India vs Netherland : మళ్లీ వార్ వన్ సైడేనా ?..నేడు భారత్ చివరి గ్రూప్ మ్యాచ్
India vs Netherland : టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 స్టేజ్ కు ముందు నెదర్లాండ్స్ పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునేందుకు భారత్ రెడీ అయింది. గత మ్యాచ్ లలో నిరాశపరిచిన అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ లోకి వచ్చేందుకు ఇది గొప్ప అవకాశం
India vs Netherland
టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 స్టేజ్ కు ముందు నెదర్లాండ్స్ పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునేందుకు భారత్(India vs Netherland) రెడీ అయింది. గత మ్యాచ్ లలో నిరాశపరిచిన అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ లోకి వచ్చేందుకు ఇది గొప్ప అవకాశం. ముఖ్యంగా అభిషేక్ శర్మపైనే అందరి చూపు ఉంది. ఈ మెగాటోర్నీలో అభిషేక్ శర్మ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఇప్పటి వరకూ ఆడలేకపోయాడు.
సూపర్ 8లో అన్నీ పెద్ద జట్లతోనే మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో ఫామ్ అందుకోవడం అభిషేక్ కు కూడా కీలకమనే చెప్పాలి. అలాగే సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తన దూకుడు కొనసాగింతే తిరుగుండదు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పూర్తిస్థాయిలో టచ్ లోకి రావాలని ఎదురుచూస్తున్నాడు. తిలక్ వర్మ దూకుడుగానే ఆడుతున్నా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు.
ఈ లోటును నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో తీర్చేసుకుంటే సూపర్ 8 రౌండ్ కు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అటు రింకూ సింగ్ కు పెద్దగా అవకాశాలు రాకపోగా, హార్థిక్ పాండ్యా పర్వాలేదనిపిస్తున్నాడు. ఒక్కోసారి బ్యాట్ తో కాకుంటే బంతితో అదరగొడుతున్నాడు. చివర్లో శివమ్ దూబే కూడా మెరుపులు మెరిపిస్తుండగా.. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉండడంతో బ్యాటింగ్ డెప్త్ పెరిగింది.

బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా అతనికి రెస్ట్ ఇచ్చి సిరాజ్ ను ఆడించే అవకాశముంది. అలాగే ధారాళంగా పరుగులిచ్చేస్తున్న అర్షదీప్ సింగ్ తన లైన్ అండ్ లెంగ్త్ అందుకుటాడేమో చూడాలి, స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నారు.
వీరి స్పిన్ మ్యాజిక్ కు నెదర్లాండ్స్ బ్యాటర్లు క్రీజులో ఎంతవరకూ నిలబడతారో చూడాలి. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ కు అవకాశమివ్వాలనుకుంటే మాత్రం రింకూను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నెదర్లాండ్స్(India vs Netherland) ను కూడా చిత్తు చేసి నాలుగు విజయాలతో సూపర్ 8 స్టేజ్ కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భారత్ భావిస్తోంది.



