Just LifestyleLatest News

Forgiving:అతిగా క్షమిస్తున్నారా? అయితే అది మీ ఉనికికే ప్రమాదంగా మారొచ్చు

Forgiving: నిత్యం క్షమిస్తూ పోవడం వల్ల మెల్లమెల్లగా అలా మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Forgiving

ప్రేమ, పెళ్లి వంటి బంధాలు పచ్చగా పదికాలాలు నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే అంతకంటే ఎక్కువగా ఎదుటివారి చిన్న చిన్న తప్పులను క్షమించడం కూడా అంతే అవసరం. క్షమించడం లేని చోట కేవలం కోపతాపాలు, మనస్పర్థలే మిగిలిపోతుంటాయి.

అయితే, ఈ క్షమించే (Forgiving)గుణానికి కూడా ఒక హద్దు ఉండాలని మనస్తత్వ నిపుణులు వివరిస్తున్నారు. ఎదుటివారిపై ఉన్న మితిమీరిన ప్రేమతో వారు పదే పదే తప్పులు చేసినా కూడా.. చూసీచూడనట్లు వదిలేస్తే, చివరికి ఆ బంధంలో మీ గౌరవం కనుమరుగైపోతుంది. నిత్యం క్షమిస్తూ పోవడం వల్ల మెల్లమెల్లగా అలా మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎదుటవారిపై ఎల్లలు లేని ప్రేమను చూపించడం గొప్ప విషయమే. అయితే అది అవతలి వారికి మిమ్మల్ని అలుసుగా తీసుకునే అవకాశాన్ని ఇస్తుందన్న సున్నితమైన విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. కుటుంబసభ్యుల మీదో, లైఫ్ పార్టనర్స్ మీదో ఎవరి మీదైనా చెప్పలేనంత ప్రేమ ఉండటం మంచిదే, కానీ, ఆ ప్రేమను అవతలి వాళ్లు మీ బలహీనతగా చూసే అవకాశం ఉంది.

కలకాలం ఒక బంధం కలిసి ఉండాలంటే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వారు మిమ్మల్ని కించపరిచే సందర్భాల్లో కూడా, వారిపై ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల మీరు వారిని క్షమించి(Forgiving) వదిలేస్తే , అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. అందుకే మీ సహనానికి కూడా ఎల్లలు ఉన్నాయని, మీ గౌరవానికి భంగం కలిగితే మాత్రం సహించబోనని అవతలి వారితో నిస్సంకోచంగా చెప్పగలగాలి.

ముఖ్యంగా మీ విషయంలో మృగంలా ప్రవర్తించే వారిని ఎక్కువసార్లు క్షమించడం అస్సలు మంచిది కాదు. మీ పట్ల తరచూ అనుచితంగా ప్రవర్తించినా, మీపై శారీరకంగా దాడి చేసినా అస్సలు క్షమించొద్దు. అటువంటి వారు మీ మంచితనం వల్ల మారరు. పైగా, రానురాను మీ ప్రేమను ఒక అసమర్థతగా భావించే అవకాశం ఉంటుంది.

Forgiving
Forgiving

అంతేకాకుండా భాగస్వామి ప్రవర్తన మారుతున్నప్పుడు కూడా వారిని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యమైన సందర్భాలలో మిమ్మల్ని మర్చిపోతున్నా, మీకు మొదట్లో ఇచ్చిన ప్రాధాన్యతను మెల్లమెల్లగా తగ్గిస్తున్నా, ఆ నిర్లక్ష్యాన్ని క్షమించడం కంటే వారి లైఫ్‌లో మీ స్థానం గురించి ప్రశ్నించడమే ముఖ్యం అని తెలుసుకోవాలి.

మానసిక ఒత్తిడిని నిత్యం భరిస్తూ బంధాన్ని కాపాడుకోవాలనుకోవడం వల్ల మెల్లగా మీ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ తప్పులు చేసే పార్టనర్స్‌ను క్షమిస్తే ఆ బంధం అన్యోన్యంగా సాగుతుందన్నది ఎంత నిజమో.. తరచూ ఒకరు తప్పులు చేస్తూ మరొకరు క్షమిస్తూ ఉంటే ఆ జంట మనోవ్యథకు గురవుతుందనేది అంతే నిజం. అందుకే క్షమించండి..కానీ అది మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ను తాకట్టు పెట్టేలా ఉండకూడదన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి.

Punjab Kings : వాంఖడేలో పంజాబ్ షో…చిత్తుగా ఓడిన ముంబై

Related Articles

Back to top button