Indigo: సంక్షోభంపై ఇండిగో క్షమాపణలు..  డీజీసీఏ షోకాజ్ నోటీసుకు రిప్లై

Indigo: డీజీసీఏ సైతం ఇండిగో సంస్థకు షోకాజో నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆ నోటీసులకు ఇండిగో సంస్థ సమాధానమిచ్చింది.

Indigo

భారత విమానయానరంగాన్ని కుదిపేస్తున్న ఇండిగో (Indigo)సంక్షోభం మెల్లిమెల్లిగా కొలిక్కి వస్తోంది. అనూహ్య పరిణామాల మధ్య ఇండిగో విమానాలు నిలిచిపోవడంతో గత నాలుగురోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మొత్తం సంక్షోభానికి పూర్తి కారణాలు తెలియకున్నా కేంద్ర విమానయాన శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అటు డీజీసీఏ సైతం ఇండిగో(Indigo) సంస్థకు షోకాజో నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆ నోటీసులకు ఇండిగో సంస్థ సమాధానమిచ్చింది. జరిగిన సంక్షోభానికి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పింది. జరిగిన పరిణానామాలకు విచారం వ్యక్తం చేస్తూ సుధీర్ఘ వివరణ ఇచ్చింది. విమానాల రద్దుకు అనేక కారణాలు ఉండటంతో ఊహించలేని పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొంది.

రూట్ కాజ్ అనాలిసిస్’కు మరికొంత సమయం కోరింది. అంటే జరిగిన సంక్షోభానికి పూర్తి కారణాలు తెలుసుకుని వెల్లడించేందుకు గడువు కోరినట్టు తెలుస్తోంది. ఇండిగో విమానాల రద్దుకు కారణాలను చూస్తే చిన్న చిన్న సాంకేతిక లోపాలు, శీతాకాలం ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ లో అనూహ్య మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన ట్రాఫిక్ వంటిని పేర్కొంది. అయితే గత రెండురోజులుగా విమానాలను మెల్లిమెల్లిగా పునరుద్ధరించినట్టు వాటి వివరాలను అందజేసింది.

indigo

జరిగిన సంక్షోభానికి పూర్తి బాధ్యత వహిస్తూ వివరణ ఇచ్చిన ఇండిగో(Indigo) డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులకు భోజనం, హోటల్ , స్థానిక రవాణా వంటి సదుపాయాలను అందించినట్టు పేర్కొంది. ఇక నిబంధనల ప్రకారం టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్ చెల్లింపులు చేసినట్టు తెలిపింది. ఇండిగో అందించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ రూ.827 కోట్లు రీఫండ్ చేశామని, డిసెంబర్ 15 నాటికి అన్ని రిఫండ్స్ సెటిల్ చేస్తామని స్పష్టం చేసింది. అలాగే తమ సంస్థకు చెందిన మొత్తం 1800 విమానాలలలో 1650 విమానాలు పునరుద్ధరించినట్టు వెల్లడించింది.

మరోవైపు ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఇండిగో రోస్టరింగ్ వ్యవస్థ లోపాలతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు వివరించారు. ఇండిగో ఉద్దేశ్యపూర్వకంగానే విమానాలను రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. పైలట్లు డ్యూటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఆ సంస్థ నిరాకరించిందని ఆరోపించారు. దీనిపై ఇండిగో సంస్థ ఇంకా పూర్తి వివరణ ఇవ్వలేదు. కేవలం డీజీసీఏ షోకాజ్ నోటీసులోని అంశాలకే ఇండిగో సంస్థ స్పందించింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version