World Cup: రిటైర్మెంటా… తొక్కా… వరల్డ్ కప్ కు నేను రెడీ
World Cup: ఇటీవల రోహిత్ ను చూసిన చాలా మంది షాక్ అయ్యారు. 4 నెలల్లో కళ్ళు చెదిరే రీతిలో బరువు తగ్గాడు.
World Cup
టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు.. కెప్టెన్సీ పోయింది.. ఇక మిగిలిందల్లా వన్డే జట్టులో ప్లేస్ మాత్రమే… ఆసీస్ గడ్డపై వన్డే సిరీస్ లో ఆడకుంటే అది కూడా గల్లంతే… ఇదీ రోహిత్ శర్మపై ఇటీవల వినిపించిన కామెంట్స్… దీనికి తగ్గట్టే తొలి వన్డేలో హిట్ మ్యాన్ ఫ్లాప్… రెండో వన్డేలో మాత్రం మంచి ఇన్నింగ్స్ ఆడాడు…ఇక మూడో వన్డేలో మాత్రం విశ్వరూపమే చూపించాడు. వన్డే ఫార్మాట్ కు తగ్గట్టు చక్కని సెంచరీతో దుమ్మురేపాడు. సిడ్నీ గ్రౌండ్ లో శతక్కొట్టిన రోహిత్ శర్మ తన బ్యాటింగ్ తోనే రిటైర్మెంట్ వార్తలను తొక్కేశాడు.
నన్నెవడ్రా ఆపేది అన్న తరహాలో వన్డే ప్రపంచకప్(World Cup) లో ఆడేందుకు రెడీ అంటున్నాడు. నిజానికి రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న తర్వాత వన్డే జట్టులో ప్లేస్ పై గ్యారెంటీ లేదని రోహిత్ గ్రహించాడు. ఎందుకంటే పలువురు యువ ఆటగాళ్ళు గట్టిపోటీ ఇస్తున్నారు. ఒకవేళ తాను ఫామ్ కొనసాగించినా ఫిట్ నెస్ కారణాలతో పక్కన పెట్టే అవకాశాలను కొట్టిపారేయలేమని అర్థం చేసుకున్నాడు. అందుకే ఐపీఎల్ తర్వాత దొరికిన విరామంలో పూర్తిగా ఫిట్ నెస్ పైనే ఫోకస్ పెట్టాడు.

నిజానికి భారత జట్టులో మిగిలిన ప్లేయర్స్ తో పోల్చి చూస్తే రోహిత్ శర్మ కాస్త బొద్దుగా ఉంటాడు. ఈ బరువుతో గ్రౌండ్ లో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోనప్పటికీ అప్పుడప్పుడు బయట ట్రోల్స్ మాత్రం ఎదురయ్యాయి. ఇటీవల రోహిత్ ను చూసిన చాలా మంది షాక్ అయ్యారు. 4 నెలల్లో కళ్ళు చెదిరే రీతిలో బరువు తగ్గాడు. అదే ఊపులో బీసీసీఐ నిర్వహించిన బ్రాంకో ఫిట్ నెస్ టెస్టును సైతం అలవోకగా పాసయ్యాడు.
ఇదంతా వచ్చే ప్రపంచకప్(World Cup) ఆడాలన్న లక్ష్యంతోనే రోహిత్ చేయగలిగాడు. ఇక రిటైరయిపోవచ్చు… యువ ఆటగాళ్ళ పోటీని తట్టకోవడం కష్టమే అంటూ పలు విమర్శలు కూడా వచ్చిన వేళ రోహిత్ వారందరికీ తన బ్యాటింగ్ తోనే సమాధానమిచ్చాడు.

సిడ్నీలో రోహిత్ బ్యాటింగ్ చూసిన వారెవరైనా అతని హిట్టింగ్ కెపాసిటీ గురించి ప్రశ్నించలేరు. ముఖ్యంగా జంపా బౌలింగ్ లో లాంగాఫ్, మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్లు హైలెట్ గా నిలిచాయి. అలాగే డీప్ స్కేర్ లెగ్ మీదుగా హిట్ మ్యాన్ బాదిన సిక్సర్లు కూడా అద్ఙుతమే. ఈ ఇన్నింగ్స్ తో వన్డే కెరీర్ లో 33వ సెంచరీ అందుకున్న రోహిత్ పలు రికార్డుల మోత మోగించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 50 సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు ఆసీస్ గడ్డపై సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.
అలాగే వన్డేల్లో ఆసీస్ పై అత్యధిక సెంచరీల రికార్డును సైతం సమం చేశాడు. ఇక ఓపెనర్ గా అన్ని ఫార్మాట్లలో కలిపి 45 సెంచరీల రికార్డును కూడా అందుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో రోహిత్ 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తో 2027 వరల్డ్ కప్ ఆడేందుకు తాను రెడీగా ఉన్నానంటూ సంకేతాలిచ్చాడు.



