Work from home
ప్రపంచంలో మారుతున్న కల్చర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఒక విప్లవాత్మక మార్పు. ఆఫీసుకు ప్రయాణించే టెన్షన్ లేకుండా, ఇంటి సౌకర్యంలోనే పని చేసుకోవడం చాలామందికి ఇష్టమే. అయితే, ఈ పని కొన్ని కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. పని గంటలకు, కుటుంబానికి మధ్య గీత చెరిగిపోవడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎదురయ్యే అతి పెద్ద సవాల్, కుటుంబ సభ్యులతో ఉన్నా వారికి సమయం కేటాయించలేకపోవడం. టైమ్ మేనేజ్మెంట్ (Time Management) లేకపోతే, ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. మానసిక వైద్య నిపుణులు చెబుతున్నదానిన ప్రకారం..మనం పనిని, కుటుంబాన్ని, మన వ్యక్తిగత వికాసాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
- ఉదయం పనిని ఎప్పుడు మొదలుపెట్టాలి, భోజన విరామం ఎప్పుడు, పనిని ఎప్పుడు ముగించాలి అనే ఒక స్పష్టమైన సమయ పట్టికను పెట్టుకోవాలి. ఇది మీ మనసును పని మూడ్‌లోకి తీసుకెళ్తుంది.
- మంచం మీదో, సోఫా మీదో కూర్చుని పనిచేయడం వల్ల ఏకాగ్రత కుదరదు. ఇంట్లో ఒక మూలను కార్యాలయంగా (Workplace) కేటాయించుకుంటే మంచిది.
- రోజులో చేయాల్సిన పనుల జాబితాను ముందుగా రాసుకోవాలి. అత్యవసరమైన పనులను మొదట పూర్తి చేసి, తక్కువ ప్రాధాన్యత ఉన్న వాటిని తర్వాత చేసుకోవాలి.
- గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల నాణ్యత తగ్గుతుంది. ఊబకాయం వచ్చే సమస్య కూడా ఉంది. ప్రతి గంటకు 5-10 నిమిషాలు విరామం తీసుకుంటే మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.
- పని వేళల్లో సోషల్ మీడియా, వాట్సాప్ వంటి నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకోవాలి. ఇవి పనిపై ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.
పని ముగిసిన తర్వాత ల్యాప్‌టాప్, ఫోన్ వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. కుటుంబంతో గడిపే సమయాన్ని ఆఫీసు పని మింగేయకుండా చూసుకోవాలి. - మీ పని వేళలు, సమావేశాల గురించి కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయడం వల్ల వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
- వీకెండ్స్‌లో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం లేదా ఇంట్లో పిల్లలకు సహాయం చేయడం వల్ల బంధాలు బలపడతాయి.
- వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక మంచి అవకాశం. కానీ సరైన ప్లాన్‌తో, టైమ్ మ్యానేజ్మెంట్తో దీనిని టెన్షన్ లేని ఒక సౌకర్యవంతమైన లైఫ్ స్టైల్‌గా మార్చుకోవచ్చు.