Local Elections: త్వరలో ఏపీ స్థానిక ఎన్నికలు వైసీపీ పోటీ చేస్తుందా..లేదా.. ?
Local Elections: మూడు నెలల్లోనే స్థానిక ఎన్నికలు జరిగితే వారిని నడిపించే నేతలు కూడా కరువయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Local Elections
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Elections) షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. దీంతో పల్లెల్లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అటు ఏపీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ నెలాఖరులో లేదా జనవరి నెలలో ఏపీ స్థానిక ఎన్నికలు(Local Elections) జరిగే అవకాశాలున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన వైసీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. పల్లెపోరులో పోటీ చేయడమే మంచిదని సీనియర్లు చెబుతుంటే… మరికొందరు మాత్రం వద్దంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ ఓడితే ఉన్న కొద్దిపాటి పరువు కూడా పోతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఒకవిధంగా వైసీపీ కంటే కూడా కూటమి ప్రభుత్వానికే ఈ ఎన్నికలు కీలకమని చెప్పొచ్చు. ఏడాదిన్నర తమ పాలన, హామీల అమలు వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు కొంతవరకూ తేటతెల్లమవుతాయి.
మరోవైపు వైసీపీలో మాత్రం స్థానిక ఎన్నికల(Local Elections)పై ఎలాంటి క్లారిటీ లేదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు పార్టీని వీడితే… మరికొందరు సైలెంట్ అయిపోయారు. ఉన్న కొద్దిమంది సీనియర్ నేతలు ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా, టీవీ చర్చలు వంటి వాటిలో బిజీగానే ఉంటున్నారు. అయికే కిందిస్థాయిలో మాత్రం పార్టీ శ్రేణులు పెద్ద ఉత్సాహంగా లేవని సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను చాలా వరకూ మార్చింది. కొందరిని నియోజకవర్గాలను మార్పు చేసింది. కానీ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఆయా నియోజకవర్గాలను పలువురు నేతలు వదిలేసారు.

కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదన్న అసంతృప్తి కూడా ఉంది. మూడు నెలల్లోనే స్థానిక ఎన్నికలు జరిగితే వారిని నడిపించే నేతలు కూడా కరువయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పోటీ చేస్తే మళ్ళీ ప్రభుత్వం ముందు అవమానమే మిగులుతుందని పలువురు నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పోటీ చేయకుండా ఉంటే మాత్రం కూటమి ప్రభుత్వానికి భయపడినట్టు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నది కూడా మరో అభిప్రాయంగా ఉంది. ఓడినా , గెలిచినా పోటీ చేస్తేనే మంచిదని కొందరు నేతలు చెబుతుండడంతో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.