Ugly Duckling:అసలైన అందం ఎక్కడ ఉంది? ది అగ్లీ డక్లింగ్ సిండ్రోమ్ గురించి తెలుసుకుంటే క్లారిటీ వస్తుందట..
Ugly Duckling: ఎవరైనా పొగిడితే వారు దానిని అంత ఈజీగా నమ్మలేరు. అవతలి వారు ఏదో ఆశించి లేదా వెటకారంగా పొగుడుతున్నారేమోనని అందరినీ అనుమానిస్తారు.
Ugly Duckling
అగ్లీ డక్లింగ్(Ugly Duckling) అనేది ఒక ప్రసిద్ధ జానపద కథ గురించి మనలో చాలామందికి తెలీదు. ఈ కథలో ఒక చిన్న బాతు పిల్ల చూడటానికి అసహ్యంగా ఉండి అందరిచేత ఛీత్కరించబడుతుంది. కానీ పెరిగిన తర్వాత అది ఒక అందమైన హంసగా మారుతుంది.
ఇలా నిజ జీవితంలో కూడా చాలా మంది చిన్నప్పుడు సాదాసీదాగా కానీ అంత అందంగా లేమని కానీ భావించి, యవ్వనంలోకి వచ్చేసరికి అకస్మాత్తుగా అందంగా మారుతుంటారు. దీనినే సైకాలజీలో ది అగ్లీ డక్లింగ్(Ugly Duckling) సిండ్రోమ్ అంటారు.
ఇది కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు, దీని వెనుక లోతైన మానసిక విశ్లేషణ దాగి ఉంది. సాధారణంగా చిన్నప్పుడు అందంగా లేమని విమర్శలు ఎదుర్కొన్న వారు లేదా నిర్లక్ష్యానికి గురైన వారు, పెరిగిన తర్వాత ఎంత అందంగా మారినా వారి మనసులో మాత్రం ఆ పాత అభద్రతా భావం అలాగే ఉండిపోతుంది.
ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో కాన్ఫిడెన్స్ విషయంలో ఒక రకమైన డిఫరెంట్ స్వభావం కనిపిస్తుంది. బయటి ప్రపంచం వారిని అందంగా చూస్తున్నా కూడా..వారి లోపల మాత్రం ఇంకా తాము సాదాసీదా వ్యక్తులమే అన్న భావన ఉంటుంది. ఎవరైనా పొగిడితే వారు దానిని అంత ఈజీగా నమ్మలేరు. అవతలి వారు ఏదో ఆశించి లేదా వెటకారంగా పొగుడుతున్నారేమోనని అందరినీ అనుమానిస్తారు.
చిన్నతనంలో ఎదురైన వేధింపులు కానీ బాడీ షేమింగ్ కానీ వారి మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. దీనివల్ల వారు పెరిగిన తర్వాత కూడా ఇతరులతో రిలేషన్స్ ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో వారు తమ భాగస్వామిని నమ్మడానికి చాలా సమయాన్ని తీసుకుంటారు. తమ అందాన్ని చూసి ఎవరైనా ఇష్టపడుతుంటే, ఆ అందం రేపు తగ్గిపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన వారిని వేధిస్తుంది.

అయితే, ఈ సిండ్రోమ్ వల్ల ఒక గొప్ప సానుకూల అంశం కూడా ఉంది. వీరు చిన్నప్పుడు అందానికి ఇంపార్టెన్స్ లభించని పరిస్థితుల్లో పెరగడం వల్ల, తమ వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అందం కంటే స్వభావం ముఖ్యం అనే విషయాన్ని వారు లోతుగా గ్రహిస్తారు. అందువల్ల వీరు చాలా సున్నిత మనస్కులుగా, ఎదుటివారి బాధను అర్థం చేసుకునే వారుగా ఉంటారు.
అందం అనేది శాశ్వతం కాదని వారికి తెలుసు కాబట్టి, వారు ఆడంబరాలకు దూరంగా ఉండటానికి చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తారు. ఈ మానసిక పరిస్థితి నుంచి బయటపడాలంటే, గతాన్ని వదిలేసి ప్రస్తుతం తమకు లభిస్తున్న గుర్తింపును గౌరవించడం నేర్చుకోవాలి. బాహ్య సౌందర్యం అనేది కేవలం ఒక భాగం మాత్రమే అని, అసలైన అందం మన ఆత్మవిశ్వాసంలోనే ఉంటుందని గుర్తించినప్పుడు ఈ సిండ్రోమ్ నుంచి విముక్తి లభిస్తుంది.
Harish Rao:హరీశ్ రావుకు సిట్ నోటీసులు..ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకున్నట్లేనా?



