TTV Dhinakaran :టీటీవీ దినకరన్ రీ-ఎంట్రీతో ఎన్డీయేకు కొత్త ఊపు..తమిళనాడు రాజకీయాల్లో భారీ మలుపు
TTV Dhinakaran : దినకరన్ రీ-ఎంట్రీ కేవలం ఓట్ల కోసమే కాకుండా, ఏఐఏడీఎంకే శ్రేణులను ఏకం చేయడానికి కూడా ఉపయోగపడనున్నట్లు తెలుస్తోంది.
TTV Dhinakaran
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) అధినేత టీటీవీ దినకరన్(TTV Dhinakaran ) తిరిగి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరడం అతిపెద్ద రాజకీయ సంచలనంగా మారింది.
గతేడాది సెప్టెంబర్‌లో ఎడప్పాడి పళనిస్వామి (EPS) వైఖరిపై అసంతృప్తితో కూటమి నుంచి బయటకు వచ్చిన దినకరన్.. మళ్లీ అమిత్ షా , పియూష్ గోయల్ మధ్యవర్తిత్వంతో కూటమిలోకి అడుగుపెట్టారు.
అంతేకాదు గతంలోని విరోధాలన్నీ పక్కన పెట్టి, కేవలం అధికార డీఎంకే పార్టీని ఓడించడమే టార్గెట్‌గా అమ్మ జయలలిత వారసులందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఎన్డీయేకు ఈ పరిణామం భారీ బూస్ట్‌ను ఇచ్చేలా కనిపిస్తోంది.
టీటీవీ దినకరన్(TTV Dhinakaran ) రాజకీయ ప్రస్థానమంతా జయలలిత నీడలోనే సాగింది. 2017లో జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో జరిగిన అంతర్గత పోరు వల్ల ఆయన బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే, ప్రస్తుతం తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితులతో, ఓట్లు చీలకుండా ఉండేందుకు బీజేపీ పెద్దలు అందరినీ ఏకం చేసే పనిలో పడ్డారు.
ముఖ్యంగా దినకరన్, ఓ. పన్నీర్ సెల్వం (OPS) వర్గాలకు పట్టున్న తేవర్ కమ్యూనిటీ ఓటు బ్యాంకు ఇప్పుడు ఎన్డీయే కూటమికి పెద్ద బలంగా మారనుంది. సుమారు 25 నుంచి 30 నియోజకవర్గాల్లో ఈ ప్రభావం క్లియర్‌గా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 23న చెన్నై సమీపంలోని మదురాంతకం వద్ద జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభలో దినకరన్ పాల్గొనడం ఈ ఐక్యతకు నిదర్శనంగా నిలవనుంది.
ఈ కూటమి ప్రభావం వల్ల అధికార డీఎంకేకు గట్టి పోటీ తప్పేలా లేదు. గత 2021 ఎన్నికల్లో డీఎంకేకు పట్టున్న దక్షిణ తమిళనాడులో ఈసారి ఎన్డీయే జెండా ఎగురవేసే అవకాశముంది. ముఖ్యంగా నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ యువత ఓట్లను చీల్చే అవకాశం ఉండటంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు , కులపరమైన ఓట్లు అన్నీ ఎన్డీయే వైపు మళ్లేలా వ్యూహాలు సిద్ధం చేశారు.

ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఇప్పటికే ఖరారు చేయడం, దినకరన్ వంటి నాయకులు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడటం కూటమిలో కొత్త జోష్ నింపింది. ఈసారి ఎలాగైనా 140కి పైగా సీట్లు సాధించి తమిళనాడులో అమ్మ పాలనను మళ్లీ తీసుకురావాలని ఎన్డీయే భావిస్తోంది.
మొత్తంగా దినకరన్ రీ-ఎంట్రీ కేవలం ఓట్ల కోసమే కాకుండా, ఏఐఏడీఎంకే శ్రేణులను ఏకం చేయడానికి కూడా ఉపయోగపడనున్నట్లు తెలుస్తోంది. పాత గొడవలను మర్చిపోయి అందరూ ఒకే తాటిపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో క్యాడర్‌కు స్పష్టమైన సంకేతం వెళ్లింది. అయితే, భవిష్యత్తులో ఈ నాయకుల మధ్య పాత విభేదాలు మళ్లీ తలెత్తకుండా ఉండాలి.
అప్పుడే 2026లో ఎన్డీయే విజయం నల్లేరుపై నడక అవుతుంది. బీజేపీ కూడా ఈసారి తమిళనాడులో తన ఉనికిని చాటుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా, దినకరన్ రాకతో తమిళనాడు ఎన్నికల రణం ఇప్పుడే మొదలైందని చెప్పొచ్చు.
Assembly : అసెంబ్లీలో నో వర్క్ – నో పే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రతిపాదన అమలు సాధ్యమేనా?




One Comment