ICC:ట్రోఫీ పంపిస్తావా ? లేదా ?.. నఖ్వీకి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్
ICC:ఆసియాకప్ గెలిచిన టీమిండియాకు ఆ ట్రోఫీ మాత్రం ఇంకా అందలేదు.

ICC
ఆసియాకప్ గెలిచిన టీమిండియాకు ఆ ట్రోఫీ మాత్రం ఇంకా అందలేదు. పీసీబీ ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్న మోసిన్ నఖ్వీ ఓవరాక్షనే దీనికి కారణం. ఈ టోర్నీ ఆరంభమైనప్పటి నుంచీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నఖ్వీ స్థాయి దిగజారి వ్యవహరించారు. ఏసీసీ ప్రెసిడెంట్ గా తటస్థ వైఖరితో ఉండాల్సిన నఖ్వీ పాక్ జట్టు ప్రతినిథిగా మారిపోయారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చినా ఆయన తీరు మార్చుకోలేదు.
మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ తో మ్యాచ్ లు ఆడడంపై విమర్శలు వచ్చినప్పటకీ ముందు చేసుకున్న ఒప్పందం మేరకు భారత్ తలపడింది. అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, జట్టులోని ఇతర ఆటగాళ్ళు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. టాస్ సమయంలోనూ, మ్యాచ్ ముగిసిన తర్వాత వారి మొహాలు కూడా చూడలేదు. దీనిపై పాక్ జట్టు హంగామా చేసేందుకు ప్రయత్నించినా భారత్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అలాగే ఫైనల్లో పాక్ పై గెలిచిన తర్వాత పాక్ మంత్రిగా కూడా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీనికి నిరసనగా నఖ్వీ ట్రోఫీ, మెడల్స్ తీసుకెళ్ళి ఛీప్ గా ప్రవర్తించారు. పాక్ కు తిరిగి వెళ్ళిపోతూ దుబాయిలోని ఏసీసీ కార్యాలయంలో వాటిని ఉంచారు. వెళుతూ వెళుతూ తన అనుమతి లేకుండా ఎవ్వరికీ ట్రోఫీ ఇవ్వొద్దని ఆదేశాలు కూడా ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపింది.

నఖ్వీ ఓవరాక్షన్ పై తీవ్రస్థాయిలో మండిపడిన బీసీసీఐ ఏసీసీకి ఫిర్యాదు చేసింది. అయినప్పటకీ వెనక్కి తగ్గని నఖ్వీ దుబాయి వచ్చి తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలంటూ ట్వీట్ చేశాడు. దీంతో మరింత ఫైర్ అయిన బీసీసీఐ ట్రోఫీని భారత్ రప్పించే ప్రయత్నాల్లో పడింది. తాజాగా నఖ్వీకి బీసీసీఐ చివరి వార్నింగ్ ఇచ్చింది. మర్యాదగా ఆసియాకప్ ట్రోఫీని భారత్ కు పంపాలని హెచ్చరించింది. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉందంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. నఖ్వీ తన స్థాయి దిగజారి ప్రవర్తించారని, ఆసియాకప్ ఆతిథ్య దేశమైన భారత్ హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.
ఇప్పటికే పలుసార్లు చెప్పినా వినకపోవడంతో చివరిసారిగా మెయిల్ పంపించినట్టు బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా చెప్పారు. ఒకవేళ దీనికి స్పందించకుండా మళ్ళీ ఓవరాక్షన్ చేస్తే మాత్రం ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. తర్వాత పర్యావసానాలకు నఖ్వీనే బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఐసీసీ నుంచి కూడా నఖ్వీని సాగనంపేందుకు బీసీసీఐ పావులు కదుపుతోంది.