BRS : బీఆర్ఎస్ పుంజుకుంటోందా? ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెనుక ఏం జరిగింది?
BRS : సాధారణంగా "చెడులోనూ మంచి" జరుగుతుందని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు బీఆర్ఎస్( BRS )పార్టీకి అదే నిజమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

BRS : సాధారణంగా “చెడులోనూ మంచి” జరుగుతుందని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు బీఆర్ఎస్( BRS )పార్టీకి అదే నిజమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత(Kavitha) చుట్టూ అలుముకున్న పరిణామాలు, ఒకప్పుడు భిన్న మార్గాల్లో సాగినట్లు కనిపించిన BRS ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావును ఒకే వేదికపైకి తీసుకువచ్చాయని ప్రచారం జరుగుతోంది. వారి మధ్య గతంలో నెలకొన్న విభేదాలు, ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలకు ఈ పరిణామాలు తెరదించాయని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి.
BRS
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు(KTR, Harish Rao) మధ్య ప్రస్తుతం కనిపిస్తున్న సాన్నిహిత్యం చూసి కొందరు ఆశ్చర్య పోతున్నారట. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ ఇద్దరు నాయకులు మరింత దగ్గరయ్యారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కవిత రాసిన లేఖ లీక్ అయిన తర్వాత ఆమె కుటుంబంతో పాటు పార్టీకి కూడా దూరమయ్యారు. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమె వ్యవహారశైలి పార్టీకి ఇబ్బందికరంగా మారడమే కాకుండా, ఈ అంశం కాంగ్రెస్, బీజేపీలకు ఒక రాజకీయ ఆయుధంగా మారింది. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయాన్ని కవితతో ముడిపెట్టి గులాబీ పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే..ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న BRSకు, ఈ క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో కవిత వ్యవహారం కేసీఆర్ కుటుంబానికి, పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. రోజురోజుకు డ్యామేజ్ అవుతున్న పార్టీకి వెంటనే గాడిలో పెట్టకపోతే ఇక పార్టీ పని అంతే అని బాహాటంగానే చర్చలు మొదలయ్యాయి. దీంతో వెంటనే అలెర్ట్ అయిన కేటీఆర్, హరీష్ రావు.. కుటుంబంలో, పార్టీలో ఎలాంటి అపోహలు, అంతరాలు లేకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉమ్మడి లక్ష్యంతోనే పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇద్దరూ కలిసి చర్చిస్తున్నారు.
గతంలో ఎవరి కార్యక్రమాల్లో వారు నిమగ్నమై కనిపించిన కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు అనూహ్యమైన సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ నిర్వహించే అత్యవసర సమావేశాల్లో తప్ప, వీరు ఒకే వేదికపై పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా పార్టీలో చేరికలు అయినా, ప్రభుత్వ విధానాలపై స్పందించాలన్నా, ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, ఇద్దరూ కలిసి చర్చించుకుని ఒకే నిర్ణయానికి వస్తున్నారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. కేటీఆర్ తరచుగా హరీష్ రావుతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. అంతేకాకుండా, కేసీఆర్ కూడా ఈ ఇద్దరు కీలక నాయకులతో తరచుగా సమావేశమవుతూ, వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది పార్టీలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని అంటున్నారు.
బలహీనపడుతుందనుకున్న బీఆర్ఎస్ పార్టీ బలం..కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఏర్పడిన బంధంతో మరింత బలపడుతోంది.ఇది BRS పార్టీ శ్రేణులలో, నాయకులలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. కవిత వ్యవహారం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ, కేటీఆర్, హరీష్ ఏకతాటిపై నడవడం పార్టీకి ఒక సానుకూల పరిణామంగా మారింది. ఈ ఐక్యత పార్టీని భవిష్యత్తులో మరింత బలోపేతం చేస్తుందని, రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం BRS రాజకీయాలలో కొత్త శక్తిని, నూతన దిశను సూచిస్తోంది.