Bharat Future City:ట్రాఫిక్‌కు చెక్.. కాలుష్యానికి గుడ్ బై.. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ఎలా ఉంటుందంటే..
Bharat Future City:తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది.

Bharat Future City
పెరుగుతున్న జనాభా, నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్, ఊపిరి తీసుకోలేని కాలుష్యం… ఈ సమస్యలకు పరిష్కారంగా గ్రేటర్ హైదరాబాద్ మహానగరం సరికొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)’ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ఈ సిటీని కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా, సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా నిలిచేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీ రూపుదిద్దుకోనుంది. ఇది 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవిన్యూ గ్రామాలకు విస్తరించనుంది. ఈ మహత్తర ప్రాజెక్టు పర్యవేక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ (FCDA) ని ఏర్పాటు చేశారు.

ఈ సిటీ(Bharat Future City) అభివృద్ధిలో ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA) వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా భాగస్వామ్యం పంచుకోవడం ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను చాటుతోంది.
ఈ ఫ్యూచర్ సిటీ యొక్క అత్యంత ముఖ్యమైన, ఆకర్షణీయమైన అంశం ఏంటంటే, దీనిని దేశంలోనే మొట్టమొదటి ‘నెట్-జీరో స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దుతుండటం. అంటే, ఇక్కడ ఉద్గారాలు, వినియోగం దాదాపు సున్నాకు చేరుకునేలా పర్యావరణ హిత పద్ధతులు పాటిస్తారు.
సిటీలో 15 వేల ఎకరాల నిర్మాణ ప్రాంతానికి ఆనుకుని, మరో 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండటం ఈ నగరానికి ‘గ్రీన్ లంగ్స్’ (ఆకుపచ్చ ఊపిరితిత్తులు)గా పని చేయనుంది. ఈ ఫ్యూచర్ సిటీలో స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్‌లతో పాటు, వాటర్ రీసైక్లింగ్, జీరో-డిశ్చార్జ్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుంది.
ఈ సిటీని కేవలం నివాస ప్రాంతంగా కాకుండా, జీవనం, విద్య, ఉద్యోగం, వినోదం అన్నీ ఒకే చోట లభించేలా ‘లైవ్, లెర్న్, వర్క్, ప్లే’ అనే కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తున్నారు. పరిశ్రమలతో పాటు, స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్‌లో ఉంటాయి.ఈ సిటీని ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్-బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్ ఎకో టూరిజం జోన్‌లుగా విభజించారు.
ఈ ఫ్యూచర్ సిటీ పూర్తయితే, హైదరాబాద్ కేవలం చారిత్రక నగరం మాత్రమే కాకుండా, సుస్థిరమైన, ఆధునిక పట్టణాభివృద్ధికి ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.