Prasadam: పూటపూటకూ ఒక ప్రత్యేక మెనూ .. శ్రీవారి ప్రసాదాల వెనుక దాగి ఉన్న రహస్యాలు!
Prasadam: ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న శ్రీవారి ప్రసాదాల వెనుక దాగి ఉన్న వైభవం, నియమాలు, పవిత్రత గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం.

Prasadam
తిరుమల కొండపై కాలు మోపగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏడుకొండలవాడు. ఆయన దర్శనం అయిన తర్వాత మన మనసులో మెదిలేది ఆయన ప్రసాదమైన లడ్డూ. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఈ తీపి ప్రసాదం వెనుక దాగి ఉన్న వైభవం, నియమాలు, పవిత్రత గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. శ్రీవారికి కేవలం లడ్డూ మాత్రమే కాదు, పూటపూటకూ ఒక ప్రత్యేకమైన, సంప్రదాయబద్ధమైన మెనూ ఉంటుంది. అవే స్వామివారికి సమర్పించే పవిత్రమైన భోగాలు.
శ్రీవారికి ప్రసాదాలు(Prasadam) తయారు చేసే ప్రదేశాన్ని పోటు అని పిలుస్తారు. ఈ పోటులో పాటించే నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. ప్రసాదాలను వండటానికి కేవలం మామిడి, అశ్వత్థ, పలాస చెట్ల ఎండిన కొమ్మలనే ఉపయోగిస్తారు. వంట చేసే అర్చకులు ముఖానికి, ముక్కుకు ఒక వస్త్రం కట్టుకుంటారు. దీనివల్ల వంటపై వారి వాసన సోకకుండా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నైవేద్యం సమర్పించే వరకు బయటి వ్యక్తులు ఎవరూ చూడరాదు. ఈ నియమాలన్నీ ప్రసాదం యొక్క పవిత్రతను కాపాడటానికి పాటిస్తారు.
శ్రీవారికి రోజుకు మూడు పూటలా నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం సమయంలో సమర్పించే దానిని బాలభోగం అంటారు. ఇందులో మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం , రవ్వ కేసరి ఉంటాయి. మధ్యాహ్నం సమర్పించేది రాజభోగం, ఇందులో శుద్ధాన్నం, పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర/చక్కెర అన్నం ఉంటాయి.

ఇక రాత్రికి సమర్పించే శయనభోగంలో మిరియాల అన్నం, దోసె, లడ్డూ, వడ, శాకాన్నం వంటివి ఉంటాయి. ఈ నైవేద్యం సమర్పించే విధానం కూడా ఒక యజ్ఞంలాగే ఉంటుంది. మొదట గర్భాలయాన్ని శుద్ధి చేసి, గాయత్రీ మంత్రంతో నీళ్లు చల్లుతారు. అనంతరం, మూతపెట్టిన పాత్రలలో ఉన్న ప్రసాదాలపై అర్చకుడు విష్ణు గాయత్రీ మంత్రం జపిస్తూ నెయ్యి, తులసి ఆకులు చల్లుతాడు. ఆ తర్వాత అన్నసూక్తం పఠిస్తూ, ముద్దముద్దగా స్వామివారి కుడిచేతికి తాకిస్తారు. ఇది కేవలం నైవేద్యం కాదు, సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల ఆకలిని తీర్చే ఒక మహాయజ్ఞంగా భావిస్తారు.
ఈ రోజువారీ భోగాలతో పాటు, శ్రీవారికి కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా సమర్పిస్తారు. ఉదయాన్నే తాజా వెన్న, పాలు సమర్పిస్తారు. రాత్రి శయనభోగం తర్వాత కూడా అర్ధరాత్రి తిరువీశం అనే పేరుతో బెల్లపు అన్నం నైవేద్యంగా పెడతారు. చివరగా, రాత్రి ఏకాంతసేవలో స్వామివారికి పండ్లు, వేరుశనగలు, వేడి పాలు సమర్పించి, ఆయనకు విశ్రాంతిని కల్పిస్తారు.
ఈ ప్రసాదా(Prasadam)లన్నీ కేవలం వండిన ఆహార పదార్థాలు కాదు, అవి ఎలాంటి హింస లేని, ఔషధ గుణాలున్న దివ్యమైన ప్రసాదాలు. ఈ ప్రసాదం స్వీకరించడం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడమే కాదు, అది శ్రీవారి కరుణకు, ఆయన దివ్యమైన ఆశీస్సులకు ఒక సంకేతం.