Rythu Bharosa: రైతు భరోసాకు శాటిలైట్ నిఘా..  కోత పడేది ఎవరికి?  రైతులకు లాభమేనా?

Rythu Bharosa: కరాకు 12 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రెండు విడతల్లో ఇచ్చే ఈ సాయం, ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే అందనుంది.

Rythu Bharosa

తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. దీంతో రైతు భరోసా (Rythu Bharosa)పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయం విషయంలో ఈసారి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. గతంలో సాగులో లేని భూములకు, కొండలు, గుట్టలకు కూడా రైతు బంధు నిధులు అందేవని, కానీ ఇప్పుడు అలాంటి వాటికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేవలం సాగు చేస్తున్న భూములకే ఈసారి రైతు భరోసా(Rythu Bharosa) నిధులు అందుతాయి. ఇందుకోసం ప్రభుత్వం అధునాతన శాటిలైట్ మ్యాపింగ్ (ఉపగ్రహ చిత్రాలు) సాంకేతికతను వాడుతోంది. యాసంగిలో ఏ భూముల్లో పంటలు సాగవుతున్నాయో ఉపగ్రహాల ద్వారా గుర్తించి, ఆ నివేదిక ఆధారంగానే అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, రబీకి సంబంధించిన రైతు భరోసా(Rythu Bharosa) నిధులను జనవరి లేదా ఫిబ్రవరిలో జమ చేస్తామని తెలిపారు. అయితే శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ నిధుల విడుదల ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన సమీక్షలో, అనర్హుల చేతుల్లోకి నిధులు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

దీనివల్ల సాగు చేయని భూ యజమానులకు ఈసారి కోత తప్పదు. ఎకరాకు 12 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రెండు విడతల్లో ఇచ్చే ఈ సాయం, ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే అందనుంది. అయితే తెలంగాణలో రైతు భరోసా పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ‘శాటిలైట్ మ్యాపింగ్’ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Rythu Bharosa

అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? అనే విషయాలను గత ప్రభుత్వ హయాంలో ‘రైతు బంధు’ కింద ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయలు ఇచ్చేవారు. అయితే, ఆ సమయంలో సాగులో లేని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు, కొండలు, చివరికి రోడ్లకు కూడా ఈ నిధులు వెళ్లాయని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.

ఇలా ప్రతి ఏటా వందల కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. అందుకే, కేవలం ‘నిజమైన రైతు’కు మాత్రమే ఈ సాయం అందాలి అనే లక్ష్యంతో ఈ కొత్త రూల్ తెచ్చారు.

ఈ టెక్నాలజీ వల్ల ప్రభుత్వానికి ప్రధానంగా రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ ఖజానాపై పడే అనవసరపు భారం తగ్గుతుంది. సాగు చేయని భూములకు కోత పెట్టడం వల్ల మిగిలే నిధులను నిజమైన రైతులకు మరింతగా ఉపయోగించవచ్చు. రెండోది, పారదర్శకత. గతంలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేయడంలో రాజకీయ ఒత్తిళ్లు లేదా అవినీతి జరిగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అంతరిక్షం నుంచి ఉపగ్రహాల ద్వారా ఫోటోలు తీయడం వల్ల ఏ సర్వే నంబర్ లో పంట ఉంది, ఎక్కడ ఖాళీగా ఉంది అనేది కచ్చితంగా తెలిసిపోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 10 లక్షల ఎకరాల వరకు కోత పడే అవకాశం ఉందని అంచనా.

నిజానికి, ఈ నిర్ణయంపై రైతుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కేవలం పంట వేసిన భూములకే సాయం అంటే(Rythu Bharosa), నీటి సౌకర్యం లేక లేదా వర్షాలు పడక పంట వేయని రైతులు నష్టపోతారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ‘యాసంగి’ (రబీ) సీజన్ లో సాగు నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి, సాగు విస్తీర్ణం తగ్గుతుంది. దీనివల్ల వానాకాలం సాయం అందుకున్న చాలా మంది రైతులు యాసంగిలో సాయం కోల్పోయే ప్రమాదం ఉంది. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వంపై రాజకీయంగా కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కానీ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చూస్తే సాగులో ఉన్నది కోటి 30 లక్షల ఎకరాల లోపే ఉండవచ్చని అంచనా. అంటే మిగిలిన దాదాపు 20 లక్షల ఎకరాలకు అనవసరంగా నిధులు వెళ్తున్నాయి. అందుకే “సాగు చేస్తేనే సాయం” అనే నినాదాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇది ఒక రకంగా సాగును ప్రోత్సహించడమే కాకుండా, పన్ను చెల్లింపుదారుల సొమ్మును సద్వినియోగం చేసే ప్రయత్నం అని ప్రభుత్వం చెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version