Just LiteratureLatest News

Literature: పసి యాచకుడు

Literature: నీలాంటి తల్లులందరని యాచిస్తున్నా నాకులాగే మరో పుట్టుక వద్దు తల్లీ..!

Literature

చిరుగులున్న చీరచెంగును
చిట్టి ఊయలగా నాకు కట్టి
మరో చివర నీ మెడకు చుట్టి
ఒక్క చేతితో నన్ను అదుముకుంటూ
మరో చేతితో వేడుకుంటూ
రోడ్డున పడి నువు తిరుగుతుంటే
సాయమయినో లేదో గానీ
గాయమయినే నాది మనసు..!

మాటరాని నా మూగనోరు
ఆకలయినా నిను అడగలేదు
మనసు మాత్రం అడగమంది
పదే పదే ఒక్క ప్రశ్న..
నన్నెందుకమ్మా కన్నావు?
నన్నెందుకమ్మా కన్నావు?

అద్దాల మేడ లేకపోయినా
అమ్మ ఒడి చాలు నాకు..
పాపమంటూ
పసివాడనంటూ
పాలు నాకు పడతావంటే
పైసలేటకు పరాయమ్మతో
పంపుతుంటావు..
పురటాలినంటూ
అడుక్కుంటావు..

కడుపు నింపుకోవడం రాని దానివి
కడుపునెందుకు
పండించుకున్నావు?
నీతో పడక పంచుకున్న పోటుగాడికి
మన పోషణేమో గురుతులేదా?

ఎండ మండినా
చినుకు కురిసినా
నీకు భిక్ష దక్కితే నాకు రక్ష..
నగరమంతా నాలాంటి
చిట్టి పాపలు ఎందరెందరో..!
‘అయ్యో! పాపం’అంటూ కొందరు
‘ఏ పాపం ఫలితమో’ అంటూ కొందరు
జాలి చూపులు విసురుతుందురు
మనసు కరిగితే పైసలేస్తరు..
నువ్వు ఎవ్వరో..? నేను ఎవ్వరో?
ఒక్క ప్రశ్ననైనా అడగరెవ్వరు..

నీవు నేర్పిన భాషలోనే
నీలాంటి తల్లులందరని
యాచిస్తున్నా
నాకులాగే మరో పుట్టుక వద్దు తల్లీ..!

…ఫణి మండల

మరిన్ని లిటరేచర్ సమాహారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Related Articles

22 Comments

  1. చా లా బాధాకరం నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు superga vundhi👌

  2. ప్రాసలు, పదప్రయోగాలు,హృదయానికి తాకాయి.ఎవరిపాపం ఎవరిని పీడిస్తుంది అర్థంకాని స్థితిని చక్కగా విశ్లేషించి కళ్లముందుంచారు. గొప్ప భావానికి చక్కని కవిత అల్లారు. చిట్టి యాచకుల జీవితం కళ్ళముందు కదలాడింది.

  3. చాలా బాగుంది, బాధగా ఉంది. గుండెల్లో గుబులు రేపింది

  4. ఎక్సలెంట్ సార్ .👌👌👌వాస్తవికతను జోడించి రాసారు

  5. పసిమనసు హృద్యంగా ఆ తల్లిని అడిగిన మాటలు విన్నాకైనా అలాంటి తల్లులు, ఇలాంటి పరిస్థితికి కారణమైన తండ్రులు ఇలాంటి అసమానతలు కారణమైన ఈ సమాజానికి బుద్ది రావాలి…
    ఫణి మాష్టారు మీ కవి హృదయం,మీ మనసు ఇలాగే స్వచ్చంగా ఉండాలి.. మరిన్ని సామాజిక రుగ్మతలను మీ కలం స్పృశించాలి..
    Keep it up

  6. చాలా హృద్యంగా ఉంది చదువుతున్నంత సేపు..
    ఎంతో ఆర్ద్రత తో నిండి ఉన్న వాస్తవ రూపం🙏🙏
    మంచి రచన చేసిన ఆ మాస్టారు కి ధన్య వాదాలు

  7. ఇందులో పసి మనసు పడే మానసిక సంఘర్షణ నిజమైనది.

  8. అప్పుడప్పుడు ఈ గ్రూప్ లో ఆణిముత్యాల లాంటి మేసేజ్ లు వస్తున్నాయి.. అందులో ఈ మనస్సును కదిలించే ఈ కవిత ఒకటి.. మన గ్రూప్ లో ఉన్న ఫణి మాష్టర్ మెదడు నుండి జారిపడిన అక్షర మాల చాలా చక్కగా ఓ పక్క బాధగా ఉంది 👌👌👌👌… వీలుంటే ఈ సార్ ఫొటో పెట్టండి.. ఇతనెవరో చూద్దాం .. నేను అయితే ఒక ఫణి సార్ పేరు విన్నాను.. అతను ఇతను ఒకరా కాదా అని నా సందేహం

  9. ఓ ఉపాద్యాయుడు ఓ రచయిత T Raju కి చేసిన కామెంట్

    రాజు గారు మీకు మరో దోస్త్ దొరికినట్లే.. ఇద్దరూ కలిసి పణి రాజు గా మరిన్ని కవితలు ఈ గ్రూప్ లో విసరండి

  10. ఫణి మండల గారు.
    మీ కలం నుండి జాలువారిన’ పసి యాచకుడు ‘ యాచకవృత్తిని ఎంచుకున్న తల్లిని తన బిడ్డే ఎందుకు ఇంత శ్రమ పడుతూ , కష్ట పెడుతూ పెంచుతున్నావు అమ్మా అని అక్రోశించడం పసిహృదయానికి గల దయనీయ స్థితికి అద్దం పట్టింది. వాస్తవికత ఉట్టిపడేలా మీరు చేసే రచనలు కడు రమణీయంగా ఉంటున్నాయి.మరిన్ని మీ నుండి ఆశిస్తూ..

  11. ఫణి కవిత హార్ట్ టచ్చింగ్ గా ఉంది. కవిత భావంలో మంచి డెప్త్ ఉంది. నీలో సామాజిక స్పృహ ఉంది.keep it up.

  12. చాలా బాగుంది… కవిత…ఒక.పసివాడి.మనో వేదన.. ఇదే కవిత మునుపటి.రోజుల్లో అంటే ఒక.30-40.సంవత్సరాల క్రితం అయితే మనసు మాంసము ముద్దలా కొట్టుకునేది.. కానీ ఈ ఆధునిక యాంత్రిక నగర జీవనంలో ఈ పసివాడే వారి సంపాదనకు సంపదకు పెట్టుబడి అని తెలిస్తే ఆ చిట్టి మనసు ఎంత చిన్న బుచ్చు కునేదో

Back to top button