Ram Mandir: పూర్తి కావొచ్చిన అయోధ్య రామాలయం నవంబర్ 25న ప్రధానిచే ప్రారంభోత్సవం
Ram Mandir: అయోధ్య రామాలయంలోని మొదటి అంతస్తులో రామ పరివార్ దేవతా విగ్రహాలను ఇప్పటికే ప్రతిష్ఠించారు. రెండో అంతస్తులో పలు భాషల్లో రామాయణ గ్రంథాలను భద్రపరిచే ఆధ్యాత్మిక లైబ్రరీగా రూపొందిస్తున్నారు.

Ram Mandir
అయోధ్య రామాలయం(Ram Mandir).. ప్రతి హిందువుని భావోద్వేగంతో ముడిపడిన ఆలయం.. దాదాపు ఐదు శతాబ్దాలుగా హిందువులంతా అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో తాత్కాలికంగా తెరుచుకున్నా త్వరలోనే అయోధ్య రామాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఆలయ నిర్మాణపనులు చివరిదశకు చేరుకున్నాయి. గత ఏడాది జనవరిలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగడం, భక్తులకు దర్శనం కల్పించడం కూడా జరిగాయి.
కానీ పూర్తిస్థాయి ఆలయం మాత్రం వచ్చే నెల నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది. నవంబర్ 25న శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన శిఖరంపై ప్రధాని మోదీ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకతో అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు ప్రకటిస్తారు. మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారని అయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

ఎన్నో అడ్డంకులను దాటుకుని అందుబాటులోకి వస్తున్న అయోధ్య రామాలయం(Ram Mandir)లో మొదటి అంతస్తు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అలాగే గర్భగుడి, పరిక్రమ మార్గం, 14 చిన్న ఆలయాల నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకున్న ఘట్టం కానుంది. ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోట్లాది మంది హిందువుల భక్తి, విశ్వాసాల కలయికగా ఇది నిలుస్తుందని ఆలయ కమిటీ చెబుతోంది. ఇదిలా ఉంటే 2022లో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తవగా..గత ఏడాది జనవరిలో ప్రాణప్రతిష్ఠ వేడుకతో మొదలైన నిర్మాణ ప్రక్రియ ఇప్పుడు కొలిక్కి వచ్చిందని కమిటీ తెలిపింది.
అయోధ్య రామాలయం(Ram Mandir)లోని మొదటి అంతస్తులో రామ పరివార్ దేవతా విగ్రహాలను ఇప్పటికే ప్రతిష్ఠించారు. రెండో అంతస్తులో పలు భాషల్లో రామాయణ గ్రంథాలను భద్రపరిచే ఆధ్యాత్మిక లైబ్రరీగా రూపొందిస్తున్నారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న 14 చిన్న ఆలయాలు కూడా పూర్తి చేసినట్టు వెల్లడించారు. బయట సరిహద్దు, ఇతర నిర్మాణాలు కూడా ఇప్పటికే పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చాయని ఆలయ కమిటీ వెల్లడించింది. కాగా గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ బాలరాముడిని 7 కోట్లమందికి పైగా భక్తులు దర్శించుకున్నట్టు అంచనా వేస్తున్నారు. నవంబర్్ 25న జరిగే పూర్తిస్థాయి ఆలయ ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది.