Rajya Sabha:రాజ్యసభ సమరం..10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు.. మరి తెలంగాణ సంగతేంటి?
Rajya Sabha భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో ఖాళీ అవబోతున్న స్థానాల భర్తీకి నగారా మోగింది.
Rajya Sabha
భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ(Rajya Sabha)లో ఖాళీ అవబోతున్న స్థానాల భర్తీకి నగారా మోగింది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 2026లో పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
మహారాష్ట్రలోని 7 స్థానాలు, తమిళనాడులోని 6 స్థానాలు , పశ్చిమ బెంగాల్ లోని 5 స్థానాలు, బీహార్ లోని 5 స్థానాలు, ఒడిశా లోని 4 స్థానాలు, అస్సాంలోని 3 స్థానాలు, హర్యానాలోని 2 స్థానాలు, ఛత్తీస్గఢ్ లోని 2 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో ఒక స్థానం అలాగే మన తెలంగాణ 2 స్థానాలలో ఈ ఎన్నికలలు జరగనున్నాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కీలక సభ్యుల పదవీకాలం ముగియబోతుండటంతో ఈ ఖాళీలు ఏర్పడుతున్నాయి. గతంలో ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు కె.ఆర్.సురేష్ రెడ్డి ఆరేళ్ల పదవీకాలం 2026 ఏప్రిల్ 9వ తేదీతో ముగియబోతోంది.
దీంతో ఈ రెండు స్థానాల కోసం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలబలాల ఆధారంగా చూస్తే, ఈ రెండు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఈజీగా కైవసం చేసుకునే అవకాశమే కనిపిస్తోంది.

ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూస్తే..ఫిబ్రవరి 26న ఈ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అభ్యర్థులకు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి ..మార్చి 5వ తేదీ వరకు గడువు ఉంటుంది.ఆ మర్నాడు అంటే మార్చి 6 వతేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఒకవేళ అభ్యర్థులు కనుక తమ పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తే, మార్చి 9న సాయంత్రం లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
ఇక అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ మాత్రం మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపును చేపట్టి, వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. రాజ్యసభ(Rajya Sabha) ఎన్నికల్లో ఓటింగ్ ప్రాసెస్ అంతా పారదర్శకంగా ఉండటానికి ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
కేవలం రిటర్నింగ్ ఆఫీసర్ సరఫరా చేసిన వైలెట్ స్కెచ్ పెన్నులను మాత్రమే ..ఎమ్మెల్యేలు తమ ప్రాధాన్యతలను గుర్తించడానికి వాడాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 20వ తేదీకి ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి కానుంది. ఈ ఎన్నికల ఫలితాలు.. రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాలను మార్చడమే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో కూడా కొత్త సమీకరణాలకు దారితీస్తాయని విశ్లేషుకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



