Latest News

AP :ఏపీలో జిల్లాల పేర్లు మార్పు నిర్ణయం మంచిదేనా?

AP : ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన మరోసారి చర్చకు దారి తీస్తోంది.

AP: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన మరోసారి చర్చకు దారి తీస్తోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న పెద్దఎత్తున మార్పులు అప్పట్లో ప్రజల్లో కొంత అయోమయాన్ని, అభ్యంతరాలను రేకెత్తించాయి. పేర్లు కొత్తగా ఉండొచ్చు… కానీ ప్రజలకు నిజంగా అవసరం ఉన్నది జిల్లాల పేరు మార్పులేనా? జిల్లాల పేరు మార్చితే అభివృద్ధి దానంతట అదే జరిగిపోతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

AP

ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ఎలా ఉన్నాయంటే.. ముందస్తు నిర్ణయాలు కాకుండా, ప్రజల అభిప్రాయాలను కేంద్రంగా పెట్టిన చర్చల పునాదులపై ఆధారపడినవి కావడం, దీనికి ప్రత్యేకతనిస్తోంది. ప్రజల నుంచి వచ్చిన 80 వేలకుపైగా విజ్ఞప్తులు, ఫిర్యాదుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ, ఏడుగురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇది కేవలం పరిపాలన మార్పు కోసం కాకుండా, ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా చూస్తున్నారు విశ్లేషకులు.

నిజానికి కమిటీ ముందు ఉన్న పని మాత్రం తేలిక కాదు. కొత్తగా ఆలోచించాల్సినవి చాలా ఉన్నాయి .ప్రాంతాల చరిత్ర, స్థానిక సంస్కృతి, భాష, ప్రజల అనుబంధం, ప్రాంతీయ అభివృద్ధి అసమతుల్యత, లాజిస్టిక్ సౌలభ్యం, జనాభా గణాంకాలు… ఇవన్నీ గణించి, ప్రతి మార్పు వెనుక ఓ ఆలోచన ఉండాలి. “పేరు మార్చితే పరిపాలన పరిష్కారం కానిది పరిష్కారమవుతుంది” అన్న అంచనాలపై కాకుండా, వాస్తవ ప్రయోజనాల దృష్టితో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ కమిటీ సూచించే మార్గాలు ఏవైతే ఉండబోతున్నాయో, వాటిని ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తుందో అన్నదే ఇప్పుడు కీలకం. ఎందుకంటే ప్రజలలో ఇప్పుడు మరోసారి మార్చినా, ఇదే చివరి మార్పు కావాలని.. మళ్లీ మార్పులు, మళ్లీ అయోమయం వద్దని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కొన్ని జిల్లాల మార్పులపై బాహాటంగానే విమర్శలు వినిపించాయి.

అలా అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన కూడా హండ్రెడ్ పర్సంట్ సంతృప్తిగా లేరు. జిల్లాల పేరు మార్చడం కాదని.. అభివ‌ృద్ధిపైన ఫోకస్ చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పనులు చేస్తున్నా.. తాము ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదన్నది ఏపీ వాసులు వాదన. ఏపీలో చాలా జిల్లాలలో అద్వాన్నంగా ఉన్న రోడ్ల గురించి దృష్టి సారించాలని కోరుతున్నారు.

మరోవైపు ఈ పునర్విచారణ ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అంటున్నారు. గతంలో తొందరగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏర్పడ్డ లోపాలను సరిచేసే ఛాన్స్ ఇదని చెబుతున్నారు. అయితే ఇది కేవలం పేర్ల మార్పుకే పరిమితం కాకుండా, పరిపాలనలో ఆత్మీయత, అందుబాటు, సమర్థత పెరిగేలా మారాలి. లేకపోతే, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మళ్లీ కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా చెప్పాలంటే పేర్లు కొత్తగా ఉండొచ్చు, కానీ ప్రజల జీవితాల్లో మేలు కలిగించే మార్పులే సార్థకం. ఇప్పుడు ప్రారంభమైన ఈ ప్రక్రియ… గతానికి గుణపాఠం, భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారాలని..దీనిపై ప్రజల ఆకాంక్ష నెరవేరేలా చేయడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button