Just Nationaljust AnalysisLatest News

Kalbelia:ప్రపంచం మెచ్చిన కళాకారులు..చనిపోతే ఆరడుగుల భూమికి నోచుకోని నిర్భాగ్యులు ..ఇంతకీ వాళ్లెవరు?

Kalbelia:స్థానిక పంచాయతీలు, అధికారులు ఇతర కులాల ఒత్తిళ్లకు తలొగ్గి కల్బెలియాలకు శ్మశాన భూమి కేటాయించడానికి సాహసం చేయలేకపోతున్నారు.

Kalbelia

రాజస్థాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రంగురంగుల దుస్తులు, జానపద సంగీతం, ముఖ్యంగా పాములా మెలికలు తిరుగుతూ అద్భుతమైన నృత్యం చేసే కల్బెలియా(Kalbelia) కళాకారులు. యునెస్కో కూడా వీరి నృత్యాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. విదేశీయులు అయితే వీరి ప్రదర్శనలు చూడటానికి తమ దేశాల నుంచి ప్రత్యేకంగా వస్తారంటేనే వీరి నృత్య నైపుణ్యం గురించి అర్దం చేసుకోవచ్చు .

కానీ, ఆ రంగుల వెనుక, ఆ సంగీత హోరు వెనుక ఒక భయంకరమైన నిశ్శబ్దం దాగి ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. ఆ నిశ్శబ్దం పేరే మరణం. కల్బెలియా తెగ మనుషులు బతికున్నప్పుడు దేశ విదేశాల్లో అపారమైన గౌరవం పొందుతారు కానీ, చనిపోతే మాత్రం వారిని ఖననం చేయడానికి ఆరడుగుల నేల కూడా వారికి దొరకదు. తమ కన్నవారు చనిపోతే గొంతెత్తి ఏడవలేని స్థితి వారిది. శవాన్ని ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి ఇళ్లలోనే పాతిపెట్టుకోవాల్సిన దుస్థితి వారిది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, బార్మేర్, జైసల్మేర్ వంటి ఎడారి జిల్లాల్లో నివసించే కల్బెలియా (Kalbelia)తెగ .. నాథ్-యోగి సంప్రదాయానికి చెందింది. ఒకప్పుడు ఈ తెగలోని వారు సంచార జీవనాన్ని గడుపుతూ, అడవుల్లో పాములను పడుతూ, వాటి విషాన్ని తీసి మందులు తయారు చేస్తూ ఉండేవారు.

బ్రిటీష్ కాలంలో వీరిని నేరస్తుల తెగగా ముద్ర వేశారు. ఆ ముద్ర 1952లో తొలగిపోయినా, సమాజం చూసే చూపు మాత్రం ఇప్పటికీ మారకపోవడమే విచారం. 1972లో వన్యప్రాణుల రక్షణ చట్టం రావడంతో వీరి ప్రధాన వృత్తి అయిన పాములు పట్టడాన్ని ఆపేశారు.

దాంతో జీవనాధారం కోసం వీరు తమలోని కళను నమ్ముకుని నృత్యకారులు(Dancers)గా, గాయకులుగా మారారు. వీరి నృత్యం చూడటానికి రెండు కళ్లు చాలవంటే అది అతిశయోక్తి కాదు. కానీ వీరిలో 60 శాతానికి పైగా ప్రజలు నేటికీ కటిక పేదరికంలోనే మగ్గుతున్నారన్నది అంతే చేదు నిజం.

కల్బెలియా తెగ ఆచారాల ప్రకారం మనిషి చనిపోతే ఖననం చేయాలి. కానీ రాజస్థాన్‌లోని అనేక గ్రామాల్లో వీరికి చిన్న శ్మశాన భూమి లేదు. గ్రామాల్లో ఉండే ఇతర కులాల వారు వీరిని తమ శ్మశానాల్లోకి రానివ్వరు. మేమే ఇక్కడి స్థిర నివాసులం, మీరు సంచార జాతులు.. మీకు ఇక్కడ చోటు లేదంటూ గ్రామం వెలుపలికి గెంటేస్తారు.

పోనీ అటవీ ప్రాంతంలో ఖననం చేద్దామా అంటే, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటారు. చివరకు తమ కుటుంబ సభ్యుడు చనిపోతే, ఆ శవాన్ని ఎక్కడ పాతిపెట్టాలో తెలియక ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం.

Kalbelia
Kalbelia

ఈ తెగ వారు ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన సమస్య ఏంటంటే.. ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు గొంతు ఎత్తి ఏడవనూ కూడా ఏడ్వలేరు. పొరుగువారు వింటే ఎక్కడ గొడవ చేస్తారో, శవాన్ని పాతిపెట్టనివ్వరేమో అన్న భయం వారిని వెంటాడుతూ ఉంటుంది.

పగలు మనుషులది, రాత్రి చిరుతలది అన్నట్లుగా.. పగటి పూట ఊరి వారు అడ్డుకుంటారని, రాత్రి పూట ఎవరికీ తెలియకుండా తమ సొంత ఇంటి ముంగిట లేదా ఖాళీగా ఉన్న మైదానాల్లో రహస్యంగా గొయ్యి తవ్వి శవాన్ని పాతిపెట్టాల్సిన స్థితిలో బతుకుతున్నారు. తల్లిదండ్రులు చనిపోతే కడసారి వీడ్కోలు కూడా చెప్పుకోలేని, మనసారా ఏడవలేని స్థితిలో ఉన్న ఈ కళాకారుల జీవితం గురించి విన్న కొద్దీ మనసు ద్రవించిపోతుంది .

ఇటీవల బార్మేర్ జిల్లాలో దమరామ్ అనే వ్యక్తి మరణించినప్పుడు, అతని కుటుంబం భూమి కోసం కలెక్టరేట్ ముందు ధర్నా చేయాల్సి వచ్చినపుడు ఈ విషయం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. చివరకు ఎక్కడా స్థలం దొరకక అర్ధరాత్రి వేళ జోగీ ధోరా అనే ప్రాంతంలో రహస్యంగా ఖననం చేశారు తప్ప వీరికి న్యాయం మాత్రం జరగలేదు.

దీనిపై గంగా గ్రామానికి చెందిన ముగ్గా రామ్ అనే వ్యక్తి ఆవేదన వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. మేము పగలు అందరినీ నవ్విస్తాం,ఆనందం పంచుతాం. కానీ రాత్రి పూట మా కన్నీళ్లను ఎవరూ చూడరు. మా ఇంట్లో ఎవరైనా చనిపోతే గాలి కూడా వినబడకుండా గుట్టుచప్పుడు కాకుండా మట్టిలో కలపాలని అతను చెప్పిన మాటలు నిజంగా నాగరిక సమాజానికి చెంపపెట్టే అవుతుంది.

ప్రభుత్వం వీరికి గృహనిర్మాణం కోసం, చదువుల కోసం కొన్ని పథకాలు ప్రవేశపెట్టినా..శ్మశానం భూమి కేటాయింపు విషయంలో మాత్రం ఎందుకో నిర్లక్ష్యం వహిస్తోంది. స్థానిక పంచాయతీలు, అధికారులు ఇతర కులాల ఒత్తిళ్లకు తలొగ్గి కల్బెలియాలకు శ్మశాన భూమి కేటాయించడానికి సాహసం చేయలేకపోతున్నారు.

Kalbelia
Kalbelia

2025లో ఈ సమస్యపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో అధికారులు ఒకటి రెండు రోజుల్లో భూమి ఇస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఎన్జీవోలు కొన్ని చోట్ల పోరాడి కొంత భూమిని సాధించినా, లక్షలాది మంది కల్బెలియాల(Kalbelia)కు ఇంకా ఆరడుగుల నేల కలగానే మిగిలిపోయింది.

విశ్వవిఖ్యాత కళాకారులుగా గౌరవించబడే ఈ తెగ ప్రజలకు.. గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కును కల్పించడం మనందరి బాధ్యత. ప్రతి పంచాయతీలోనూ వీరి కోసం ప్రత్యేకంగా భూమిని కేటాయించాలి. వీరికి సామాజికంగా ఎదురవుతున్న వివక్షను అరికట్టడానికి విద్యావంతులు ముందుకు రావాలి.

వీరి సంస్కృతిని కాపాడుకోవడమే కాదు, వీరి ప్రాథమిక హక్కులను కూడా కాపాడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
కళాకారుడు చనిపోతే కళ మాత్రమే మిగలకూడదు, ఆ కళాకారుడికి గౌరవప్రదమైన వీడ్కోలు కూడా లభించాలన్నది ప్రభుత్వం గుర్తించాలి.

Parents:తల్లిదండ్రులకు కళ్లు తెరిపించే పాఠం ఇది..మీ జీవితంలోనూ ఇదే ఫాలో అవ్వండి..

 

Related Articles

Back to top button