Katyayani
బృందావనంలో వెలసిన కాత్యాయనీ(Katyayani) దేవి శక్తిపీఠం, కృష్ణ భక్తితో, శక్తి ఆరాధనతో అనూహ్య కలయికను సాధించిన పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం, సతీదేవి శరీరంలోని కేశ రాశి (జుట్టు) ఇక్కడ పడింది. అందుకే దీనిని “ఉమా శక్తిపీఠం”గా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కేవలం శక్తి పీఠంగానే కాకుండా, బృందావనంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయాలతో పాటు దర్శించుకోవడానికి ఒక ముఖ్య ప్రదేశంగా నిలిచింది.
పురాణ కథనం – గోపికల ప్రేమ గాథ..బృందావనంలోని గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని కోరుకున్నారు. వారి కోరికను తీర్చడానికి వృందా దేవి వారికి కాత్యాయనీ (Katyayani)దేవిని పూజించమని సూచించింది. అప్పటి నుంచే మార్గశిర మాసంలో యువతులు కాత్యాయనీ వ్రతం చేస్తే మనసుకు నచ్చిన వరుడు లభిస్తాడని విశ్వాసం.
ఈ ఆలయాన్ని 1923 ఫిబ్రవరిలో మాఘ పూర్ణిమ రోజున ప్రతిష్ఠించారు. కేశవానంద మహరాజ్ అనే మహాత్ముడికి కలలో కాత్యాయనీ దేవి ఆదేశించిన మేరకు ఆయన వృందావనం చేరుకుని ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం తెలుపు పాలరాతితో నిర్మించబడింది.
కాత్యాయనీ దేవి (ఉమా దేవి) ప్రధాన దైవంగా పాటు, శివుడు (భోతేశ్వర్), లక్ష్మీనారాయణుడు, గణేశుడు, సూర్యుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. రెండు బంగారు సింహాలు దేవత వాహనంగా ఆలయ మెట్ల దగ్గర ఉంటాయి.
కాత్యాయనీ వ్రతం చేసే యువతులకు మనసుకు నచ్చిన వరుడు లభిస్తాడని బలంగా నమ్ముతారు. కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి, హోళీ, దీపావళి, వసంత పంచమి పండుగలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. చండీ పాఠం (దుర్గా సప్తశతి) పఠనం నిత్యం జరుగుతుంది.
మథుర నుంచి బృందావనం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ నుంచి రైలు, బస్సు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బృందావనంలోని ఇతర ఆలయాలతో కలిపి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు.