Incoming calls
భారతదేశంలో టెలికాం రంగాన్ని మెరుగుపరచడానికి అలాగే ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు, స్పామ్ కాల్స్‌ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై, ఇన్‌కమింగ్ కాల్స్(Incoming calls)కి కాల్ చేసిన వ్యక్తి అసలైన పేరు (KYC ఆధారంగా) మొబైల్ స్క్రీన్‌పై చూపించే “కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP)” ఫీచర్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ సర్వీస్‌ను 2026 మార్చి కల్లా అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో అందుబాటులోకి తేనున్నారు.
CNAP ఫీచర్ – ట్రూకాలర్‌కు చెక్?..ప్రస్తుతం మనకు తెలియని నంబర్ల పేరు తెలుసుకోవడానికి ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ
యాప్‌లపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే, టెలికాం ఆధారిత CNAP ఫీచర్ అమలులోకి వస్తే, ఈ సమస్య తీరుతుంది. ఇది వినియోగదారుడి ఫోన్ స్క్రీన్‌పై స్వయంగా, ఆటోమేటిక్‌గా, ఆ నంబర్‌కు సంబంధించిన KYC రికార్డుల్లో (ఉదాహరణకు: ఆధార్, పాస్‌పోర్ట్) ఉన్న అసలు పేరును డిస్‌ప్లే చేస్తుంది.
CNAP ఎలా పనిచేస్తుంది.. ప్రతి మొబైల్ నంబర్‌కు సంబంధించిన అసలైన పేరు టెలికాం కంపెనీల వద్ద ఉన్న KYC డేటాబేస్ నుంచి కాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్‌కమింగ్ ఫోన్(Incoming calls)కు పంపబడుతుంది. దీనివల్ల ఏ నెట్‌వర్క్ నుంచి కాల్ వచ్చినా – నంబర్‌తో పాటు అతని పేరు (KYC రికార్డులో ఉన్న పేరు) వేరే వ్యక్తికి స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు హర్యానా, మహారాష్ట్ర వంటి సర్కిళ్లలో దీనిపై పైలట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాయి.
2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా (ముఖ్యంగా 4G, 5G నెట్‌వర్క్స్‌లో) అన్ని నెట్‌వర్క్‌లలో ఈ సేవ డిఫాల్ట్‌గా అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఇది 2G, 3G నెట్‌వర్క్‌లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. స్పామ్ కాల్స్, ఫ్రాడ్ ప్రయత్నాలను ఈ ఫీచర్ చాలా వరకు నియంత్రిస్తుంది. అంతేకాకుండా, థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడకుండా, అధికారిక డేటాబేస్ ఆధారంగా యథార్థమైన కాలర్ ఐడెంటిఫికేషన్‌ను తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది.
అయితే ప్రతి కాల్‌కు అసలు పేరు డిస్‌ప్లే కావడం వల్ల వ్యక్తిగత ప్రైవసీ (Privacy), భద్రతకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఉన్నాయి. సాధారణ వినియోగదారుల అసలు KYC పేరు నేరుగా అందరికీ కనిపించడం వలన, మునుపటి “అజ్ఞాత నంబర్” (Anonymous Number) ప్రైవసీ పూర్తిగా పోయే ప్రమాదం ఉంది.
మహిళలు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, రక్షణ అవసరాలు ఉన్నవారు – వీరందరి అసలు పేరు ఇతరులకు తెలిసే అవకాశం ఉండటం వల్ల, సైబర్ స్టాకింగ్, వేధింపులు (Harassment) , బ్లాక్ మెయిల్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ చిన్న వ్యాపారస్తులు తమ వ్యక్తిగత నంబర్‌తో బిజినెస్ చేసినా, ప్రజలకు ఆ సంస్థ పేరు కాకుండా, వారి అసలైన పేరు తెలిసే ప్రమాదం ఉంది. బల్క్ నంబర్లు, కార్పొరేట్ లైన్లకు మాత్రం కంపెనీ పేరు లేదా ట్రేడ్‌మార్క్ పేరు డిస్‌ప్లే చేయడానికి ప్రత్యేక పరిష్కారాలు ఉంటాయి.
దీనికోసం TRAI తో పాటు DOT (టెలికాం విభాగం) ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు కొన్ని నియంత్రణ మార్గాలను ప్రకటించాయి.
డిఫాల్ట్ – ఆప్ట్-ఆవుట్ (Opt-out).. CNAP సేవ అందరికీ ఆటోమేటిక్‌గా యాక్టివ్ అయినా, ఎవరికైనా ఇష్టం లేకపోతే, “ఆప్ట్-ఆవుట్” ఆప్షన్ ద్వారా తమ పేరును డిస్‌ప్లే చేయకుండా నిలిపివేయడానికి అభ్యర్థన పెట్టుకోవచ్చు. పూర్తిస్థాయి రోల్‌అవుట్ సమయంలో, టెలికాం కంపెనీలు (Jio, Airtel, Vi) పోర్టల్/యాప్/కస్టమర్ కేర్ ద్వారా ఈ ఆప్షన్ అందుబాటులోకి ఉంచుతాయి.
CLIR (Calling Line Identification Restriction).. రక్షణ అవసరాలు ఉన్నవారు లేదా ప్రత్యేక ప్రైవసీ అవసరం ఉన్న వ్యక్తులు CLIR ఫీచర్ ద్వారా తమ నంబర్/పేరు డిస్‌ప్లే కాకుండా మరింత కఠినంగా నియంత్రించుకోవచ్చు. దీని కోసం టెలికాం కంపెనీల వద్ద ప్రత్యేకంగా అప్లై చేసి, అవసరమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ KYC పేరులో మార్పు అవసరమైతే, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర సరైన ఆధారాలతో కొత్తగా మార్చుకోవడం కోసం అప్లై చేయవచ్చు.
మొత్తంగా, CNAP అనేది ఫ్రాడ్ కంట్రోల్‌కు అత్యంత ఉపయోగకరమైన ఫీచరే అయినా కూడా, వ్యక్తిగత , సామాజిక భద్రత కోరుకునేవారు ఈ ఫీచర్ లాంచ్ అయిన వెంటనే ఆప్ట్-ఆవుట్- ఎంపికను వినియోగించుకోవడం లేదా CLIR వంటి ప్రైవసీ మోడ్‌లను ఉపయోగించుకోవడం చాలా అవసరం.
