Passive Resistance
మన ఎదురుగా కూర్చుని చెప్పేదంతా చాలా ఓపికగా, ఆసక్తిగా వింటారు. అవును, మీరు చెప్పింది కరెక్టేనని ఇకపై అదే ఫాలో అవుతానని చెబుతారు. దీంతో వాళ్లు మన మాటను పూర్తిగా అర్థం చేసుకున్నారని, మనం చెప్పినట్లే నడుచుకుంటారని నమ్ముతాం.
కానీ చివరకు చూస్తే తమకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే నిశ్శబ్దంగా పూర్తి చేసేసుకుంటారు. ఇలా కొంతమంది మనుషులు గొడవపడకుండా, ఎదురు చెప్పకుండా సైలెంట్‌గా తమకు నచ్చిన దారినే ఎందుకు వెళతారనే దాని వెనుక బలమైన సైకాలజీ దాగి ఉందట.
సైకాలజీలో దీనినే పాసివ్ రెసిస్టెన్స్(Passive resistance) లేదా నిశ్శబ్ద ప్రతిఘటన (Silent resistance)అంటారు. చాలామందికి ఇతరులతో డైరెక్టుగా వాదించడం, గొడవపడటం ఇష్టం ఉండదు. కొన్నిసార్లు వాళ్లతో ఓపెన్‌గా వద్దు అని చెబితే వచ్చే పరిణామాలకు భయపడతారు. అందుకే బయటకు అన్నింటికీ తలాడిస్తూ, లోపల మాత్రం తమకు నచ్చినట్లుగానే ప్రవర్తిస్తుంటారు.
అయితే ఇది కేవలం మొహమాటం వల్ల వచ్చేది కాదు, ఇదొక రకమైన డిఫెన్స్ మెకానిజం అంటారు సైకాలజిస్టులు. ఎందుకంటే అవతలి వ్యక్తి బాగా డామినేటింగ్ నేచర్ కలిగి ఉండటమో లేదంటే మన అభిప్రాయాలకు విలువ ఇవ్వరని ముందే అర్థమైనప్పుడో, వాళ్లతో వాదించి శక్తిని వేస్ట్ చేసుకోవడం కంటే ‘వినినట్లు నటించి మన పని మనం చేసుకోవడమే బెటర్’ అనే నిర్ణయానికి వచ్చేస్తారు.
అంతేకాదు ఇంకొన్ని సార్లు విషయం చెప్పేవాళ్లు.. ఎదుటి వ్యక్తులకు బాగా కావాల్సినవాళ్లు అయినపుడు అపుడే నో చెబితే వారు ఫీలవుతారని..తర్వాత మెల్లగా తెలిస్తే నచ్చజెప్పుకోవచ్చని కూడా ఆలోచిస్తుంటారు. అలాగే బాగా మూర్ఖత్వం ఉన్నవాళ్లు కూడా వాళ్లు చెప్పింది నేను వినడం ఏంటనే ఈగోకు పోతుంటారు.
ఈ రకమైన మైండ్‌సెట్ ఉన్నవారు ఎప్పుడూ తమ పర్సనల్ స్పేస్‌ను, ఫ్రీడమ్‌ను ఎవరో చెప్పారని దానికోసం రాజీ పడటానికి ఇష్టపడరు. పైకి మాత్రం ఎవరినీ నొప్పించకుండా ఉండటం వల్ల తాము సేఫ్‌గా ఉన్నామని భావిస్తారు.
అయితే రిలేషన్షిప్స్లో లేదా ఆఫీసుల్లోనూ ఇలాంటి బిహేవియర్ ఎదురైనప్పుడు అవతలి వ్యక్తికి కోపం పెరిగి, నమ్మకం కోల్పోతారు. తాను చెప్పింది విన్నారని నమ్మి మోసపోయామని వారు ఫీలవుతారు.
అందుకే ఒకరితో సత్సంబంధాలు ఉండాలంటే క్లియర్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, కానీ ఇలాంటి సైలెంట్ రూట్ ఎంచుకోవడం వల్ల టెంపరరీగా గొడవలు లేకపోయినా, దీర్ఘకాలంలో రిలేషన్లో నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి ఎవరినైనా అంచనా వేసే ముందు, వారిలో ఉన్న ఇలాంటి సైలెంట్ మైండ్‌గేమ్‌ను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
