Ice Bath
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే చాలు.. ఐస్ క్యూబ్స్‌తో నిండిన టబ్బుల్లో మునిగి తేలుతున్నవాళ్లు, ఐస్ లాంటి కూల్ వాటర్‌లో స్నానాలు చేస్తూ కనిపిస్తున్న వాళ్లు విపరీతంగా పెరిగిపోయారు.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ఈ కోల్డ్ థెరపీ ఒక అద్భుతమైన మార్గమంటూ ఫిట్‌నెస్ లవర్స్, సెలబ్రిటీలు దీనిని తెగ ప్రమోట్ చేస్తున్నారు. అయితే, ఈ ఐస్ బాత్‌లు, కోల్డ్ షవర్లు నిజంగానే ఆరోగ్యానికి అంత మంచివా? దీని వెనుకున్న అసలు నిజాలు ఏంటనే విషయాలపై ఇప్పుడు చర్చ నడుస్తుంది.
నిజానికి ఐస్ బాత్(Ice Bath)లు, చల్లటి నీటి స్నానాలు చేయడం వల్ల బాడీకి కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయనేది నిజం. ఈ స్నానం చేయడం వల్ల బాడీలో రక్తప్రసరణ ఒక్కసారిగా వేగవంతమై, మెలకువగా , రోజంతా ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మానసికంగా కూడా ఒక విధమైన తాజాదనం లభిస్తుంది.
ముఖ్యంగా అథ్లెట్లు, జిమ్‌లో విపరీతంగా వర్కౌట్లు చేసేవాళ్లు తమ ఫిజికల్ యాక్టివిటీ తర్వాత ఐస్ బాత్(Ice Bath)లలో కూర్చోవడానికి ఇష్టపడతారు. కండరాల నొప్పులు, వాపులను తగ్గించడంలో , అలసిపోయిన బాడీని త్వరగా రికవరీ చేయడంలో కూల్ టెంపరేచర్లు అద్భుతంగా పనిచేస్తాయి. దీని వెనుక శాస్త్రీయ ఆధారాలు ఉన్నా సరే, ప్రయోజనాలున్నాయి కదా అని ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ పనిగట్టుకుని ఉదయాన్నే ఐస్ వాటర్‌లోకి దూకాల్సిన అవసరం లేదు.
ఈ కోల్డ్ థెరపీ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది దీనివల్ల కలిగే ప్రతికూలతలను పూర్తిగా మర్చిపోతుంటారు. చల్లటి నీటిని బాడీపై ఒక్కసారిగా పోసుకోవడమనేది బాడీకి ఒక రకమైన అదనపు స్ట్రెస్ అని గ్రహించాలి.
ఈ రోజుల్లో చాలామంది ఇప్పటికే ఉద్యోగాల్లో బాగా మెంటల్ టెన్షన్, శారీరక అలసట, నిద్రలేమి ,పూర్తిగా నీరసించిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
ఇలాంటివారికి శరీరం అప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, దానికి తోడుగా ఈ కోల్డ్ థెరపీ రూపంలో మరో కొత్త స్ట్రెస్‌కు గురిచేయడం అస్సలు మంచిది కాదు. వెల్నెస్ అంటే ఏదో కష్టతరమైన పనులు చేయడం కాదు. మన బాడీకి ఏ సమయంలో నిజంగా ఏది అవసరమో తెలుసుకుని ఫాలో అవడమే అసలైన ఆరోగ్యం.
ఇలాంటివి పాటిస్తేనే పూర్తి ఆరోగ్యం వస్తుందనే భ్రమను సోషల్ మీడియా కల్పిస్తోంది. కానీ, నిజానికి నిత్య జీవితంలో మనం పాటించే కొన్ని ప్రాథమిక అలవాట్లే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
సరైన సమయానికి నిద్రపోవడం, పోషకాలున్న ఆహారం తీసుకోవడం, బాడీకి సరిపడా నీళ్లు తాగడం, రోజూ కాసేపు ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , కాసేపు ఎండలో గడపడం వంటి పనులే మన ఆరోగ్యానికి పునాదులు అని తెలుసుకోవాలి.
ఒకరు ఐస్ బాత్(Ice Bath) చేసినప్పుడు దాంతో వాళ్లకు ఎనర్జీ వచ్చి, రికవరీ బాగా జరిగితే వారు దానిని హాయిగా కంటిన్యూ చేయొచ్చు. కానీ, అందరికీ అది ఒకేలా పనిచేస్తుందని చెప్పలేం. అలాగే సంపూర్ణ ఆరోగ్యానికి ఇది కచ్చితంగా అవసరం కూడా కాదు.
ఆరోగ్యం అనేది ఏదొక రోజు చేసే విపరీతమైన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ల వల్ల రాదు. మనం ప్రతిరోజూ రెగ్యులర్‌గా పాటించే చిన్న చిన్న మంచి అలవాట్ల వల్లే సాధ్యమవుతుంది. చూడటానికి చాలా సాధారణంగా, పెద్దగా క్రేజ్ లేనట్లు కనిపించే మన పాత అలవాట్లే మన బాడీని ఎక్కువకాలం పాటు స్ట్రాంగ్‌గా ఉంచుతాయి.
కాబట్టి, ఎలాంటి కొత్త ట్రెండ్‌ను అయినా గుడ్డిగా ఫాలో అయిపోకుండా, మీ శరీర తత్వానికి ఏది సెట్ అవుతుందో చూసుకోవడం ఇంపార్టెంట్. ఏవైనా అనారోగ్య సమస్యలున్నవారు ఇలాంటి థెరపీలు ట్రై చేసే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం చాలా అవసరం.
Ebola : కరోనా కష్టాలను గుర్తుంచుకుని ముందే అప్రమత్తం.. ఎబోలాపై పాత మందులు పనిచేయవా?
