Burps : భోజనం తర్వాత తేన్పులు రావడం సహజమా? లేక అనారోగ్యానికి సంకేతమా?
Burps : చాలామంది భోజనం చేసిన తర్వాత తేన్పులు వస్తే అబ్బా కడుపు నిండిందని అనుకుని తృప్తిగా ఫీలవుతుంటారు.
Burps
చాలామంది భోజనం చేసిన తర్వాత తేన్పులు వస్తే అబ్బా కడుపు నిండిందని అనుకుని తృప్తిగా ఫీలవుతుంటారు. కానీ, కొంతమందిలో మాత్రం ఈ తేన్పులు(Burps) ఆగకుండా వస్తూనే ఉంటాయి. అయితే నలుగురిలో ఉన్నప్పుడు ఇలా రావడం వల్ల వాళ్లు ఇబ్బంది పడటమే కాదు..లోపల ఏదో అనారోగ్యం ఉందేమోనని ఆందోళన పడుతూ ఉంటారు.
అసలు ఈ తేన్పులు(Burps) ఎందుకు వస్తాయనే దానికి డాక్టర్లు కొన్ని కారణాలు చెబుతున్నారు. చాలామంది తినేటప్పుడు, తాగేటప్పుడు తెలియకుండానే కొంత గాలిని లోపలికి మింగేస్తుంటారు. అలా ఆ గాలి పొట్టలో పేరుకుపోయి,కాసేపటి తర్వాత తిరిగి నోటి ద్వారా ఆ గాలి బయటకు రావడాన్నే తేన్పు(Burps) అంటారు. ఇది ఒక సహజమైన ప్రక్రియే అయినా కూడా అది మితిమీరితే మాత్రం అది జీర్ణ వ్యవస్థ పంపే హెచ్చరికగా అంతా భావించాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఆహారం తీసుకునే పద్ధతి తెలీక చేసే చిన్న చిన్న పొరపాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణమని డాక్టర్లు అంటున్నారు. ముఖ్యంగా ఫాస్టు ఫాస్టుగా భోజనం చేయడం, తింటున్నప్పుడు మాట్లాడటం వల్ల ఎక్కువ మొత్తంలో గాలి లోపలికి వెళ్తుంది. అలాగే సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి కార్బోనేటెడ్ పానీయాలు తాగడం, స్ట్రాలను ఉపయోగించడం, తరచుగా చూయింగ్ గమ్ నమలడం వంటి అలవాట్లు కూడా పొట్టలో గాలిని నింపేస్తాయి.
వీటితో పాటు బ్రోకోలీ, క్యాబేజీ వంటి కొన్ని రకాల కూరగాయలు కూడా జీర్ణక్రియలో ఎక్కువ గ్యాస్‌ను రిలీజ్ చేస్తాయి.అయితే కొంతమందికి పుట్టుకతోనే అన్నవాహిక దగ్గర ఉండే కండరాలు లూజుగా ఉండటం వల్ల కూడా కొంచెం గాలి చేరినా కూడా వెంటనే రిఫ్లెక్స్ లాగా బయటకు వచ్చేస్తుంది. కేవలం శారీరక కారణాలే కాదు, మితిమీరిన ఆందోళన , మానసిక ఒత్తిడి కూడా తేన్పులకు దారి తీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్యను తగ్గించుకోవడానికి మందుల కంటే ముందు మన అలవాట్లను మార్చుకోవడం ముఖ్యం. భోజనాన్ని బాగా నమిలి, నిదానంగా తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో మసాలాలు, నూనె పదార్ధాలను తగ్గించి తేలికపాటి భోజనం తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు ఎక్సర్సైజులు చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఒకవేళ మీకు తేన్పులతో పాటు కడుపు నొప్పి, వాంతులు, ఆకలి మందగించడం , బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. అవి తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలకు కానీ, అల్సర్లకు కానీ సంకేతాలు కావచ్చు.అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
అయితే తేన్పుల ఇబ్బందిని తగ్గించే కొన్ని చిట్కాలు మన వంటింట్లోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు (Fennel Seeds) నమలడం వల్ల గ్యాస్ త్వరగా రిలీజవుతుంది. అల్లం ముక్కను తేనెతో కలిపి తీసుకోవడం లేదా అల్లం టీ తాగడం వల్ల కడుపులో మంట తగ్గి జీర్ణక్రియ ఈజీగా సాగుతుంది. అలాగే జీలకర్రను నీటిలో మరిగించి ఆ నీటిని ఉదయన్నే తాగడం వల్ల కడుపు ఉబ్బరం నుంచి క్రమంగా రిలీఫ్ లభిస్తుంది. అంతేకాదు రాత్రిపూట డిన్నర్ చేసిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు అటు ఇటు నడవడం వల్ల గాలి పైకి రాకుండా ఉంటుంది. రోజుకు సరిపడా నీరు తాగడం, పెరుగులో ప్రో బయోటిన్ ఉంటుంది కాబట్టి దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే తేన్పుల సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Thieves : నమ్మితే నట్టేట ముంచేస్తున్నారా? బంధువుల్లో, స్నేహితులలో దొంగలు ఎందుకు ఉంటారు?





