Just Science and TechnologyLatest News

AI Wearables:స్మార్ట్‌ఫోన్‌ల కాలం చెల్లిపోనుందా? ఏఐ వేరబుల్స్‌దే రాజ్యం కాబోతుందా?

AI Wearables: ఫోన్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే, మన బట్టలకు ఒక చిన్న బటన్‌లాగో లేదా కళ్లద్దాల రూపంలోనో ఉండే పరికరాలే మన పనులన్నీ చక్కబెట్టే రోజులు వచ్చేసాయి.

AI Wearables

దశాబ్ద కాలంగా అందరి జీవితం మొత్తం స్మార్ట్‌ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. ఏ పని చేయాలన్నా ఫోన్ తీయడం, అన్‌లాక్ చేయడం, యాప్‌లు వెతకడం ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడు సాంకేతిక ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అవును మనం ఫోన్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే, మన బట్టలకు ఒక చిన్న బటన్‌లాగో లేదా కళ్లద్దాల రూపంలోనో ఉండే పరికరాలే మన పనులన్నీ చక్కబెట్టే రోజులు వచ్చేసాయి. వీటినే ఏఐ వేరబుల్స్(AI Wearables) అని పిలుస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ పరికరాలు మన కళ్లు, చెవులు, గొంతుగా మారిపోనున్నాయి. అద్భుతం అనిపించినా ఇది నిజం, త్వరలోనే స్మార్ట్‌ఫోన్‌ల స్థానాన్ని ఈ చిన్న చిన్న గ్యాడ్జెట్‌లు ఆక్రమించబోతున్నాయి.ఈ ఏఐ వేరబుల్స్ ఎలా పనిచేస్తాయో తెలిస్తే ఆశ్చర్యం కలగకుండా ఉండదు.

ఉదాహరణకు, ఇటీవల మార్కెట్లోకి వస్తున్న ఏఐ పిన్ , స్మార్ట్ గ్లాసెస్ మనం ఏం చూస్తున్నామో, ఎక్కడ ఉన్నామో కూడా అర్థం చేసుకుంటాయి. మనం ఏదైనా వస్తువును చూసి ఇది ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే, ఆ పరికరంలోని కెమెరా దాన్ని స్కాన్ చేసి క్షణాల్లో దాని వివరాలు చెబుతుంది.

అంతెందుకు మనకు ఏదైనా భాష తెలియకపోయినా బాధపడాల్సిన పనిలేదు. అవతలి వ్యక్తి మాట్లాడుతున్న విదేశీ భాషను ఈ పరికరాలు విని, వెంటనే మన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసి మన చెవిలో చెబుతాయి. ఇదంతా ఎటువంటి స్క్రీన్ అవసరం లేకుండానే జరిగిపోతుంది. దీనివల్ల మనం రోజంతా ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ గడిపే సమయం తగ్గి, బాహ్య ప్రపంచంతో డైరక్టుగా ఉండే అవకాశం దొరుకుతుంది.

ఆరోగ్య విషయానికొస్తే ఈ పరికరాలు ఒక డాక్టర్‌లా పనిచేస్తాయని కూడా చెప్పొచ్చు. ఇప్పుడున్న స్మార్ట్ వాచ్‌లు కేవలం గుండె కొట్టుకునే స్పీడ్‌ను మాత్రమే చెబుతున్నాయి. కానీ ఫ్యూచర్లో రాబోయే ఏఐ రింగ్స్ , ప్యాచెస్ మన రక్తంలోని చక్కెర స్థాయిలను, ఒత్తిడిని, మన నిద్ర నాణ్యతను కంటెన్యూగా పర్యవేక్షిస్తూ ఉంటాయి.

మన బాడీలో ఏదైనా అనారోగ్యం మొదలయ్యే ముందే ఇవి మనల్ని హెచ్చరిస్తాయట. అంతేకాదు, ఆఫీసు పనులలో కూడా ఇవి అందరికీ పర్సనల్ అసిస్టెంట్ లాగా సాయపడతాయి. మనం చెప్పే విషయాలను నోట్స్ లాగా రాసుకోవడం, ఈమెయిల్స్ పంపడం, మన షెడ్యూల్‌ను గుర్తు చేయడం వంటి పనులన్నీ కేవలం వాయిస్ కమాండ్‌తోనే పూర్తి చేసేస్తాయి.

AI Wearables
AI Wearables

అయితే ఈ టెక్నాలజీతో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కంటెన్యూగా మన చుట్టూ ఉండే పరిసరాలను కెమెరాలు, మైక్రోఫోన్లు రికార్డ్ చేయడం వల్ల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ పరికరాల ధరలు ప్రస్తుతం సామాన్యులకు మాత్రం అందుబాటులో లేవు.

కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇవి తక్కువ ధరకే లభించే అవకాశముంది. స్మార్ట్‌ఫోన్ అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అయితే, ఏఐ వేరబుల్స్ అనేవి మనిషికి , టెక్నాలజీకి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేసే మరో గొప్ప ముందడుగు. అలా మన ఫ్యూచర్లో మనం ఫోన్ల కోసం వెతకడం మానేసి మన చేతి వేలికో, కోటుకో ఉండే ఏఐ వేరబుల్స్‌(AI Wearables)తోనే ప్రపంచాన్ని శాసించే రోజులను చూడబోతున్నాం.

Arava Sridhar:ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ నిందితుడా? అమాయకుడా? వారం రోజుల్లో నిజం తేలుతుందా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button