Just SpiritualLatest News

Shiva lingas : అలల తాకిడికి మాయమయ్యే శివలింగాలు.. దీని వెనుక ఉన్న పురాణగాథ ఏంటి?

Shiva lingas: సముద్రం మీద కేవలం ఆలయ శిఖరం పైన ఉన్న స్తంభం , ఎగిరే జెండా మాత్రమే కనిపిస్తాయి.

Shiva lingas

ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్న ఆలయాలున్నాయి కానీ, గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ దగ్గరలో కోలియాక్ తీరంలో వెలసిన నిష్కలంక మహాదేవ్ ఆలయం.. అత్యంత అరుదైనది , అద్భుతమైనది. ఎందుకంటే ఈ ఆలయం సముద్ర తీరానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల ఉంటుంది.

దీని ప్రత్యేకత ఏమిటంటే, రోజూ సముద్రంలోని అలలు పెరిగినప్పుడు అంటే.. హై టైడ్ సమయంలో ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో సముద్రం మీద కేవలం ఆలయ శిఖరం పైన ఉన్న స్తంభం , ఎగిరే జెండా మాత్రమే కనిపిస్తాయి.

మళ్లీ అలలు తగ్గినప్పుడు అంటే.. లో టైడ్ సమయంలో సముద్రం ఆశ్చర్యంగా దారి ఇస్తుంది. అప్పుడు భక్తులు సుమారు రెండు కిలోమీటర్ల వరకూ సముద్ర గర్భంలో నడుచుకుంటూ వెళ్లి అక్కడ కొలువై ఉన్న 5 స్వయంభూ శివలింగాల(Shiva lingas)ను దర్శించుకుంటారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ మార్గం భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మిగిలిస్తుంది.

ఈ క్షేత్రం వెనుకున్న పౌరాణిక నేపథ్యం మహాభారత కాలానికి చెందిందని అంటారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత, కౌరవులను సంహరించిన పాండవులకు.. మనశ్శాంతి కరువవుతుంది. సొంత దాయాదులను, బంధువులను చంపిన కారణంగా వారికి గోత్ర హత్య, బ్రహ్మ హత్య పాతకాలు చుట్టుముట్టాయి.

ఈ పాపాల నుంచి విముక్తి పొందడానికి మార్గం చూపించాలని వారు శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ వారికి ఒక నల్లటి జెండాను , ఒక నల్లటి ఆవును ఇచ్చి, మీరు దేశాటనం చేయమని, ఏ ప్రదేశంలోనైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారుతాయో, అక్కడ మీకు పాప విముక్తి కలుగుతుందని చెప్పారట.

అలా పాండవులు ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ చివరకు గుజరాత్ తీరంలోని కోలియాక్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అడుగు పెట్టగానే ఆ నల్లని ఆవు, జెండా తెల్లగా మారిపోయాయి. అప్పుడు పాండవులకు తాము పాప విముక్తులయ్యామని అర్థమవుతుంది.

ఆ తర్వాత అక్కడే పాండవులంతా కలిసి పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా.. వారి భక్తికి మెచ్చిన శివుడు ఐదుగురు పాండవులకు ఐదు వేర్వేరు శివలింగాలుగా దర్శనమిచ్చాడు. ఐదుగురు పాండవులు ఆ ఐదు శివలింగాలను అక్కడే ప్రతిష్టించి పూజించారు. దీంతో శివుడు వారిని నిష్కలంకులుగా అంటే ఎటువంటి కల్మషం, పాపం లేనివారిగా ప్రకటించాడు కాబట్టి, ఈ ఆలయానికి నిష్కలంక మహాదేవ్ అనే పేరు వచ్చిందని అంటారు.

Shiva lingas
Shiva lingas

ఈ ఆలయంలో నంది విగ్రహం కూడా ఉంటుంది. రోజూ సముద్రపు నీరు రెండుసార్లు వచ్చి ఈ శివ లింగాలకు అభిషేకం చేసి వెళ్తుండటం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు సముద్రపు నీరు తగ్గే వరకు తీరం వెంబడి గంటల తరబడి వేచి ఉంటూ.. అలలు తగ్గగానే అక్కడ ఉండే ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ వెళ్తారు.

ఇక్కడి సముద్ర స్నానం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. చనిపోయిన తమ పితృదేవతల అస్తికలను ఇక్కడ నిమజ్జనం చేయడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇప్పటికీ కూడా సైన్స్ కు అందని ఒక విషయం ఏమిటంటే, ఎన్ని వేల ఏళ్లుగా సముద్రపు ఉప్పు నీటిలో ఉన్నా ఆ శివలింగాలు(Shiva lingas) , నంది విగ్రహం చెక్కుచెదరకపోవడమే.

అయితే అక్కడ అలలు పెరిగే సమయం , తగ్గే సమయం గురించి స్థానిక ఆలయ నిర్వాహకులు ఎప్పటికప్పుడు భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఎందుకంటే ఒక్కసారి అలలు పెరగడం మొదలవగానే క్షణాల్లో సముద్రం ముందుకు వచ్చేస్తుంది. ప్రకృతి కూడా దైవానికి దాసోహం అని చెప్పడానికి నిష్కలంక మహాదేవ్ ఆలయం ఒక గొప్ప నిదర్శనం అంటారు పండితులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button