Tollywood
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ (Tollywood)నిర్మాతలకు బిగ్ షాకిచ్చారు. టికెట్ల రేట్ల పెంపుపై మెలిక పెట్టారు. ఇకపై సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో సినీ కార్మికులకు 20 శాతం వాటా ఇస్తేనే టికెట్ల పెంపుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఈ మేరకు త్వరలోనే నిబంధనలు సవరించనున్నట్టు ప్రకటించారు. యూసుఫ్ గూడలో ఏర్పాటు చేసిన సినీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సినీ కార్మికుల శ్రమ కారణంగానే తెలుగు పరిశ్రమ ఆస్కార్ స్థాయికి వెళ్ళిందంటూ ప్రశంసించారు.
దీనికి కారణం కార్మికుల శ్రమ అని , దీనిలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికులకు సీఎం రేవంత్ పలు వరాలు ప్రకటింటారు. వారి అభివృద్ధి కోసం తాను రూ.10 కోట్ల రూపాయల ఫండ్ ఇస్తానని తెలిపారు. దీని కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 9న సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్టు వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీ(Tollywood)కి ప్రత్యేక చాప్టర్ ఉంటుందన్నారు. అందరూ అండగా నిలబడితే హాలీవుడ్ ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు. హాలీవుడ్ షూటింగ్స్ హైదరాబాద్ లో జరగాలని , ఆ స్థాయికి మన పరిశ్రమ వెళుతుందన్నారు. ఇదిలా ఉంటే కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూస్తే… కార్మికుల పిల్లలను దానిలో 12వ తరగతి వరకూ చదివిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేశారు. నంది అవార్డులను 1964లో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించదని చెప్పారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ కు రావడంలో మర్రి చెన్నారెడ్డి చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోరని చెప్పారు.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఎంతో మందిని సంప్రదించి పరిశ్రమను తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.
గత ప్రభుత్వం నంది అవార్డులను పట్టించుకోకుంటే… ఇప్పుడు గద్దర్ పేరిట తాము అవార్డులనుఇస్తూ చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆనాడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం మణికొండలో తన 10 ఎకరాల సొంత స్థలాన్ని ఇచ్చి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని రేవంత్ చెప్పారు. రాత్రి పగలు తేడా లేకుండా సినీపరిశ్రమలో కార్మికులు అందరూ పనిచేస్తున్నారని కితాబిచ్చారు.
వారి కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకే దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించానని సీఎం తెలిపారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఈ కీలక బాధ్యతలు ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పడూ సినీ కార్మికులకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.
