Just LifestyleLatest News

Relatives: బంధువులలో పెరుగుతున్న నిశ్శబ్ద విషం..చుట్టాల ఎదుగుదలను ఎందుకు ఓర్వలేకపోతున్నారు?

Relatives: ఎదుటివారు బాగున్నప్పుడు ఓర్వలేని ఈ చుట్టాలే.. అదే వాళ్లు ఏదైనా నష్టంలోనో, కష్టంలోనో, అనారోగ్యం బారినో పడినప్పుడు మాత్రం లోలోపల పండగ చేసుకుంటారు.

Relatives

లోకమంతా మన ఎదుగుదలను చూసి కుళ్లుకుంటే జరిగే నష్టం ఏమీ ఉండదు. కానీ అలాంటి వారిలో మనతోనే ఉంటూ మన వెనకాల అసూయపడే బంధువులు(Relatives) ఉంటేనే అసలైన నరకం కనిపిస్తుంది. నిజానికి బంధువుల మధ్య ఉండే ఈ జెలస్ అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే ఈ డిజిటల్ యుగంలో ఇది మరింత ప్రమాదకరంగా మారిపోయింది.

ఒకప్పుడు చుట్టాలంటే కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయులు అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు చాలా కుటుంబాలలో ఒకరు బాగుపడితే ఇంకొకరు చూసి తట్టుకోలేకపోతున్నవారి సంఖ్యే ఎక్కువయిపోతుంది. ముఖంపై నకిలీ నవ్వులు చిందిస్తూ లోపల కుళ్లుకునే మనస్తత్వాలు పెరిగిపోతున్నాయి. ఎవరింట్లోనైనా పెళ్లి గానీ, గృహప్రవేశం వంటి ఫంక్షన్లు జరిగితే.. అక్కడికి వెళ్లి సంతోషపడి మనసారా ఆశీర్వదించడం పక్కన పెట్టి,తమతో పోల్చుకుని లోలోపల ఏడుస్తున్నారు.

అందరి ముందూ భలే చేశారండీ అని మెచ్చుకుంటున్న ఆ బంధువులే.. వెనక్కి వెళ్లాక అదంతా అప్పులు తెచ్చి చేసిన ఆడంబరమే, అంత బిల్డప్ అవసరమా అంటూనో, ఆ ఫంక్షన్లో ఏదొక వంకను హైలైట్ చేసో చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఎదుటివారి సంతోషాన్ని అస్సలు భరించలేక వెనకాల మాట్లాడే ఈ అలవాటు బంధాల విలువను పూర్తిగా పాడు చేస్తోందన్న విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.

ఈ రోజుల్లో బంధువుల(Relatives) మధ్య అసూయ ఎక్కువగా పిల్లల చదువులు, ఉద్యోగాల చుట్టూనే తిరుగుతోంది. ఎవరి కొడుకైనా విదేశాలు వెళ్లినా, లేదా ఎవరి కూతురికైనా మంచి జీతంతో ఉద్యోగం వచ్చినా.. మనస్ఫూర్తిగా దీవించాల్సింది పోయి తమ పిల్లలకి రాలేదేంటని రగిలిపోతుంటారు. ఆ కుళ్లు ఎంతవరకు వెళ్తుందంటే.. ఆ పిల్లల్లో ఏదో ఒక తప్పు వెతకడం మొదలుపెడతారు. డబ్బులు ఉంటే ఏం లాభం.. పెద్దలకి గౌరవం ఇవ్వడం రాదనో లేదంటే అమెరికా వెళ్తే మాత్రం ఇక్కడ తల్లిదండ్రులను వదిలేశారుగా అంటూ తమలోని అసూయను కప్పిపుచ్చుకోవడానికి వారి పనులలోని లోపాలు వెతికే పనిలో పడుతున్నారు.

ఈ అసూయ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు బంధువుల(Relatives)లోని అసలైన బుద్ధి బయటపడుతుంది. ఎదుటివారు బాగున్నప్పుడు ఓర్వలేని ఈ చుట్టాలే.. అదే వాళ్లు ఏదైనా నష్టంలోనో, కష్టంలోనో, అనారోగ్యం బారినో పడినప్పుడు మాత్రం లోలోపల పండగ చేసుకుంటారు. పైకి జాలి నటిస్తూనే, వెనక మాత్రం అప్పట్లో అంత ఎగిరెగిరి పడ్డారు కదా.. ఇప్పుడు బాగా అయింది, దేవుడు సరైన బుద్ధి చెప్పాడంటూ సంతోషపడతారు.

Relatives
Relatives

ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు రావడం వల్ల.. కేవలం తన ఇల్లు, తన పిల్లలు మాత్రమే బాగుండాలి, పక్కన ఉన్న తన సొంత అన్నదమ్ముల కుటుంబం తనకంటే వెనుకబడే ఉండాలనే స్వార్థం మనుషులను పాడు చేస్తోంది.ఇక్కడే ఒక విషయాన్ని వీళ్లు మర్చిపోతున్నారు.. వాళ్లు బాగుంటే తమలాంటి ఓ నలుగురిని ఆదరిస్తారు, ఆదుకుంటారు కదా అన్న ఆలోచన పోయి.. ఎంత సేపు వాడు తనకంటే ఎదిగిపోయాడే అన్న అసూయనే బయటపెడుతున్నారు.

ఇప్పుడు బంధుత్వాలన్నీ కేవలం అవసరాన్ని బట్టి నడిచే నకిలీ ముసుగులుగా మారిపోతున్నాయి. అవసరానికి కలుసుకునే మనుషులు తప్ప మనస్ఫూర్తిగా కలవడం అనేది లేకుండా పోతోంది. నిజానికి ఒకరి సంతోషాన్ని చూసి ఈర్ష్య పడటం వల్ల వారి ఎదుగుదల ఆగదు, కానీ తమ మనసులోని ప్రశాంతత,తమ ఆరోగ్యమే పాడవుతాయన్న విషయాన్ని వాళ్లు మర్చిపోతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి మైండ్‌సెట్‌ను పక్కన పెట్టి తోటివారి సంతోషంలో భాగమవ్వడం అలవాటు చేసుకుంటే మనుషుల మధ్య బంధాలు నిలబడతాయి.

Ebola Virus : మరోసారి లాక్ డౌన్ తప్పదా ?..ఆఫ్రికాలో ఎబోలా మరణ మృదంగ

Related Articles

Back to top button