Virat Kohli : కింగ్ @ నెంబర్..ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో రీ ఎంట్రీ ఇచ్చిన విరాట్
Virat Kohli
ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) 2.0 పర్వం కొనసాగుతుంది. వన్డే ప్రపంచ కప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ (Kohli ) దుమ్ము రేపుతున్నాడు. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ కు దూసుకెళ్ళాడు. వరుస సెంచరీలు, హాఫ్ సెంచరీ ప్రదర్శనతో దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మను వెనక్కి నెట్టి కోహ్లీ అగ్రస్థానానికి చేరడం హైలైట్ గా చెప్పొచ్చు.గత కొన్ని నెలలుగా కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో రీ ఎంట్రీ ఇచ్చిన విరాట్వరుసగా రెండు మ్యాచ్ ల్లో సున్నాలకే ఔట్ అవడం షాక్ ఇచ్చింది. కానీ తర్వాతి మ్యాచ్ నుంచి విరాట్ పర్వం మొదలయింది.
సిడ్నీలో 74 పరుగులతో ఫామ్‌లోకి తిరిగి వచ్చిన కోహ్లి, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుస రెండు సెంచరీలతో అదరగొట్టాడు.తాజాగా వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ ప్రదర్శనతోనే కోహ్లీ మళ్లీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ, డారిల్ మిచెల్, రోహిత్ శర్మ ముగ్గురి మధ్య కేవలం 10 రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉండటంతో అగ్రస్థానం కోసం పోటీ మరింత రసవత్తంగా మారింది. ఈ వన్డే సిరీస్ ముగిసే లోపు మళ్లీ ఆ ప్లేస్ మారే అవకాశం ఉంది. కాగా రోహిత్ రెండు మ్యాచ్ లలో విఫలమవడంతో మూడో ప్లేస్ కు పడిపోయాడు. డారిల్ మిచెల్ రెండో ప్లేస్ కు వచ్చేశాడు. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్ ఒక స్థానం ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు.
న్యూజిలాండ్ ఓపెనర్ కాన్వే మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 29వ స్థానానికి చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ పేసర్
మహమ్మద్ సిరాజ్ తన ప్లేస్ మెరుగుపరుచుకున్నాడు. తాజా జాబితాలో ఐదు స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు. కివీస్ పేసర్ కైల్ జేమీసన్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 69వ స్థానానికి చేరాడు. ఈ సిరీస్ ముగిసే సమయానికి బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.



