Adani Group: అదానీ కోసం ఎల్ఐసీ తాకట్టు.. వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం
Adani Group: తాజా వార్తల ప్రకారం అదానీ కంపెనీ(Adani Group)లో 390 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతోంది. అంటే మన కరెన్సీలో 34 వేల 251 కోట్లు. ఇది స్వతంత్ర నిర్ణయమని చెబుతున్నప్పటికీ చాలా మందికి అనుమానాలున్నాయి.
Adani Group
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ గురించి గత కొంతకాలంగా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. నష్టాల్లో ఉన్న అదానీ కంపెనీ(Adani Group)ని కాపాడేందుకు మోదీ ప్రభుత్వం ఎల్ఐసీని బలి చేయబోతోందన్న ప్రచారం అప్పట్లోనే దుమారం రేపింది. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ఇప్పుడు ఇండియాను షేక్ చేస్తోంది.
తాజా వార్తల ప్రకారం అదానీ కంపెనీ(Adani Group)లో 390 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతోంది. అంటే మన కరెన్సీలో 34 వేల 251 కోట్లు. ఇది స్వతంత్ర నిర్ణయమని చెబుతున్నప్పటికీ చాలా మందికి అనుమానాలున్నాయి. అప్పుల్లో ఉన్న అదానీ కంపెనీలను ఆర్థికంగా కాపాడేందుకు సామాన్యుల సొమ్మును రిస్క్‌లో పెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అదానీ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీని బలిపెట్టబోతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని LIC మీద ఆర్థిక శాఖ అధికారులు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు.. ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. అదానీ కంపెనీ కొన్ని రుణాలను డాలర్ల రూపంలో చెల్లించాల్సి రావడంతోనే ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్టు తెలుస్తోంది.

అదానీ గ్రూప్ (Adani Group)కంపెనీలలో ఈక్విటీని పెంచడానికి ఎల్‌ఐసీ నిధులను ఉపయోగించాలని కూడా అధికారులు సిఫార్సు చేసినట్లు సమాచారం. అదానీ గ్రూపులోని రెండు సంస్థల్లో 3.4 బిలియన్ డాలర్లు బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించినట్టు ది వాషింగ్టన్ పోస్ట్ కథనం సారాంశం. రేటింగ్ ఏజెన్సీలను ప్రభావితం చేసి ట్రిపుల్ ఏ రేటింగ్స్ ఇవ్వడం ద్వారా అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపిస్తోంది. అదానీని ఆదుకొనే ఈ ఐడియాలో ఆర్థిక శాఖ ఆర్థిక సేవల విభాగం, ఎల్‌ఐసీ, నీతి ఆయోగ్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
మొత్తం వ్యవహారం ఎల్‌ఐసీతో డబ్బులు ఇప్పించడం మాత్రమే కాకుండా.. దేశ విదేశాల్లోని పెట్టుబడిదారుల్లో అదానీ సంస్థల పట్ల విశ్వాసం పెంచడం లక్ష్యంగా జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అదానీ గ్రూపు అప్పులు ఆ సంస్థ విలువలో 20 శాతానికి చేరాయి. ఇలాంటి పరిస్థితిలో LICతో 3.9 బిలియన్ డాలర్ల కమిట్‌మెంట్ చేయించడంద్వారా అదానీ కంపెనీకి భరోసాగా ఉన్నామన్న సంకేతం అంతర్జాతీయ సంస్థలకు చేరుస్తోంది.
అదానీ కంపెనీ మీద అంతర్జాతీయంగా చాలా ఆరోపణలు వచ్చాయి. గతంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో పాటు పలు ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఇలాంటి కంపెనీలో LIC లాంటి సంస్థ పెట్టుబడి పెట్టడమంటే అది ప్రజల సొమ్ముతో చెలగాటం ఆడినట్టే అనేది వాషింగ్టన్ పోస్ట్ కథనం. ఈ నేపథ్యంలో ప్రజల సొమ్మును పూర్తిగా రిస్కులో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధపడినట్టు ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.



