Relationships
మనిషి జీవితంలో బంధాలనేవి ఒక అందమైన నందనవనం వంటివి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు ,స్నేహితులు , ప్రేమికులు ఇలా ఎవరైనా సరే, ఒక బంధం(Relationships) నిలబడాలంటే మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం . ఎందుకంటే కేవలం ఇలాంటి కారణాలతోనే ఎన్నో బంధాలు నిశ్శబ్దంగా విచ్ఛిన్నమయిపోతున్నాయి.
అయితే ఇప్పుడు చాలా బంధాలు(Relationships) బలహీనపడటానికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మెయిన్ రీజన్ అవుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే మనసులో ఉన్న భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం , ఎదుటివారు చెప్పేది వినకపోవడం, అవతలి వ్యక్తికి సరిగ్గా చేరలేకపోవడం చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక చిన్న మాటతో పరిష్కారమయ్యే సమస్యను, మౌనంతో పెద్దది చేసుకుని దూరం పెంచుకునే స్థాయికి వెళ్లిపోవడం అనేది ఇప్పుడు చాలా ఇళ్లలో కనిపిస్తున్న సాధారణ దృశ్యంగా మారిపోయింది. దీనివల్ల కలిగే మానసిక వేదన అనుభవించిన వారికి మాత్రమే అర్ధం అవుతుంది.
అయితే ఈ విషయంలో చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు. గొడవ జరిగినప్పుడు , ఏదైనా నచ్చనప్పుడు అవతలి వ్యక్తితో మాట్లాడటం మానేస్తారు. తాను చెప్పకపోయినా వాళ్లే అర్థం చేసుకోవాలి, తన మీద ప్రేమ ఉంటే వాళ్లకు తెలియాలి కదా అని ఆశిస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, ప్రతీ మనిషి మెదడు ఎదుటివారి మనసును చదివేంత శక్తివంతమైనది కాదంటారు. అందుకే మనం చెప్పనంత వరకు మన లోపల ఏముందో ఎవరికీ పూర్తిగా తెలిసే అవకాశం ఉండదని చెబుతారు.
కానీ చాలామందిలో ఈ మౌనం అనేది ఒక రకమైన శిక్షలా మారి, అవతలి వ్యక్తిలో కూడా అయోమయాన్ని, కోపాన్ని పెంచి మరింత దూరాన్ని పెంచే అవకాశం ఉంటుంది. నిజానికి మౌనాన్ని ఆయుధంగా వాడటం వల్ల సమస్య పరిష్కారం కాదు కదా చివరకు అది వారిద్దరి బంధం చుట్టూ దూరాన్ని పెంచేలా ఒక బలమైన గోడను నిర్మిస్తుంది. అలా ఈ గోడ ఎంత ఎత్తు పెరుగుతుందంటే, ఒకానొక దశలో ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉన్నా, లక్షల మైళ్ల దూరంలో ఉన్నట్లు అక్కడి పరిస్థితులు తయారవుతాయి.
కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడటానికి మరో కారణం డిఫెన్సివ్ లిజనింగ్ అంటారు సైకాలజిస్టులు. అంటే అవతలి వ్యక్తి ఏదైనా చెబుతున్నప్పుడు, వారిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా, వారికి తిరిగి ఎదురు సమాధానం చెప్పడానికో , వారిని వారు సమర్థించుకోవడానికో ప్రయత్నిస్తారు. ఇది వారిద్దరి మధ్య చర్చను గొడవగా మారే స్టేజికి తీసుకుని వెళ్లిపోతుంది.
అలాగే, మన పార్టనర్ చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకుండా .. నువ్వు ఎప్పుడూ ఇంతే, నువ్వు నీ వెర్షన్‌లోనే చూస్తావు, నువ్వు మారవు వంటి ఆరోపణలు చేయడం వల్ల అవతలి వ్యక్తి మనసు ఇంకా గాయపడుతుంది. దీనికి బదులుగా,నన్ను దూరం పెట్టేలా ఇలా చేయడం వల్ల నాకు బాధనిపించింది, నాకు ఈ విషయంలో నీ సహాయం కావాలని మన భావాలను (I-statements) ఓపెన్‌గా పంచుకోవడం వల్ల ఎదుటివ్యక్తి మనసులోని బాధ తగ్గడమే కాకుండా మనల్ని అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన బంధం ఎప్పుడూ ఒకేలా కొనసాగాలంటే, మాట్లాడటం ఎంత ముఖ్యమో, ఎదుట వ్యక్తి వినడం కూడా అంతే ముఖ్యం. ఎదుటివ్యక్తి ఏదైనా చెబుతున్నప్పుడు వారి కళ్లలోకి చూస్తూ, వారు చెప్పే సమస్యను ..మన పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతీ చిన్న విషయాన్ని మనసుకి తీసుకోకుండా, ఒకరి తప్పులను మరొకరు మన్నించుకోవడం నేర్చుకోవాలి.
రోజుకు కనీసం పది నిమిషాలైనా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి బంధం అయినా బలపడుతుంది. మరో విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.. ప్రపంచంలో ఏ సమస్య అయినా, ఎలాంటి పెద్ద ప్రాబ్లెమ్ అయినా సరే కూర్చుని మాట్లాడితే ఈజీగా పరిష్కారమవుతుంది. మౌనం కంటే మాటే బంధాన్ని(Relationships) కాపాడుతుందన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.
బంధాలను(Relationships) తెంచుకోవడం చాలా ఈజీ, కానీ వాటిని నిలబెట్టుకోవడంలోనే అసలు టాలెంట్ ఉంది. దీనిలో ప్రాణం పోసేది కేవలం మీ ప్రేమపూర్వకమైన మాట మాత్రమే అన్న విషయాన్ని ఆకళింపు చేసుకుంటే ఎలాంటి బంధం అయినా స్ట్రాంగ్‌గా పదికాలాలు కొనసాగుతుంది.
Gauge Test : బ్యాట్లను తనిఖీ చేస్తున్న అంపైర్లు…అసలు ఏంటీ గేజ్ టెస్ట్ ?
