Just TelanganaJust PoliticalLatest News

Handshake:షేక్ హ్యాండ్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు.. ప్రత్యర్ధుల మధ్య కరచాలనం ఇదే తొలిసారా?

Handshake: మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రావడం, ఆయన వద్దకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ సంస్కారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Handshake

తెలంగాణ శాసనసభ వేదికగా సోమవారం చోటుచేసుకున్న ఒక షేక్ హ్యాండ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రావడం, ఆయన వద్దకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి షేక్ హ్యాండ్ (handshake)ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ సంస్కారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, ఈ షేక్ హ్యాండ్ (handshake)కేవలం మర్యాదపూర్వకమైనదా? లేక దీని వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయా? అన్న సందేహాలకు బలం చేకూరుస్తూ అటు కేటీఆర్, ఇటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

ఈ షేక్ హ్యాండ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ పట్ల ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని, రేవంత్ రెడ్డికి ఆ మాత్రం సంస్కారం ఉన్నందుకు సంతోషమని చెబుతూనే, విమర్శల అస్త్రాలను సంధించారు. సభలో చూపించే ఈ సంస్కారం బయట రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని చురకలు అంటించారు.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన మీసాలు, గడ్డాలు వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడు.. గడ్డం పెంచడం చాలా ఈజీ అని కానీ పాలన చేయడమే కష్టమంటూ రేవంత్‌ను ఎద్దేవా చేశారు. తన చదువు గురించి రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. తాను ఆంధ్రాలో చదివితే తప్పు పడుతున్న రేవంత్ రెడ్డి,ఆయన అల్లుడిని మాత్రం ఆంధ్రా నుంచే తెచ్చుకున్నారు కదా అని కౌంటర్ ఇచ్చారు.

Handshake
Handshake

మరోవైపు, కేసీఆర్‌కు ఎందుకు షేక్ హ్యాండ్ ఇచ్చానన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌లో బయటపెట్టారు. “మేము ప్రతి సభ్యుడిని గౌరవిస్తామని.. కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా నేను వెళ్లి కలిశానని చెప్పారు. ఇప్పుడు సభకు వచ్చారు కాబట్టి మర్యాదపూర్వకంగా పలకరించానని.. మా మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణను బయటకు చెప్పలేమని స్పష్టం చేశారు.

కేసీఆర్ సంతకం పెట్టి వెంటనే వెళ్లిపోవడంపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని వ్యాఖ్యానించారు. అలాగే పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీలో కూడా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం సెంట్రల్ హాల్ వంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఒకవైపు కేసీఆర్‌ను పలకరించినా కూడా రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డి తగ్గేదే లేదన్న సంకేతాలను ఇచ్చారు. మంత్రులతో విడిగా సమావేశమై.. నీటి వాటాల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందని, వారి విమర్శలకు పక్కా ఆధారాలతో కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు సూచించారు.

రేవంత్ రెడ్డి , కేసీఆర్ కరచాలనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే , తెలుగు రాష్ట్రాల పార్లమెంటరీ చరిత్రలో ఇలాంటి ‘రాజకీయ మర్యాదలు’ (Political Courtesy) కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇద్దరు దిగ్గజ నేతలు కలిసినప్పుడు ఇలాంటి ఆసక్తికర దృశ్యాలు చాలానే చోటుచేసుకున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దివంగత వైఎస్సార్,చంద్రబాబు నాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వైరం ఉండేది. కానీ సభలో అడుగుపెట్టినప్పుడు లేదా లాబీల్లో కలిసినప్పుడు వారు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకునేవారు. కొన్ని సందర్భాల్లో వైఎస్సార్‌ నేరుగా చంద్రబాబు సీటు దగ్గరకు వెళ్లి మరీ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో, అప్పటి ప్రతిపక్ష నేతలతో కేసీఆర్ ఎంతో మర్యాదగా ఉండేవారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చినప్పుడు కేసీఆర్ లేచి నిలబడి గౌరవించడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనం. విభజన రాజకీయాల వేడి ఉన్నా.. సభ లోపల ఆ మర్యాదను వారు కాపాడారు.

గతంలో కేసీఆర్ బాత్‌రూంలో జారిపడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి వెళ్లి పలకరించారు. అంటే.. రాజకీయ పోరాటం ఎన్ని మెట్లు ఎక్కినా, వ్యక్తిగత యోగక్షేమాల దగ్గరకు వచ్చేసరికి మన లీడర్స్ ఒక రకమైన ‘హుందాతనాన్ని’ పాటిస్తూనే ఉన్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి – కేసీఆర్ ఇచ్చుకున్న ఈ షేక్ హ్యాండ్ కేవలం ఒక కరచాలనం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యంలో చర్చలు ఎంత వేడిగా ఉన్నా, మనుషుల మధ్య సంబంధాలు మాత్రం సజీవంగా ఉండాలనే దానికి ఒక నిదర్శనం. గతంలో అడపాదడపా జరిగిన ఇటువంటి సంఘటనలే నేటి ఈ సన్నివేశానికి ఒక చారిత్రక విలువను చేకూరుస్తున్నాయి.

మొత్తానికి ఈ ఒక్క షేక్ హ్యాండ్ చుట్టూనే తెలంగాణ రాజకీయం ఇప్పుడు తిరుగుతోంది. కేటీఆర్, కేసీఆర్ కామెంట్లతో ఆగుతుందో లేక కరచాలనం handshake)టాపిక్ కంటెన్యూ అవుతుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button