Tesla:మన రోడ్లపైకి టెస్లా వచ్చేస్తోంది.. మరి రేటెంతో తెల్సా ?
Tesla:భారత్‌లో టెస్లా మోడల్ Y ధరలు అమెరికాలో ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు రెట్టింపు ఉండటం మాత్రం గమనించాల్సిందే.

Tesla: కారు లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా.. భారత మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మోడల్ Y రెండు వేరియంట్ల ధరలను అఫీషియల్‌గా ప్రకటించడంతో భారతీయ EV ప్రియుల కల సాకారమైంది. కాకపోతే ఈ ధరలు సాధారణ కస్టమర్లకు కాస్త గట్టిగానే షాకిచ్చేలా ఉన్నాయి.
Tesla
టెస్లా మోడల్ Y: ధరలు, ఏ మోడల్ అందుబాటులో ఉందంటే..
భారత్‌లో టెస్లా విడుదల చేసిన మోడల్ Y రెండు వేరియంట్లతో వస్తోంది
రేర్ వీల్ డ్రైవ్ (RWD): దీని ధర రూ. 59.89 లక్షలు. అంటే, దాదాపు 60 లక్షల రూపాయలతో టెస్లా ఓనర్‌గా మారొచ్చు.
లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ (LR RWD): మరింత రేంజ్ కోరుకునే వారి కోసం దీని ధర రూ. 67.89 లక్షలు. దాదాపు 68 లక్షల రూపాయలతో పవర్-ప్యాక్డ్ టెస్లా మీ సొంతం చేసుకోవచ్చు.
అడ్వాన్స్ బుకింగ్స్ నేటి నుంచే షురూ అయ్యాయి. ఇప్పటికే మీకు టెస్లా డ్రీమ్స్ మొదలయ్యాయంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసేసుకోవడమే. బుకింగ్ చేసుకున్న వారికి ఆగస్టు నెలలో కార్లు డెలివరీ అవుతాయని టెస్లా ప్రకటించింది.
అమెరికాలో ఓ రేటు, ఇండియాలో మరో రేటు.
భారత్‌లో టెస్లా మోడల్ Y ధరలు అమెరికాలో ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు రెట్టింపు ఉండటం మాత్రం గమనించాల్సిందే. అమెరికాలో ఇదే మోడల్ Y ధర దాదాపు రూ. 38 లక్షలు మాత్రమే. ఈ భారీ వ్యత్యాసం వెనుక దిగుమతి సుంకాలు (import duties), పన్నులు (taxes) ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. హై ఎండ్ కార్లపై భారత్ విధించే భారీ ట్యాక్సులు ఈ ధరల తేడాకు కారణమవుతున్నాయి.
ముంబైలో గ్రాండ్ లాంచ్: బాంద్రాలో టెస్లా షోరూం.
టెస్లా తన భారత ప్రయాణాన్ని ముంబై నుంచి ప్రారంభించనుంది. ముంబైలోని పాష్ ఏరియా అయిన బాంద్రాలో టెస్లా షోరూం ప్రారంభానికి సిద్ధమైంది. ఇది టెస్లా బ్రాండ్‌కు భారత మార్కెట్‌లో ఒక బలమైన పునాది వేస్తుందని ఆశిస్తున్నారు.
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై ప్రభావం.
టెస్లా రాక భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను మరింత హీటు పుట్టించనుంది. ఇప్పటికే MG, Hyundai, Tata Motors వంటి కంపెనీలు EV సెగ్మెంట్‌లో తమదైన ముద్ర వేసుకుంటున్నాయి. టెస్లా తన వినూత్న టెక్నాలజీ, పర్ఫార్మెన్స్, ప్రీమియం అనుభవంతో ఎలా పోటీ పడుతుందో చూడాలి. అయితే, ఈ ధరలు కొంతమంది కొనుగోలుదారులను వెనకడుగు వేసేలా చేయవచ్చనే అంచనాలున్నాయి. ఏదేమైనా, టెస్లా ఎంట్రీతో భారతీయ EV రంగంలో సరికొత్త పోటీతో పాటు.. సరికొత్త టెక్నాలజీ ట్రెండ్స్ మొదలవడం మాత్రం గ్యారంటీ.