World Cup: క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ స్ట్రీమింగ్ కు జియో హాట్ స్టార్ గుడ్ బై
World Cup: జియో హాట్ స్టార్ ద్వారా పలు మెగాటోర్నీలను ఉచితంగా అందించిన ఈ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం భారీ నష్టాలే.
World Cup
ఐసీసీ టీ20 ప్రపంచకప్ (World Cup)కు ముందు క్రికెట్ అభిమానులకు జియో హాట్ స్టార్ భారీ షాకిచ్చింది. భారత్ ఎక్కడ క్రికెట్ మ్యాచ్(World Cup) లు ఆడినా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉచితంగా చూసే అవకాశం కల్పించిన జియో హాట్ స్టార్ వచ్చే వరల్డ్ కప్ స్ట్రీమింగ్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని ఐసీసీకి తెలియజేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
జియో హాట్ స్టార్ ద్వారా పలు మెగాటోర్నీలను ఉచితంగా అందించిన ఈ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం భారీ నష్టాలే. స్ట్రీమింగ్ ద్వారా గత వరల్డ్ కప్ కు భారీ వష్టాలను చవిచూసినట్టు సమాచారం. తక్కువ వ్యూయర్ షిప్, డాలర్ రేట్ పెరగడం, యాడ్ రెవెన్యూ తగ్గడం వంటి కారణాలతో ఏకంగా 7 వేల కోట్ల నష్టం వాటిల్లిన్నట్టు జియో వర్గాలు తెలిపాయి.

భారత మీడియా హక్కులకు సంబంధించి నాలుగేళ్ళకు గానూ జియో హాట్ స్టార్ 2024-27 మధ్య కాలానికి 3 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. మరో రెండేళ్ల పాటు ఈ ఒప్పందం ఉన్నా ఈ లోపే తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఎదురవుతున్న భారీ నష్టాలతో ఇక కొనసాగలేమని ఐసీసీకి తేల్చి చెప్పినట్టు అర్థమవుతోంది. జియో హాట్ స్టార్ నిర్ణయంతో ఐసీసీ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.
ఇప్పటికే 2026-29 మధ్య మూడేళ్ల కాలానికి గానూ భారత మీడియా హక్కులను విక్రయించేందుకు ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. దీని కోసం ఐసీసీ 2.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఇదే క్రమంలో బిడ్లు దాఖలు చేయాలని అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ , సోనీ లివ్ వంటి సంస్థలకు కూడా మెయిల్స్ పంపినట్టు సమాచారం. అయితే బిడ్ల విలువ అధికంగా ఉండడంతో ఏ ఒక్కరూ ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.
మెగాటోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో ఏం చేయాలో ఐసీసీకి పాలుపోవడం లేదు. బిడ్డింగ్ ధరను తగ్గించి మరోసారి ఆ సంస్థలను సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జియో తప్పుకోవడంతో ఇక అభిమానులు ఉచితంగా చూసే పరిస్థితి లేదు. ఇప్పటి వరకూ పలు మెగాటోర్నీలను జియో ఫ్రీగా, తక్కువ ధరలకే ఇచ్చిన సందర్భాలున్నాయి.
అయితే కొత్త ప్రసారకర్తగా నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ , సోనీ లివ్ వంటివి ఈ హక్కులను చేజిక్కించుకుంటే మాత్రం వాటికి సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సిందే. దీంతో అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి.



