Literature
చిరుగులున్న చీరచెంగును
చిట్టి ఊయలగా నాకు కట్టి
మరో చివర నీ మెడకు చుట్టి
ఒక్క చేతితో నన్ను అదుముకుంటూ
మరో చేతితో వేడుకుంటూ
రోడ్డున పడి నువు తిరుగుతుంటే
సాయమయినో లేదో గానీ
గాయమయినే నాది మనసు..!
మాటరాని నా మూగనోరు
ఆకలయినా నిను అడగలేదు
మనసు మాత్రం అడగమంది
పదే పదే ఒక్క ప్రశ్న..
నన్నెందుకమ్మా కన్నావు?
నన్నెందుకమ్మా కన్నావు?
అద్దాల మేడ లేకపోయినా
అమ్మ ఒడి చాలు నాకు..
పాపమంటూ
పసివాడనంటూ
పాలు నాకు పడతావంటే
పైసలేటకు పరాయమ్మతో
పంపుతుంటావు..
పురటాలినంటూ
అడుక్కుంటావు..
కడుపు నింపుకోవడం రాని దానివి
కడుపునెందుకు
పండించుకున్నావు?
నీతో పడక పంచుకున్న పోటుగాడికి
మన పోషణేమో గురుతులేదా?
ఎండ మండినా
చినుకు కురిసినా
నీకు భిక్ష దక్కితే నాకు రక్ష..
నగరమంతా నాలాంటి
చిట్టి పాపలు ఎందరెందరో..!
‘అయ్యో! పాపం’అంటూ కొందరు
‘ఏ పాపం ఫలితమో’ అంటూ కొందరు
జాలి చూపులు విసురుతుందురు
మనసు కరిగితే పైసలేస్తరు..
నువ్వు ఎవ్వరో..? నేను ఎవ్వరో?
ఒక్క ప్రశ్ననైనా అడగరెవ్వరు..
నీవు నేర్పిన భాషలోనే
నీలాంటి తల్లులందరని
యాచిస్తున్నా
నాకులాగే మరో పుట్టుక వద్దు తల్లీ..!
…ఫణి మండల
మరిన్ని లిటరేచర్ సమాహారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి