Lumbar Angina:నడుం నొప్పి అంటే వెన్నెముక సమస్యే అనుకుంటున్నారా? లంబార్ యాంజైనా కావొచ్చు జాగ్రత్త!

Lumbar Angina: నడుస్తున్నప్పుడు నొప్పి రావడం, కూర్చుంటే తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అది వెన్నెముక సమస్య కాదు.

Lumbar Angina

సాధారణంగా నడుం నొప్పి రాగానే మనందరం చేసే మొదటి పని.. అది వెన్నెముకకు సంబంధించిన సమస్య అని నిర్ణయించుకోవడం. వయసు పైబడటం వల్లనో, బరువులు ఎత్తడం వల్లనో లేదా డిస్క్ జారిందనో అనుకుని క్యాల్షియం టాబ్లెట్లు వేసుకోవడం, పెయిన్ కిల్లర్స్ వాడటం మొదలుపెడతాం.

కానీ, మీరు నడుస్తున్నప్పుడు నొప్పి రావడం, కూర్చుంటే తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అది వెన్నెముక సమస్య కాదు, రక్తనాళాలకు సంబంధించిన ‘లంబార్ యాంజైనా’ (Lumbar Angina) కావచ్చు. దీనిపై సరైన అవగాహన లేకపోతే భవిష్యత్తులో కాళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు ఏంటి ఈ లంబార్ యాంజైనా(Lumbar Angina)?..మన శరీరంలో గుండెకు రక్తం అందకపోతే ‘యాంజైనా’ (గుండె నొప్పి) ఎలా వస్తుందో, నడుం మరియు తొడ భాగాల్లోని కండరాలకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే నొప్పిని ‘లంబార్ యాంజైనా’ అంటారు.

గుండె నుంచి వచ్చే ప్రధాన రక్తనాళం కడుపు గుండా ప్రయాణించి నడుం కింది భాగానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి అది రెండుగా చీలి కుడి, ఎడమ కాళ్లకు రక్తాన్ని తీసుకెళ్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ మార్గం సన్నబడినప్పుడు, కండరాలకు తగినంత ఆక్సిజన్ అందదు. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు కండరాలకు ఎక్కువ రక్తం కావాలి, కానీ నాళాలు సన్నబడటం వల్ల అది సాధ్యం కాక నొప్పి మొదలవుతుంది.

Lumbar Angina

ఎవరిలో ఈ ముప్పు ఎక్కువ?..ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారు , పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల రక్తనాళాలు త్వరగా దెబ్బతింటాయి. దీనికి తోడు ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులు (గుట్కా, జర్దా) వాడటం వల్ల రక్తనాళాలు మరింత కుచించుకుపోతాయి.

శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం కూడా ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి. నడుం నొప్పి అనగానే పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది తప్ప, అసలు సమస్య తగ్గదు.

లంబార్ యాంజై(Lumbar Angina)నా లక్షణాలు చాలా విభిన్నంగా ఉంటాయి. మీరు కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు నొప్పి అస్సలు ఉండదు. కానీ, నడక మొదలుపెట్టగానే నడుం నుంచి తొడల వరకు లాగినట్లుగా అనిపిస్తుంది. నడక కొనసాగిస్తే నొప్పి భరించలేనంతగా మారుతుంది. అదే ఒక్క క్షణం ఆగి విశ్రాంతి తీసుకుంటే నొప్పి మాయమవుతుంది. దీన్ని చాలా మంది సయాటికా అని పొరబడతారు. కానీ సయాటికా నొప్పి కూర్చున్నా, పడుకున్నా తగ్గదు. నడుం నొప్పితో పాటు మగవారిలో అంగస్తంభన లోపాలు (Erectile Dysfunction) కనిపిస్తున్నాయా అంటే అది రక్త ప్రసరణ సమస్య అని కచ్చితంగా చెప్పొచ్చు.

దీన్ని కేవలం నడుం నొప్పి అని నిర్లక్ష్యం చేస్తే, కాళ్లకు రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయి ‘గ్యాంగ్రీన్’ (Gangrene) వచ్చే అవకాశం ఉంది. అంటే కాళ్లు లేదా పాదాలు కుళ్లిపోవడం మొదలవుతుంది. అప్పుడు ప్రాణాలను కాపాడటానికి శస్త్రచికిత్స చేసి కాళ్లను తొలగించాల్సి వస్తుంది. అందుకే నడకతో సంబంధం ఉన్న నడుం నొప్పిని చిన్నచూపు చూడకూడదు.

ముందుగా వాస్కులర్ సర్జన్‌ను సంప్రదించి ‘డాప్లర్ స్టడీ’ లేదా ‘సీటీ యాంజియోగ్రఫీ’ వంటి పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా రక్తనాళాల్లో ఎక్కడ, ఎంత మేర పూడికలు ఉన్నాయో తెలుస్తుంది. సమస్య తీవ్రతను బట్టి యాంజియోప్లాస్టీ (స్టెంట్ వేయడం) లేదా ధమని బైపాస్ సర్జరీ ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించొచ్చు. వీటన్నింటికంటే ముఖ్యంగా పొగతాగడం మానేయడం, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం ప్రాథమిక చికిత్సలు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version