Honest : దర్జాగా తిరుగుతున్న అబద్ధం.. సొసైటీలో నిజాయితీ ఎందుకు ఓడిపోతుంది?
Honest : మనిషికున్న నైజం ప్రకారం ఎవరైనా ఏడుస్తూ , బాధపడుతూ ఒక విషయాన్ని చెబుతుంటే.. మెదడులోని ఎంపతీ అనే గుణం చాలా త్వరగా యాక్టివేట్ అవుతుంది
Honest
ఈ రోజుల్లో నిజాయితీగా ఉండేవాళ్లకు కాలం లేదని.. అబద్ధాలు చెప్పేవాళ్లు మాత్రం హాయిగా బతికేస్తున్నారని చాలామంది బాధపడుతుంటారు. ఇది వినడానికి నార్మల్‌గానే అన్పించినా.. సొసైటీలో జరుగుతుంది ఇదే. ఎందుకంటే తప్పు చేసినవాడు తన అబద్ధాన్ని ఒక అద్భుతమైన ఆర్ట్‌లా ఇతరులకు చెప్పడమే.
వినేవాళ్లకు తనపైన విపరీతమైన సింపతీ పెరిగేలా, అసలు తనది తప్పే లేదన్నట్లుగా ఎదుటివాళ్ల దగ్గర సీన్ క్రియేట్ చేస్తాడు. నిజానికి ఇక్కడ అలా అబద్ధాలు చెప్పేవాడి కంటే కూడా దాన్ని గుడ్డిగా నమ్మేవాళ్లను చూస్తేనే ఎక్కువ ఆశ్చర్యం వేస్తుంది.
ఒక గొడవ కానీ సమస్య కానీ వచ్చినప్పుడు 2 వైపులా విని న్యాయం చెప్పాల్సిన పెద్దలు , చుట్టుపక్కల వాళ్లు కూడా.. ఎవరు ఏడుస్తూ విషయాన్ని చెబుతారో, ఎవరు మాటలతో డ్రామాలు ప్లే చేస్తారో వాళ్లనే నమ్ముతారు.
అయితే ఇలా అందరినీ నమ్మించడానికి అబద్ధాలు చెప్పేవాళ్లకు విక్టిమ్ కార్డ్ (Victim Card) ప్లే చేయడం అనే ఒక ప్రత్యేకమైన సైకలాజికల్ ట్రిక్ తెలుసు. తప్పు తామే చేసి.. ఎదుటివాళ్లే తనను వేధించారంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.
మనిషికున్న నైజం ప్రకారం ఎవరైనా ఏడుస్తూ , బాధపడుతూ ఒక విషయాన్ని చెబుతుంటే.. మెదడులోని ఎంపతీ అనే గుణం చాలా త్వరగా యాక్టివేట్ అవుతుంది. దాంతో వారి మాటలను వినేవాళ్లు నిజాలను, లాజిక్కులను అన్నిటినీ పక్కన పెట్టేసి, కేవలం ఆ క్షణంలో కనిపించే ఆ ఎమోషన్‌కు మాత్రమే కనెక్ట్ అయిపోతారు.
అంతేకాదు ఇలా విక్టిమ్ కార్డ్ ప్లే చేసేవాళ్ల చేతిలో వారిని నమ్మేవాళ్లు ఎప్పుడో లొంగిపోయి ఉంటారు. వారి మాటల గారడీకి ముందే బానిసలైపోవడం వల్ల.. వాడు తప్పు చేసినా కూడా సమర్థించడానికి వెనకాడరు. అన్నింటికంటే ముఖ్యంగా, ఎవరైతే నిజాయితీగా(Honest )ఉంటారో వాళ్ల నిజాయితీని(Honest), ఎదుగుదలను చూసి జెలస్ , కోపం పెంచుకున్నవారికి ఇదొక అద్భుతమైన అవకాశంగా దొరుకుతుంది.
అబద్ధాలు చెప్పేవాళ్ల మాటలను ఒక ఆయుధంగా వాడుకుని, నిజాయితీపరులపై తమకున్న పాత కక్షలను, ఈర్ష్యను చాలా పద్ధతిగా తీర్చుకుంటారు. అయితే ఈ విషయంలో డైరెక్టుగా మాట్లాడకుండా ఏడ్చేవారి ఏడుపును అడ్డం పెట్టుకుని నిజాయితీపరుడి క్యారెక్టర్‌ను ఇలాంటివారందరూ కలిసి ఖూనీ చేస్తారు.
దీనికి తోడు ఇక్కడ బ్యాండ్ వాగన్ ఎఫెక్ట్ (Bandwagon Effect) అనే సైకలాజికల్ ఫినామినన్ కూడా ఇక్కడ పనిచేస్తుంది. దీని సింపుల్ లాజిక్ ఏంటంటే.. నలుగురూ ఏది నమ్మితే, ఏది మాట్లాడితే అదే నిజం అనుకుని మిగిలిన వాళ్లు కూడా దానినే ఫాలో అయి ఆ గుంపులో చేరిపోతారు. అలా తాము నమ్మిన విషయాన్ని ఓ నలుగురు మైండ్లలోకి ఎక్కిస్తారు.
వారు ఈ అబద్ధాన్ని ఊరంతా ప్రచారం చేయడం మొదలుపెడతారు. ఈ ఎఫెక్ట్ వల్ల మెజారిటీ జనాలు నిజం వైపు కాకుండా, ఈ గుంపు మాట్లాడే మాటల్లో అటే కొట్టుకుపోతారు. చివరకు రెండు వైపులా విని తీర్పు చెప్పాల్సిన పెద్దలు కూడా ఈ ప్రెజర్‌ను తట్టుకోలేక, ఆ మెజారిటీ గుంపును చూసి భయపడి, నిజం వైపు నిలబడే ధైర్యం లేక అబద్ధాలు చెప్పేవారికే వత్తాసు పలుకుతారు.

నిజాయితీగా(Honest) ఉండేవాడికి తాను తప్పు చేయలేదు అనే ఒకే ఒక్క నమ్మకం మాత్రమే ఉంటుంది. అందుకే వాడు అబద్ధాలు చెప్పి అవతలి వారిలా నలుగురి ముందూ సింపతీ డ్రామాలు ఆడలేడు, గట్టిగట్టిగా మాట్లాడలేడు. ఈ నిశ్శబ్దమే వాడికి పెద్ద మైనస్ అవుతుంది.
నిజానికి 2 వైపులా నిజాలు తెలుసుకోకుండా, కేవలం ఏడ్చేవాళ్ల మాటలను మాత్రమే నమ్మి, లోపల ఉన్న అసూయను తీర్చుకుంటూ ఇచ్చే తీర్పులెప్పటికీ కరెక్ట్ కాదు. కన్నీళ్లు ఎప్పుడూ నిజాయితీకి సర్టిఫికెట్లు కావనే కనీస జ్ఞానం.. వారిని నమ్మేవాళ్లకు ఉన్నప్పుడే నిజం నిర్భయంగా ఉండగలుగుతుంది.
IND vs AFG : ఆఫ్గాన్‌కు క్లీన్ స్వీప్ గండం.. వైట్‌వాష్ నుంచి తప్పించుకోగలదా?





