PF:పీఎఫ్ విత్‌డ్రా మరింత ఈజీ..నిబంధనల్లో భారీ మార్పులు
PF:పీఎఫ్ అకౌంట్స్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే నిబంధనలను చాలా సులభతరం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

PF
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFఓ) శుభవార్త అందించింది. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమావేశంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) పీఎఫ్ అకౌంట్స్ నుంచి డబ్బు విత్‌డ్రా(PF) చేసుకునే నిబంధనలను చాలా సులభతరం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పుల వల్ల దాదాపు ఏడు కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ప్రయోజనం చేకూరనుంది.
విత్‌డ్రా నిబంధనల్లో భారీ మార్పులు తీసుకున్నారు. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులు ఇకపై ఉద్యోగి, యజమాని వాటా సహా, పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న విత్‌డ్రా చేసుకోదగిన బ్యాలెన్స్‌లో 100 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది పీఎఫ్ వినియోగదారులకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు.

పాక్షిక విత్‌డ్రాకు సంబంధించిన గతంలో ఉన్న 13 సంక్లిష్టమైన నిబంధనలను సీబీటీ రద్దు చేసి, వాటిని కేవలం ఒకే నిబంధనగా మార్చింది. ఈ కొత్త నిబంధనను ముఖ్యమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు రకాల ప్రధాన విభాగాలుగా విభజించారు.
పిల్లల చదువుల కోసం పీఎఫ్ తీసుకోవడానికి ఉన్న పరిమితిని పాత నిబంధనల్లోని 3 సార్ల నుంచి 10 సార్ల వరకు భారీగా పెంచింది.
వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు ఉన్న లిమిట్‌ను కూడా 3 సార్ల నుంచి 5 సార్ల వరకు పెంచింది.అన్ని రకాల పాక్షిక విత్‌డ్రాలకు పీఎఫ్ ఖాతాదారుల కనీస సర్వీసును గతంలో ఉన్న దాని కంటే తగ్గించి కేవలం 12 నెలలకు మాత్రమే నిర్ణయించారు.
పీఎఫ్ (PF)ఖాతాదారులకు కారణం చెప్పకుండానే విత్ డ్రా చేసుకునే మరో ముఖ్యమైన వెసులుబాటు తీసుకువచ్చారు. గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్ కింద పార్షియల్ పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు లేదా కంపెనీ మూసివేత వంటి నిర్దిష్ట కారణాలు చూపించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం, ఖాతాదారులు ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేకుండానే దరఖాస్తు చేసుకుని పీఎఫ్ విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
అయితే పీఎఫ్(PF) ఖాతాదారులు భవిష్యత్తులోనూ అధిక ప్రయోజనం పొందడానికి వీలుగా ఒక కొత్త నియమాన్ని అమలులోకి తెచ్చారు. అదేంటంటే, పీఎఫ్ అకౌంట్‌లో జమ చేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస బ్యాలెన్స్‌గా తప్పనిసరిగా ఉంచేలా రూల్ తీసుకొచ్చారు. దీనివల్ల పదవీ విరమణ సమయంలో ఈపీఎఫ్ఓ అందించే అధిక వడ్డీ ప్రయోజనాన్ని పెద్ద మొత్తంలో పొందేందుకు వీలవుతుంది. ఈ మార్పుల ద్వారా ఉద్యోగులు తమ ప్రస్తుత ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూనే, పదవీ విరమణ నిధికి కూడా భద్రత కల్పించినట్లవుతుంది.