Taxpayers:బడ్జెట్ 2026లో సామాన్యుడికి కూల్ కబురు అందినట్లేనా? ట్యాక్స్ పేయర్స్‌కు శుభవార్త వచ్చిందా?
Taxpayers: సుమారు 65 ఏళ్ల క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో, సరళతరమైన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ను తీసుకొస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు
Taxpayers
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ట్యాక్స్ చెల్లింపుదారుల(Taxpayers)కు తీపి కబురు అందించారు. సుమారు 65 ఏళ్ల క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో, సరళతరమైన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ను తీసుకొస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతోంది. సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా ఫారమ్‌లను సరళీకృతం చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం.
మధ్యతరగతి జేబుకు ఊరట – పన్ను స్లాబులు ఇవే
కొత్త పన్ను విధానం (New Tax Regime) కింద పన్ను పరిమితులను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది.
రూ. 4 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు (0%).
రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షలు 5 శాతం పన్ను.
రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలు 10 శాతం పన్ను.
రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలు 15 శాతం పన్ను.
రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షలు 20 శాతం పన్ను.
రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షలు 25 శాతం పన్ను.
రూ. 24 లక్షల పైన 30 శాతం పన్ను.
ముఖ్యంగా రూ. 12 లక్షల వార్షిక ఆదాయం (నెలకు రూ. 1 లక్ష) ఉన్నవారికి స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే పన్ను భారం ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
విదేశీ ప్రయాణాలు, విద్య – టీసీఎస్ (TCS) తగ్గింపు..విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, వైద్యం కోసం వెళ్లే వారికి కూడా ఈ బడ్జెట్ శుభవార్త చెప్పింది. విదేశీ ప్రయాణాలు, విద్య, వైద్యానికి సంబంధించిన టీసీఎస్ (TCS) రేటును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. అయితే, విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు వాటి వివరాలను వెల్లడించడం ఇకపై తప్పనిసరి అని నిర్మలమ్మ క్లారిటీ ఇచ్చారు.
ఐటీఆర్ (ITR) దాఖలు గడువు పొడిగింపు..ట్యాక్స్ పేయర్స్(Taxpayers)కు వెసులుబాటు కల్పిస్తూ సవరించిన పన్ను రిటర్నుల (Revised ITR) దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ‘రూల్ బేస్డ్ ఆటోమేటెడ్ ప్రాసెస్’ ద్వారా న్యూ స్కీమ్ తీసుకురానున్నారు.
ఏవి చౌక.. ఏవి ప్రియం?..
చౌకయ్యేవి..క్యాన్సర్ ఔషధాలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ ప్యానెళ్లు, పౌర విమానాల విడిభాగాలపై ట్యాక్స్ తగ్గించారు. వ్యక్తిగత వస్తువుల దిగుమతిపై సుంకాన్ని 20% నుంచి 10% కి తగ్గించడం అనేది సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.
ప్రియమయ్యేవి.. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22%, నాన్-కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30% ట్యాక్స్ విధించారు.
పన్ను వివాదాల్లో ఊరట..
పన్ను వివాదాలకు సంబంధించి క్రిమినల్ చర్యల తీవ్రతను కూడా మోదీ ప్రభుత్వం తగ్గించింది. ఈ కేసులో జైలు శిక్షను గరిష్టంగా రెండేళ్లకు తగ్గించడమే కాకుండా, జరిమానా చెల్లిస్తే ఆ శిక్ష నుంచి కూడా మినహాయింపు లభించేలా మార్పులను చేశారు.

ట్యాక్స్ హాలిడే – డేటా సెంటర్లకు బూస్ట్..డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తూ భారతదేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. దీనివల్ల క్లౌడ్ కంప్యూటింగ్ సేవలందించే కంపెనీకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అలాగే అణు విద్యుత్ కేంద్రాల పరికరాల దిగుమతిపై 2035 వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు.



