Moon: చందమామపై చుట్టపుచూపు.. సామాన్యుల అంతరిక్ష కల నిజమయ్యే కాలం ఆసన్నమైందా?
Moon: అంతరిక్షం అంటే కేవలం శాస్త్రవేత్తలకు, వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన ఒక రహస్య ప్రపంచం.
Moon
ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించొచ్చు కానీ, 2026 నాటికి ఇది నిజం కాబోతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ (SpaceX) , జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ (Blue Origin) వంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు సాధారణ పౌరులను చంద్రుని(Moon) కక్ష్యలోకి తీసుకెళ్లడానికి భారీ రాకెట్లను సిద్ధం చేస్తున్నాయి.
అంతరిక్షం అంటే ఇప్పటివరకు కేవలం శాస్త్రవేత్తలకు, వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన ఒక రహస్య ప్రపంచం అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కోట్లు ఖర్చు చేయగలిగే స్థోమత ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, జాబిల్లిపై విహారయాత్రకు వెళ్లి రావొచ్చు. ఇప్పటికే జపాన్ కు చెందిన కొంతమంది బిలియనీర్లు తమ టికెట్లను బుక్ చేసుకుని తమ వంతు కోసం వేచి చూస్తున్నారు.
చంద్రుని ఉపరితలం పైన తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల అక్కడ నడవడం అనేది అక్కడకు వెళ్లిన వారికి ఒక వింతైన అనుభవంగా మారుతుంది. అంతరిక్షం నుంచి నీలిరంగులో మెరిసిపోయే భూమిని చూడటం పర్యాటకులకు జీవితకాల జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

అయితే ఈ మూన్ టూరిజం కేవలం వెళ్లడం, రావడం మాత్రమే కాదట. భవిష్యత్తులో అక్కడ శాశ్వత నివాసాలు , హోటళ్లను నిర్మించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి.
కానీ ఈ మూన్ టూరిజం వెనుక అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. అంతరిక్షంలో ఉండే రేడియేషన్, వ్యోమగాముల ఆరోగ్యం , రాకెట్ ప్రయోగాల్లో ఉండే రిస్కులు చాలా ఎక్కువ. అయినా కూడా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ ప్రయాణాలు మరింత సురక్షితం కాబోతున్నాయి.
ప్రస్తుతానికి టికెట్ ధరలు వందల కోట్లలో ఉన్నా, రాబోయే యాభై ఏళ్లలో అవి విమాన ప్రయాణాల స్థాయికి తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో చందమామ(Moon) ఇకపై కేవలం అందమైన కవితలకు, పాటలకే కాదు, మన సెలవు దినాల్లో గడిపే ఒక లగ్జరీ పర్యాటక కేంద్రంగా కూడా మారబోతోందన్న మాట.



