Red Fort: ఎర్రకోట దగ్గర బాంబు పేలుళ్లు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని
Red Fort: ఈ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం ఉంది.
Red Fort
దేశరాజధాని న్యూఢిల్లీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఎర్రకోట (Red Fort)దగ్గర జరిగిన బాంబు పేలుతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక కారులోపేలుడు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిర్థారించారు.
ఈ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం ఉంది. ఇవాళ సోమవారం కావడంతో ఆలయ సందర్శనకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే క్రమంలో భారీ పేలుళ్లు.సంభవించాయి. ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ పేలుళ్లు జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
పేలుడుతో పలువురి శరీరభాగాలు ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో చాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాదచాయలు అలముకున్నాయి. పేలుడు సమాచారం తెలిసిన నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే పేలుళ్ల ప్రభావంతో 8 కార్లు ధ్వంసమయ్యాయి, పేలుడు తీవ్రతకు దగ్గరలో ఉన్న ఇళ్లల్లో కిటికీలు కంపించాయి. 2011 లో ఢిల్లీ హైకోర్టు దగ్గర జరిగిన పేలుళ్లు, తరవాత ఇక్కడ ఇలాంటి బ్లాస్ట్ జరగడం ఇదే ప్రథమం.

ఇది ప్రమాదవశాత్తూ జరిగిన బ్లాస్ట్ కాదని పోలీసులు చెబుతున్నారు. కచ్చితంగా టెర్రిరిస్టుల పనై ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటన జరగడానికి ముందు, జరిగిన తర్వాత పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పేలుళ్ల ప్రభావంతో సంఘటనా స్థలం భయానకంగా మారింది. పలువురు తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న దృశ్యాలు కనిపించాయి. దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సాయంత్రం 6:55 కు పేలుళ్లు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న కారులో పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల దెబ్బకు 6 కార్లకు మంటలు వ్యాపించగా.. నాలుగు ఆటో రిక్షాలు, 4 బైకులు దగ్ధమయ్యాయి. ఘటనలో 30 మందికి పైగా గాయపడితే వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఘటన స్థలం(Red Fort)లో ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్స్ దర్యాప్తు జరుపుతున్నాయి. గాయపడిన వారిని లోకనాయక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఎ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ , ఇతర అధికారులు ఘటనా స్థలం దగ్గరకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుళ్లతో ఉత్తర ప్రదేశ్, ముంబై, పుణే, అహ్మదాబాద్ , హైదరాబాద్ వంటి నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. పలు చోట్ల క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.



