Pesarappu Halwa:టేస్ట్‌తో పాటు బూస్ట్ ఇచ్చే పెసరపప్పు హల్వా.. మీరూ ట్రై చేస్తారా?
Pesarappu Halwa:నెయ్యితో కలిపి చేసే పెసరపప్పు హల్వా(Pesarappu Halwa) రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Pesarappu Halwa: శీతాకాలంలో శరీరానికి వెచ్చదనం, పోషణ అవసరం. అలాంటి సమయంలో మన పెద్దలు సూచించే అద్భుతమైన ఆహార పదార్థాలలో ఒకటి పెసరపప్పు. ఇది కేవలం జీర్ణశక్తిని పెంచడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా, నెయ్యితో కలిపి చేసే పెసరపప్పు హల్వా(Pesarappu Halwa) రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలకు, చిన్నపిల్లలకు ఈ స్వీట్ చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
Pesarappu Halwa
పెసరపప్పు హల్వాను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
పెసరపప్పు హల్వాకు కావలసినవి:
పప్పు: ఒక కప్పు పచ్చ పెసలు (split green gram)
శుద్ధమైన నెయ్యి: ముప్పావు కప్పుచిక్కటి పాలు: ఒక కప్పు
చక్కెర లేదా బ్రౌన్ షుగర్: ఒక కప్పు
యాలకుల పొడి: అర టీస్పూను
మెత్తగా తరిగిన బాదం, పిస్తా: ఒక టీస్పూను
కుంకుమపువ్వు: నాలుగైదు పోగులు
నీళ్లు: తగినంత
పెసరపప్పు హల్వాను ఇలా తయారు చేద్దాం..
ముందుగా పచ్చ పెసలను శుభ్రంగా కడిగి, కనీసం మూడు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి.
నానిన పెసరపప్పును నీళ్లు వడకట్టి, మిక్సీ జార్లో వేయండి. వీలైనంత తక్కువ నీటితో, గట్టిగా, మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
ఒక చిన్న గిన్నెలో ఒక టీస్పూను పాలు తీసుకుని, అందులో కుంకుమపువ్వు పోగులను వేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక మందపాటి గిన్నె లేదా నాన్‌స్టిక్ కళాయిని స్టవ్ మీద పెట్టి, అందులో నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత, రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్‌ను వేయాలి.
మంటను చిన్నగా పెట్టి, పేస్ట్ అడుగంటకుండా కంటెన్యూగా కలుపుతూ ఉండాలి. సుమారు 30-40 నిమిషాల పాటు వేయిస్తే, పెసరపప్పు ముద్ద బంగారు గోధుమ రంగులోకి మారుతుంది. పప్పులోని పచ్చివాసన పోయి, నెయ్యి పైకి తేలుతుంది.
వేయించిన పెసరపప్పు ముద్దలో కాచి చల్లార్చిన ఒక కప్పు పాలను పోసి, బాగా కలపాలి. మిశ్రమం గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి.
మిశ్రమం దగ్గరపడ్డాక, యాలకుల పొడి, చక్కెరను వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగి, హల్వా చిక్కబడే వరకు స్టవ్‌పై ఉంచాలి. కావాలనుకుంటే, తెల్ల చక్కెర బదులు బ్రౌన్ షుగర్ ఉపయోగించవచ్చు.
చక్కెర కరిగిన తర్వాత, మెత్తగా తరిగిన బాదం, పిస్తా ముక్కలను వేసి కలపాలి. చివరగా, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వును కూడా వేసి బాగా కలిపి, మిశ్రమం పూర్తిగా దగ్గరగా, గట్టిగా అయ్యేవరకు ఉడికించాలి.
మిశ్రమం గట్టిపడి, కళాయి అంచులను వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే.. వేడివేడిగా, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు హల్వా రెడీ అయినట్లే. అయితే మధుమేహంతో బాధపడేవారు ఈ హల్వాను తీసుకోకుండా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.