Children :ఐదేళ్ల లోపు పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్ ఉండొచ్చా? తమ పిల్లలను పేరెంట్స్ చెడగొడుతున్నారా?
Children : పిల్లలు భోజనం చేయాలన్నా , వాళ్లు ఏడవకుండా ఉండాలన్నా వారి చేతిలో స్మార్ట్ఫోన్ పెట్టడం, టీవీలు చూపించడం పేరెంట్స్ అలవాటు చేసుకున్నారు .
Children
ఒక 20,30 ఏళ్ల క్రితం వరకూ చిన్నపిల్లల (Children)కు అన్నం తినిపించాలంటే చంకన ఎత్తుకుని ఆరుబయటకు తీసుకువెళ్లి అవీ ఇవీ చూపిస్తూ తినిపించేవారు. చందమామ రావే జాబిల్లి రావే అంటూ ప్రకృతిని, సైన్సును పరిచయం చేస్తూ ఆహ్లాదంగా కడుపు నిండా అన్నం పెట్టేవారు. ఆడుకోవాలన్నా ఆరు బయటకు పంపి దగ్గరుండి ఆడించేవారు.
అయితే కాలం మారింది. టెక్నాలజీ అప్ డేట్ అయింది. డిజిటల్ యుగంలో పనులు చకచకా చేయడానికి అలవాటు పడిపోయాం. ఇదంతా ఓకే కానీ 5-10 లోపు పిల్లలను టెక్నాలజీ మాయలో దింపేయడమే అసలు సమస్యగా మారిపోతుంది. పిల్లలు భోజనం చేయాలన్నా , వాళ్లు ఏడవకుండా ఉండాలన్నా వారి చేతిలో స్మార్ట్ఫోన్ పెట్టడం, టీవీలు చూపించడం అలవాటు చేసుకున్నారు పేరెంట్స్.
అయితే ఇది ఆ క్షణానికి ఆ సమస్యను పరిష్కరించినట్లు అనిపించినా, రానురాను పసిపిల్లల మెదడు ఎదుగుదలపై భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల లోపు వయసు అనేది మెదడు కణాల అభివృద్ధికి చాలా కీలకమైన సమయం అని చెబుతున్నారు. ఈ సమయంలో పిల్లలు తమ చుట్టూ ఉన్న మనుషుల మాటలను విని, వారి ముఖ కవళికలను గమనించి మాతృ భాషను నేర్చుకోవాలి.
కానీ ఫోన్ స్క్రీన్కు, టీవీలకు పరిమితమైన పిల్లలు(Children) కేవలం ఆ బొమ్మలు, శబ్దాలకే అలవాటు పడిపోతారు. దీనివల్ల వారిలో మాటలు రావడం ఆలస్యం అవుతాయి. అంటే వారిలో స్పీచ్ డిలే అనే సమస్య తలెత్తుతోంది. వారు తమ భావాలను మాటల ద్వారా వ్యక్తం చేయలేకపోవడంతో.. మొండిగా ప్రవర్తించడం మొదలుపెడతారు.

అంతేకాదు స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల చిన్నపిల్లల్లో ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. వారు ఫోన్ లో, టీవీలలో చూసే వేగవంతమైన రంగులు, శబ్దాల వల్ల వారి మెదడులో డోపమైన్ అనే కెమికల్ ఎక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల వారు ఆటలపైన, చదువుపైన ఆసక్తి చూపించలేరు.దీంతో పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వడమంటే వారికి ఒక వ్యసనాన్ని తల్లిదండ్రులే స్వయంగా అలవాటు చేసినట్లు అని డాక్టర్లు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పనిని చేసుకోవడానికి మొబైల్ ఫోన్ వాడకుండా, పిల్లలతో కలిసి సమయం గడపడం, వారికి కథలు చెప్పడం, ప్రకృతి మధ్య గడపడం వంటివి చేయాలి. పిల్లల మేధస్సు మొగ్గలోనే మాడిపోకుండా ఉండాలంటే మాత్రం వారిని స్మార్ట్ఫోన్ అనే మాయా ప్రపంచం నుంచి దూరంగా ఉంచడం చాలా చాలా అవసరం అని ప్రతీ పేరెంట్ కూడా చెప్పాలి.





