావించి, ధ్యానం, శ్వాస వ్యాయామాలు లేదా అల్పాహారం తయారీ వంటి ప్రశాంతమైన కార్యకలాపాలకు కేటాయించడం వల్ల మెదడు ప్రశాంతంగా, నిర్మాణ పద్ధతిలో పని చేయడం ప్రారంభిస్తుంది. ఇది రోజు మొత్తం ఏకాగ్రత , సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
