India Women Cricket Team: అమ్మాయిలు అదరగొట్టేయండి.. ఈ సారి మిస్ అవ్వొద్దు
India Women Cricket Team: సెమీస్ లో ఆ జట్టు ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఒత్తిడి తట్టుకోవడంపైనే సఫారీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
India Women Cricket Team
మహిళల వన్డే క్రికెట్ లో ఈ సారి ఫ్యాన్స్ కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నారు. ఎందుకంటే ఫైనల్ కు చేరిన భారత్(India), సౌతాఫ్రికా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గతంలో భారత్(India) రెండుసార్లు (2005,2017) ఫైనల్ కు చేరినా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. దీంతో ఈ సారి హోం అడ్వాంటేజ్ తో ఎట్టిపరిస్థితుల్లోనూ టైటిల్ చేజార్చుకోకూడదని పట్టుదలగా ఉంది.
సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలవడం భారత్ కాన్ఫిడెన్స్ ను బాగా పెంచింది. అది కూడా ఏ చిన్న స్కోర్ కాకుండా ఏకంగా 339 రన్స్ ఛేజ్ చేసి గెలవడంతో ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. అలా అని సౌతాఫ్రికాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరిన రెండు జట్లదీ దాదాపుగా ఒకే విధమైన ప్రయాణం, ప్రపంచకప్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ తొలి రెండు మ్యాచ్ లలో అదరగొట్టింది. కానీ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లలో ఓటమితో వెనుకబడిపోయింది. ఒకదశలో సెమీస్ చేరుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి.

అయితే డూ ఆర్ డై మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయింది. న్యూజిలాండ్ పై జూలు విదిల్చి భారీస్కోరుతో దుమ్మురేపేసింది. ఆ విజయంతోనే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ కో సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కంగారూలకు చెక్ పెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో కీలక బ్యాటర్స్ అందరూ ఫామ్ లో ఉండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. అయితే గాయపడిన ప్రతీకా రావల్ ప్లేస్ లో వచ్చిన షెఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని అందిస్తే భారీస్కోరు ఖాయం. అలాగే స్మృతి మంధాన , హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ , రిఛా ఘోష్ కూడా రాణిస్తే తిరుగుండదు.
బౌలింగ్ మాత్రం భారత్(India) ను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో మన బౌలర్లు తేలిపోతున్నారు. పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో ఫైనల్లో డెత్ ఓవర్స్ బౌలింగ్ ను మెరుగుపరుచుకుంటే సగం గెలిచినట్టే. లీగ్ స్టేజ్ లో హ్యాట్రిక్ ఓటములకు కారణం పేలవమైన డెత్ బౌలింగే. అలాగే ఫీల్డింగ్ ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఫైనల్లో క్యాచ్ లు వదిలేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. మరోవైపు సౌతాఫ్రికా కూడా మంచి ఫామ్ లోనే ఉంది.
సెమీస్ లో ఆ జట్టు ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఒత్తిడి తట్టుకోవడంపైనే సఫారీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కెప్టెన్ లారా వోల్వార్ట్ సౌతాఫ్రికా జట్టులో కీలకంగా చెప్పొచ్చు. సూపర్ ఫామ్ లో ఉన్న ఆమెను కట్టడి చేస్తేనే సఫారీల జోరుకు బ్రేక్ వేయగలం. అలాగే మరిజెన్నా కాప్ కూడా సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటకీ.. రిజర్వ్ ఉండడంతో ఇబ్బంది రాకపోవచ్చు.



