Ashes Test: సిరీస్ వచ్చే..రెవెన్యూ పోయే.. ఆసీస్ బోర్డును ముంచేసిన యాషెస్
Ashes Test: ఊహించని విధంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు రూ.60 కోట్ల పైన నష్టాలు వచ్చినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ లో హోరాహోరీ పోరు కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తుండగా.. చాలా మ్యాచ్ లు ఐదోరోజు వరకూ ఉత్కంఠగా సాగుతుంటాయి.
Ashes Test
యాషెస్ సిరీస్(Ashes Test) కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు ఆస్ట్రేలియా, అటు ఇంగ్లాండ్ దేశాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్ ఫ్యాన్స్ ఈ సిరీస్ ను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. టీవీల్లోనూ యాషెస్ సిరీస్ లోనే రికార్డ్ వ్యూయర్ షిప్ వస్తుంది. అలాగే సైతం స్టేడియంలో రికార్డు స్థాయిలో హౌస్ ఫుల్ అయ్యేది కూడా యాషెస్ సిరీస్ (Ashes Test)తోనే.. అలాంటి సిరీస్ వచ్చిందంటే ఆతిథ్య క్రికెట్ బోర్డుకు కాసుల వర్షమే.. అయితే ఈ సారి సీన్ రివర్సయింది.
ఊహించని విధంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు రూ.60 కోట్ల పైన నష్టాలు వచ్చినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ లో హోరాహోరీ పోరు కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తుండగా.. చాలా మ్యాచ్ లు ఐదోరోజు వరకూ ఉత్కంఠగా సాగుతుంటాయి. ఈ సారి మాత్రం రెండు రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ కూడా అంతే.. ఈ నేపథ్యంలో ఆసీస్ బోర్డు భారీగా టికెట్ రెవెన్యూను కోల్పోయింది.

మ్యాచ్ జరిగిన రెండు రోజులు కూడా రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 94 వేల వరకూ స్టేడియానికి అభిమానులు తరలివచ్చారు. మ్యాచ్ మాత్రం రెండు రోజుల్లోనే ముగిసిపోవడంతో ఆసీస్ బోర్డు ఆదాయానికి భారీగా గండిపడింది. టికెట్ రెవిన్యూ మాత్రమే కాదు బ్రాడ్ కాస్టింగ్ లో వాణిజ్య ప్రకటనల ద్వారా మూడు రోజుల ఆదాయం కోల్పోయింది. యాషెస్ సిరీస్ (Ashes Test)కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మొత్తం ఐదు రోజుల పాటు వాణిజ్య ప్రకటనలన్నీ ముందే బుక్ అయిపోయాయి. ఇప్పుడు మూడు రోజుల ముందే ఆట ముగిసిపోవడంతో ఆ ఆదాయమంతా రాకుండా పోయింది.
దీంతో యాషెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.60 కోట్ల కంటే ఎక్కువగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితికి అక్కడి పిచ్ లే కారణం. దాదాపు బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లే రూపొందిస్తుండడంతో మ్యాచ్ లు సగం రోజులు కూడా సాగడం లేదు. దీంతో యాషెస్ సిరీస్ గెలిచిన ఆనందం ఒకవైపు ఉంటే.. మరోవైపు భారీగా ఆదాయం కోల్పోయిన వైనం ఆసీస్ బోర్డును ఇబ్బంది పెడుతోంది. అటు మాజీ ఆటగాళ్లు సైతం ఈ పిచ్ లపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పిచ్ లతో టెస్ట్ క్రికెట్ ను ఎలా కాపాడతారంటూ ప్రశ్నిస్తున్నారు. మరి చివరి టెస్ట్ మ్యాచ్ అయినా పూర్తిగా ఐదు రోజులు జరుగుతుందో లేదో చూడాలి.



