Bhogi Pandlu:లోగిళ్లలో భోగి సందడి.. చిన్నారులపై పోసే ఆ భోగి పండ్ల వెనుక ఉన్న అంతరార్థమిదే..
Bhogi Pandlu: భోగి రోజు చిన్నారులపై ఈ భోగి పండ్లు(Bhogi Pandlu)ఎందుకు పోస్తారనే విషయం చాలామందికి తెలీదు.
Bhogi Pandlu
సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి అంటేనే అందరిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. తెల్లవారుజామునే వేసే భోగి మంటలు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి. అయితే భోగి పండుగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మాత్రం చిన్నారులకు పోసే భోగి పండ్లు (Bhogi Pandlu ).
అసలు చిన్నారులపై ఈ భోగి పండ్లు(Bhogi Pandlu)ఎందుకు పోస్తారనే విషయం చాలామందికి తెలీదు. కానీ అందరూ దాని వెనుక ఉన్న పురాణ గాథలు , ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలుసుకోవడం మన సంప్రదాయంలో ఒక భాగం అని చెబుతారు పెద్దలు. భోగి పండ్లు పోయడమనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది పిల్లలకు ఇచ్చే ఒక గొప్ప రక్షా కవచం వంటిదని మన పెద్దలు చెబుతుంటారు.
భోగి పండ్లు(Bhogi Pandlu) పోయడానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కారణం ఉందట. పురాణాలు చెబుతున్నదాని ప్రకారం, సూర్యుడికి భోగి అనే పేరు కూడా ఉంది. అందుకే ఆ రోజు సూర్యుడిని ఆరాధిస్తూ, సూర్యుని రూపమైన రేగు పండ్లను పిల్లల తలపై పోస్తారు. రేగు పండును సంస్కృతంలో బదరీ ఫలమని పిలుస్తారు.
ఎందుకంటే నరనారాయణులు బదరికా వనంలో తపస్సు చేసినప్పుడు.. దేవతలు వారిపై ఈ పండ్లను కురిపించారని, అందుకే పిల్లలను నారాయణ స్వరూపంగా భావించి వారిపై ఈ పండ్లను పోస్తారని నమ్మకం. ఇలా చేయడం వల్ల పిల్లలపై ఉన్న దిష్టి పూర్తిగా తొలగిపోతుందని, శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు వారికి లభిస్తాయని నమ్ముతారు.
భోగి పండ్ల మిశ్రమంలో కేవలం రేగు పండ్లు మాత్రమే కాకుండా.. చెరకు గడ ముక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమలు, కొన్ని ప్రాంతాల్లో అక్షింతలు బంతిపూల రెక్కలను కూడా కలుపుతారు. రేగు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి పిల్లలను రక్షించే శక్తి వీటికి ఉంటుంది.

అంతేకాదు తల మీద ఈ రేగు పండ్లను పోయడం వల్ల బ్రహ్మరంధ్రం ద్వారా ఆ శక్తి శరీరానికి అందుతుందని సైన్స్ చెబుతోంది. అలాగే చెరకు గడలు తీపికి, నాణేలను ఐశ్వర్యానికి చిహ్నాలుగా భావిస్తారు. అంటే పిల్లల జీవితం తీపిగా, సుఖసంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు.
ఈ వేడుక చేసేటప్పుడు పిల్లలకు కొత్త బట్టలు వేసి, తూర్పు దిశగా కూర్చోబెట్టాలని పెద్దలు చెబుతారు. ముత్తైదువులందరూ కలిసి దిష్టి తీస్తూ పిల్లల తలపై నుంచి ఈ భోగి పండ్ల మిశ్రమాన్ని ధారగా పోస్తారు. ఆ సమయంలో పిల్లల ముఖంలో కనిపించే ఆనందం గురించి ఎవరూ వర్ణించలేరు. అలాగే పక్కనే ఉన్న తోటి పిల్లలు ఆ పండ్లను, నాణేలను ఏరుకోవడానికి పోటీ పడటం కూడా ఈ వేడుకలో ఒక కనువిందు చేసే దృశ్యం.
ఇలా చేయడం వల్ల పిల్లల్లో సామాజిక స్పృహ పెరగడమే కాకుండా, పెద్దల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల అవగాహన కలుగుతాయని దీనిని ఆనవాయితీగా సాగించాలని పెద్దలు ఆశపడతారు. అందుకే మీకు కూడా ఈ సంక్రాంతికి మీ ఇంట్లోని చిన్నారులకు భోగి పండ్లు పోసి, మన సంస్కృతిని వారికి పరిచయం చేయండి.
Trump:నేనే వెనెజులా అధ్యక్షుడిని.. ట్రంప్ సంచలన పోస్ట్ వెనుక అసలు నిజమేంటి?




One Comment