Smriti Mandhana
భారత మహిళల జట్టులో బ్యూటీగా పేరున్నస్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్ళి పీటలెక్కబోతోంది. ఊహించినట్టుగానే తన బాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకోబోతోంది. ఈ విషయాన్ని స్మృతి బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ అధికారికంగా ప్రకటించాడు. మంధాన లవ్ స్టోరీ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయిన పలాష్ ముచ్చల్ తో స్మృతి 2019 నుంచే డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది నుంచి కొన్నిసందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వారి లవ్ స్టోరీ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ వార్తలను నిజం చేస్తూ స్మృతితో తన డేటింగ్ ను పలాష్ ధృవీకరించాడు. త్వరలో మంధానను వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పాడు. స్మృతి త్వరలోనే ఇండోర్ కు కోడలిగా వస్తుంది.. ప్రస్తుతానికి తాను చెప్పగలిగింది ఇంతే అంటూ వ్యాఖ్యానించాడు. మీకు హెడ్ లైన్ వార్త ఇచ్చేసానంటూ నవ్వేశాడు.
పలాష్ ముచ్చల్ ఇండోర్ కు చెందిన వ్యక్తి. 2014లో డిష్కియాన్ అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న పలాష్ ఇప్పటి వరకూ 15 సినిమాలకు మ్యూజిక్ అందించాడు. పలు పార్టీల్లో స్మృతి(Smriti Mandhana)తో కలిసి కనిపించిన ముచ్చల్ కొన్నిసార్లు భారత మహిళల క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్ లకు సైతం హాజరయ్యాడు.
అప్పుడే చాలా మంది వీరిద్దరి బంధాన్ని ఖాయం చేసేసారు. భారత క్రికెట్ లో స్మృతి మంధాన ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. 29 ఏళ్ళ స్మృతి తన ఆటతో పాటు అందంతోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. పలాష్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు చాలా మంది అభిమానులు హార్ట్ బ్రేక్ ఎమోజీలతో తమ ఆవేదనను వ్యక్తం చేయడం కూడా హాట్ టాపిక్ అయింది.
స్మృతి మంధాన(Smriti Mandhana) సెప్టెంబర్ నెలకు గానూ ఐసిసి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికైంది. ఇటీవల ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ దుమ్మురేపడంతో ఆమెను ఈ అవార్డ్ వరించింది. స్మృతి ఇప్పటి వరకూ 7 టెస్టులు, 113 వన్డేలు, 153 టీ ట్వంటీలు ఆడింది. టెస్టుల్లో 624, వన్డేల్లో 5089 , టీ ట్వంటీల్లో 3982 పరుగులు చేసింది. మూడు ఫార్మాట్లలో కలిపి 16 శతకాలు బాదింది. కాగా స్మృతి మంధాన పెళ్ళి వార్త బయటకు రావడంతో పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు విషెస్ చెబుతున్నారు.