Washing machine
వాషింగ్ మెషీన్(Washing machine)లు వచ్చి బట్టలు ఉతకడాన్ని చాలా ఈజీ చేశాయి. ఇవి దుస్తులను లోడ్ చేసి, ఆన్ చేస్తే, బట్టలు శుభ్రం అయిపోతాయి. అయితే, వాషింగ్ మెషీన్‌ను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. చాలా మంది బట్టలు లోడ్ చేయడం, డిటర్జెంట్ వేయడం, ఆన్ చేయడం మాత్రమే వాషింగ్ అనుకుంటారు. కానీ, కొన్నిసార్లు మొండి మరకలు అలాగే ఉండిపోతాయి, ముఖ్యంగా కాలర్ల మురికి సులభంగా పోదు. ఈ సమస్యను అధిగమించడానికి అలాగే మెషీన్ జీవితకాలాన్ని పెంచడానికి మీరు అవలంబించాల్సిన సరైన పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం.
1. వాషింగ్ మెషీన్(Washing machine)ను ఓవర్‌లోడ్ చేయడ.. బట్టలు శుభ్రం కాకపోవడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. వాషింగ్ మెషీన్‌ను దాని సామర్థ్యానికి మించి ఓవర్‌లోడ్ చేయకూడదు. బట్టలు ఓవర్‌లోడ్ చేయడం వల్ల లోపలి భాగం కదలకుండా ఆగిపోతుంది. ఫలితంగా, మరకలు పూర్తిగా తొలగిపోవు. అందువల్ల, వాషింగ్ మెషీన్ సామర్థ్యం లోపల మాత్రమే బట్టలు లోడ్ చేయడం ఉత్తమం.
2. ఉష్ణోగ్రత సెట్టింగ్ ముఖ్యం.. చాలా మురికిగా లేక ఎక్కువసేపు మరకలు ఉన్న బట్టల కోసం, సాధారణ చల్లటి నీటి వాష్ సరిపోదు. అటువంటి బట్టల నుంచి మురికిని పూర్తిగా తొలగించడానికి వేడి నీరు అవసరం. బాగా మురికిగా ఉన్న బట్టలు, తెల్లటి కాటన్లు లేదా క్రిమిసంహారక వస్తువుల కోసం వేడి నీటిని ఉపయోగించాలి. అయితే, కుంచించుకుపోకుండా లేక రంగు వాడిపోకుండా ఉండడానికి బట్టల లేబుల్‌ను తనిఖీ చేసి, వాషింగ్ మెషీన్‌లో సరైన ఉష్ణోగ్రత సెట్టింగ్‌ను (వేడి, వెచ్చని లేక చల్లని) ఎంచుకోవాలి.
3. డిటర్జెంట్ నాణ్యతపై శ్రద్ధ.. చాలా మంది ఖరీదైన వాషింగ్ మెషీన్లలో తక్కువ నాణ్యత గల డిటర్జెంట్‌లను ఉపయోగిస్తారు. ఇది మరకలను వదిలివేయడమే కాక, యంత్రాన్ని త్వరగా దెబ్బతీస్తుంది. అందువల్ల, మంచి నాణ్యత గల డిటర్జెంట్‌ను ఎంచుకోవడం చాలా అవసరం. మొండి మరకలను తొలగించడానికి కొన్ని డిటర్జెంట్‌లు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ ఎంజైమ్‌లు కలిగిన డిటర్జెంట్‌లు దీర్ఘకాలిక మరకలను త్వరగా తొలగించగలవు. వాటికి కొంచెం ఎక్కువ ఖర్చయినా, మంచి డిటర్జెంట్‌ను ఉపయోగించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
4. బేకింగ్ సోడాతో ముందస్తు శుభ్రత.. బట్టల నుండి మొండి మరకలను సులభంగా తొలగించడానికి, వాషింగ్ మెషీన్‌లో ఉంచే ముందు ముందస్తు శుభ్రత ముఖ్యం. కొద్దిగా బేకింగ్ సోడాను నీటితో కలిపి, వాషింగ్ మెషీన్‌లో లోడ్ చేసే ముందు ఎక్కువ మరకలు ఉన్న ప్రాంతాలకు ఈ పేస్ట్ మిశ్రమాన్ని అప్లై చేయాలి. లేదా వీటిని ఒక బకెట్ నీటిలో 2 నుంచి 4 టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి, బట్టలను కనీసం 15 నిమిషాలు నానబెట్టాలి. మొండి మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. దీనికి బదులుగా మీరు స్టెయిన్ రిమూవర్‌ను కూడా వాడవచ్చు.
ఈ సరైన పద్ధతులు పాటించడం వలన మొండి మరకలు పూర్తిగా శుభ్రం అవడమే కాక, మీ వాషింగ్ మెషీన్(Washing machine) మన్నిక కూడా పెరుగుతుంది.
